మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి! | Paris Love Lock Bridge | Sakshi
Sakshi News home page

మీ ప్రేమ బంధానికి ఓ తాళం వేసిరండి!

Published Tue, Oct 1 2019 12:58 PM | Last Updated on Sat, Oct 5 2019 11:47 AM

Paris Love Lock Bridge - Sakshi

మీ ప్రేమను విడదీయలేని బంధంగా మార్చుకోవాలనుందా? అయితే తప్పకుండా పారిస్‌లోని లవ్‌ లాక్‌ బ్రిడ్జి దగ్గరకు వెళ్లండి! మీ ప్రేమ బంధానికి శాశ్వతంగా ఓ తాళం వేసి రండి. ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరంలో ఉన్న ఈ లవ్‌ లాక్‌ బ్రిడ్జి‘‘ పాంట్‌ డెస్‌ ఆర్ట్స్‌’’  రేయిలింగ్‌లకు తాళాలను లాక్‌ చేస్తే.. ఆ బంధం విడదీయలేనిదిగా మారుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రేమికుల నమ్మకం. అందుకే ప్రపంచం నలుదిక్కులనుంచి ప్రేమికులు ఆ బ్రిడ్జిని సందర్శిస్తుంటారు.

విడదీయలేని బంధంగా నిలవాలని.. 
సెర్బియాకు చెందిన నాద అనే ఉపాధ్యాయిని రెయిజా అనే సైనికాధికారిని ప్రాణంగా ప్రేమించింది. రెయిజాకు కూడా నాద అంటే ఎంతో ప్రేమ. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో రెయిజా యుద్ధంలో పాల్గొనటానికి గ్రీసు వెళ్లిపోతాడు. అక్కడే కోర్ఫు అనే యువతితో ప్రేమలో పడతాడు. అప్పటినుంచి రెయిజా, నాదను పూర్తిగా మరిచిపోతాడు. ఈ విషయం నాదకు తెలస్తుంది!  ప్రేమ చేసిన గాయంతో ఆమె కోలుకోలేకపోతుంది. ఆ కొద్దిరోజులకే గుండెపగిలి చచ్చిపోతుంది. ఇక అప్పటినుంచి ఆ ప్రాంతానికి చెందిన యువతులు తమ ప్రేమను కాపాడుకోవటం కోసం తాళాల మీద తమ పేర్లను రాసి బ్రిడ్జికి ఇరువేపులా ఉన్న రేయిలింగ్‌లకు లాక్‌ చేయటం ప్రారంభించారు. అది కూడా ఎక్కడైతే రెయిజా, నాదలు తరుచూ కలుసుకుంటూ ఉండేవారో అదే బ్రిడ్జి మీద. అక్కడ లాక్‌ వేయటం వల్ల తమ ప్రేమబంధం విడదీయలేనిదిగా అవుతుందని ప్రేమికుల నమ్మకం. 

హంగేరినుంచి పారిస్‌కు.. 
లవ్‌ లాక్‌ సంప్రదాయం పారిస్‌లో పుట్టింది కాదు. మొదట హంగేరీలో మొదలైన ఈ సంప్రదాయం తర్వాత పారిస్‌కు పాకింది. ప్రేమ నగరమైన పారిస్‌లో ఓ ఇటాలియన్‌ జంట కారణంగా ఈ లవ్‌ లాక్‌ సంప్రదాయం మొదలైంది. పారిస్‌ నగరంలో 2008నుంచి ప్రారంభమై.. సియోన్‌ నదిమీద ఉన్న ‘‘ పాంట్‌ డెస్‌ ఆర్ట్స్‌’’  బ్రిడ్జి మొత్తం ప్రేమ జంటలు వేసిన తాళాలతో నిండిపోయింది. రంగురంగుల తాళాల కారణంగా సియోన్‌ బ్రిడ్జిమొత్తం కొత్తశోభను సంతరించుకుంది.

ప్రమాదంలో లవ్‌లాక్‌ బ్రిడ్జి
పారిస్‌ లవ్‌ లాక్‌ బ్రిడ్జికి పెరుగుతున్న ఆదరణ కారణంగా లక్షల సంఖ్యలో తాళాలు రేయింగ్‌లకు వేళాడుతుండేవి. టన్నుల కొద్ది బరువు కలిగిన తాళాలు రేయిలింగ్‌లకు వేళాడుతుండటంతో 2014 సంవత్సరంలో బ్రిడ్జికి సంబంధించిన ఓ భాగం కూలిపోయింది. దీంతో కొందరు స్థానికులు లవ్‌ లాక్‌ సంప్రదాయాన్ని పూర్తిగా వ్యతిరేకించటం ప్రారంభించారు. తాళాల కారణంగా సెయిన్‌ నది అందాలను చూడలేకపోతున్నామని, మంచి ఫొటోలు దిగటానికి కూడా వీలు లేకుండా పోతోందని వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే బ్రిడ్జి మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం రేయిలింగ్‌లకు వేలాడుతున్న తాళాలను తొలగించటం ప్రారంభించింది. పర్యాటకుల మనసును నొప్పించకుండా తమ వారసత్వ సంపదను కాపాడుకోవటానికి ఎప్పటికపు​డు తాళాలను తొలగిస్తూ వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement