
పచ్‌మఢి పరవశింపజేసే ప్రకృతి ఒడి
పాఠక పర్యటన
మన దేశంలో మధ్యప్రదేశ్‌లోని ఏకైక హిల్‌స్టేషన్ పచ్‌మఢి. అత్యంత మహిమాన్వితమైన గుప్త్‌మహాదేవ్, జటాశంకర్ వంటి శివాలయాలు, సాత్పూర జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఇన్ని ఆకర్షణలుగల ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించాం.
మా కుటుంబ సభ్యులు, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ అదనపు డెరైక్టర్ పెనుమూడి బీవీ శర్మ కుటుంబసభ్యులు కలసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 10.45 నిమిషాలకు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 లకు మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ జంక్షన్‌కు చేరుకున్నాం. బస్సులో పచ్‌మఢి చేరుకునేందుకు తగిన వెసులుబాటు లేకపోవడంతో కారు అద్దెకు మాట్లాడుకుని వెళ్లి, ఆ రాత్రి ఉడ్‌లాండ్ రిసార్ట్స్‌లో విశ్రమించాం.
పాండవ గుహలు
మరుసటి రోజు ఇరు కుటుంబాలవారం పాండవ గుహల సందర్శనకు వెళ్లాం. చారిత్రక కథనం ప్రకారం... పాండవు లు అజ్ఞాతవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. అయితే, ఇది ఒక బౌద్ధ ఆరామమని భారతీయ పురావస్తు శాఖ పేర్కొంటోంది. ఈ కొండపై శిథిలావస్థ కు చేరుకున్న అత్యంత ప్రాచీన ఇటుకరాయి నిర్మాణం, కొండపై భాగం నుంచి కిందకు చూస్తే అక్కడ ఉన్న ఉద్యానవనం ఎంతో సుందరంగా గోచరిస్తాయి.
జలపాతాల జడివాన
ఆ తర్వాత వెండి జలపాతం వద్దకు వెళ్లాం. దీన్ని దూరం నుంచే చూడాలి. అక్కడి నుంచి బయలుదేరి అప్సర విహార్ అనే మరో జలపాతాన్ని సందర్శించాం. ఇది పచ్‌మఢి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈత కొట్టేందుకు, డైవింగ్ చేసేందుకు ఎంతో అనువుగా ఉంది. దీనిని గతంలో ‘ఫెయిరీ పూల్’ అని పిలిచేవారు. ఇక్కడకు సమీపంలోనే పాంచాలి, బీ ఫాల్స్ జలపాతాలున్నాయి. 150 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారే బీ ఫాల్స్ జలపాతం పాల ధారలా కనువిందు చేస్తుంది. ఈ జలపాతం నుంచే పచ్‌మఢి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతుంది.
గుహలో శివలింగం
రెండో రోజు ఉదయం పిపరియా పట్టణానికి వెళ్లే మార్గంలో జటా శంకర్ ఆలయాన్ని సందర్శించాం. ఈ ఆలయానికి వెళ్లే దారిలో ఒక కొండ మీద నంది, మరో కొండమీద మర్కటం, ఏనుగు తొండం, సింహం ముఖం ఆకృతులు.. కనిపించాయి. ఇవన్నీ సహజసిద్ధంగా ఏర్పడినవే. కొంతదూరం వెళ్లిన తర్వాత మెట్ల దారిలో ఒక గుహ ఉంది. లోపల సహజసిద్ధంగా ఆవిర్భవించిన శివలింగం మాకు దర్శనమిచ్చింది. అనంతరం నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్యాండిఖో ప్రాంతానికి చేరుకున్నాం. ఇది దాదాపు 350 అడుగుల లోతు కలిగిన లోయ. ఈ పర్వత శ్రేణులనే సాత్పూర అని పిలుస్తారు.
మేనును తాకే మేఘాలు
ఆ తర్వాత రోజు మహాదేవ్ ఆల య సందర్శనకు వెళ్లాం. ఇక్కడి కొండరాళ్లు వర్షాకాలంలో నీటిని పీల్చుకుని ఎండాకాలం విడిచిపెడతాయట. అనంతరం కాలినడకన గుప్త్‌మహాదేవ్ ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడ ఉన్న సన్నని గుహ ద్వారా ఒకరి తరువాత ఒకరం వెళ్లాం. ఆ తరువాత సైట్ సీయింగ్‌లో భాగంగా రాజేంద్రగిరి పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నాం. ఆ సమయంలో అటుగా వచ్చిన నీలి మేఘాలు మమ్మల్ని తాకుతూ ముందుకు సాగాయి. మేఘాలు మేనును తాకడం తొలిసారి కావడంతో మా ఆనందానికి హద్దుల్లేవు.
ఇక చివరి రోజు పర్యటనలో భాగంగా రీచ్‌గఢ్ చేరుకున్నాం. ఇక్కడి గుహలకు మూడువైపుల నుంచి ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఆ తరువాత ఆసన్ దశ్య ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడి ప్రకృతి అందాలు పరవశింప చేశాయి. ఇక్కడి నుంచి చూస్తే ఎత్తయిన పర్వత శిఖరాలు, అత్యంత లోతైన లోయలు దర్శనమిస్తాయి. దీనికి సమీపంలో గల అంబామాయి ఆలయంలో మాతను సర్వశక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఇది అత్యంత ప్రాచీన దేవాలయం. దీని పక్కనే ముస్లింలు నిర్మించిన బేగం ప్యాలెస్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.
దూరం నుంచి చూడాల్సిందే తప్ప దగ్గరికి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ ప్యాలెస్ దర్శనంతో మా పర్యటన ముగిసింది. చివరిరోజు రాత్రి ఇటార్సీకి చేరుకుని యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో మరుసటిరోజు సికింద్రాబాద్ చేరుకున్నాం. ఈ యాత్ర మొత్తానికి మా ఇరు కుటుంబాలకు కలిపి దాదాపు 30 వేల రూపాయల ఖర్చు అయ్యింది.
- కొల్లూరి సత్యనారాయణ, ఇంకొల్లు, ప్రకాశం జిల్లా