ఇదెక్కడి ఫ్యాషన్?!
విడ్డూరం
అందంగా ఉండాలనుకోవడం తప్పుకాదు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలని అనుకోవడంలో అభ్యంతరం ఉండాల్సిన అవసరమూ లేదు. కానీ ఆ ఆసక్తి కాస్తా వెర్రి తలలు వేస్తేనే విడ్డూరంగా ఉంటుంది. అమెరికాలో ఈ మధ్య ఓ సరికొత్త ఫ్యాషన్ మొదలైంది. పాదాలు అందంగా ఉండాలని అక్కడి అమ్మాయిలు ఒకటే పరితపించిపోతున్నారు. ఉన్నట్టుండి ఆ తాపత్రయం ఎందుకు మొదలయ్యిందనేగా! దానికి కారణం డాక్టర్ జేసన్ హర్‌గ్రేవ్.
ఈయనగారు పాదాలను అందంగా చేస్తానంటూ ఓ బోర్డు పెట్టాడు. అది చూసి అమ్మాయిలంతా క్యూ కడుతున్నారు. వంకర టింకరగా ఉన్న తమ పాదాలను అందంగా తీర్చిదిద్దమంటూ జేసన్ వెంట పడుతున్నారు. దాంతో అతగాడి హాస్పిటల్లో కాసుల వర్షం కురుస్తోంది. పాదాల ఎత్తూ పల్లాలను సరిచేయడానికి సర్జరీలు చేసేస్తున్నాడు. వేళ్ల పరిమాణంలో ఎక్కువ తక్కువలుంటే కట్ చేసి అతికేస్తున్నాడు.
అయితే దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. కానీ జేసన్ తీర్చిదిద్దిన తమ పాదాల అందాలను చూసి మురిసిపోతున్న అమ్మాయిలు మాత్రం అతడిని వెనకేసుకొస్తున్నారు. దాంతో జేసన్ విమర్శల్ని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు!