వ్యాధులు నయం చేసే పాలజ్ కర్ర గణే శుడు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠి గ్రామం పాలజ్. ఈ చిన్న మారుమూల పల్లె 15 ఏళ్లుగా లక్షలాది మంది నోళ్లల్లో నానుతోంది. ఇక్కడి ప్రత్యేకతే ఈ కుగ్రామానికి ప్రతిఏటా లక్షలాదిమందిని రప్పిస్తోంది. ఎక్కడా లేని విధంగా వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి.. పూజించడమే ఈ పాలజ్ ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరే కర్రగణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందాడు. పాలజ్‌లో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు. గణేశ్ ఉత్సవాలన్ని రోజులూ ఈ ఊరి పేరు ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతుంది.
తెలంగాణ సరిహద్దు మండలమైన కుభీర్‌కు పక్కనే మహారాష్ట్రలోని బోకర్ తాలూకాలో పాలజ్ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948లో నిర్మల్‌కు చెందిన నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ కర్రతో మలిచిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి వినాయకచవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి, చివరిరోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్ కర్రగణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది.
ఊరంతా మంచం పట్టిందని...
స్వాతంత్య్రానికి పూర్వం పాలజ్ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా మంచం పట్టింది. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా గణేశుని నమ్ముకుందాం.. అని నిశ్చయించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కర్రగణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మల్‌లో కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీవర్మను రప్పించి సుందరమైన కర్ర గణేశుడి విగ్రహాన్ని చేయించారు.
ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా అప్పటి నుంచి కర్ర గణేశుడిని మాత్రమే వినాయక ఉత్సవాల్లో కొలువడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఇక్కడ పూజలు చేసి, ముడుపు కడితే కోరుకున్న పని జరిగి తీరుతుందన్న నమ్మకం ఉంది. ముందుగా ఈ ఊరికి చెందిన ఆడపడుచుల ద్వారా కర్రగణేశుడి మహిమ ఇతర గ్రామాలకు తెలిసింది. అలా ఊరూరా పాలజ్ ప్రత్యేకత విస్తరిస్తూ ఇప్పుడు ఏకంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర అంతా వ్యాపించింది.
సుందర రూపుడిగా
కర్రతో చేసిందైనా.. నకాషీ కళాకారుడైన గుండాజీవర్మ చేతుల్లో సుందరంగా రూపుదిద్దుకున్నాడు ఇక్కడి లంబోదరుడు. అసలు.. కర్రతో ఇంత అందంగా విగ్రహాన్ని మలచవచ్చా.. అనేంత నునుపుగా గణపయ్యను తీర్చిదిద్దాడు. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగుచేతుల వాడిగా.. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరోచేతిలో త్రిశూలం, ఇంకోచేతిలో లడ్డులతోపాటు కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటాడు.
కలిసికట్టుగా
లక్షల్లో తరలివచ్చే భక్తులతో పాలజ్ ఆలయానికి ఆదాయమూ లక్షల్లోనే వస్తోంది. ఈ గ్రామస్తులు కలిసికట్టుగా కర్రగణేశుడి సేవలో పాల్గొంటారు. గత ఏడాది 11 రోజుల ఉత్సవాల్లో ఆలయానికి రూ. 80 లక్షల ఆదాయం వచ్చింది. రూ. 11 లక్షల ఖర్చులు పోను రూ. 69 లక్షల కానుకలు మిగిలాయి. పదేళ్ల కింద సాదాసీదాగా ఉండే పాలజ్ ఆలయం ఇప్పుడు సరికొత్త హంగులతో ఇరుగుపొరుగు జిల్లాలవారినీ ఆకట్టుకుంటోంది.
2004 ప్రాంతంలో ఆలయ కమిటీ వద్ద మొత్తానికి, గ్రామస్తులు చందాలు పోగు చేసి సేకరించిన మరో రూ. 2 లక్షలు కలిపి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందంగా నిర్మించిన ఆలయం పూర్తయిన తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గ్రామస్తులే కోటి రూపాయలతో అన్నదాన సత్రాలు, స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాలకూ ఇక్కడి నుంచి శుద్ధ నీరు అందిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు వేశారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చారు.
పాలజ్ వెళ్లడం ఇలా...
హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసరల మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. వాహనాల కోసం ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. – పుప్పాల హన్మాండ్లు సాక్షి, భైంసా, నిర్మల్ జిల్లా
అన్ని ఏర్పాట్లు చేశాం..
పాలజ్‌లో భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం. బారికేడ్లు, తాగునీరు, తీర్థప్రసాదాలు అందిస్తున్నాం. వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. భక్తులకు అల్పాహారాన్నీ అందిస్తాం. – గంధం గణేశ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు