నింగీ..నేలా.. ఆమె | Today is International Women's Day | Sakshi
Sakshi News home page

నింగీ..నేలా.. ఆమె

Published Sat, Mar 7 2015 11:35 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

నింగీ..నేలా.. ఆమె - Sakshi

నింగీ..నేలా.. ఆమె

ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం-  ఇపుడు ఇది కానే కాదు హద్దులు, సరిహద్దులు లేని  విజయోత్సవ ఆవిష్కరణ ఆమె.  విశ్వ గమనానికి నూతన ఒరవడి ఆమె. ప్రపంచదార్శనికతకు కొత్త భాష్యం ఆమె. ఇప్పుడు ఆ వేలి కొసలు  సరికొత్త చరిత్రను  లిఖిస్తున్నాయి. పాఠాలు  క్లాస్‌రూమ్‌లో  రేపటి తరానికి విజ్ఞాన వెలుగులు అద్దుతున్నాయి. ఔపోపన పట్టిన సాంకేతికత  ఐటీ రంగంలో సమస్త విశ్వమానవ జీవితమై  ప్రతిబింబిస్తోంది. ఖగోళపు అంచుల్లో  పరిశోధనలకు బాటలు పరిచినా,  గగనంలో లోహ విహంగమై ఎగిసినా,రైలు పట్టాలు, రహదారులపైన ప్రగతిని కొత్త పుంతలు తొక్కించినా  అది కచ్చితంగా ఆమె సొంతమే. ఆమె   ఎగురేసిన విజయ బావుటా... శ్రమైక జీవన సౌందర్యంలోనూ సమున్నతమైన వాటా.... ఆమె విశ్వరూపిణి...  నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం..
 
నయాలుక్
 
ఫ్యాషన్ రంగంలో ఆమెది అందెవేసిన చేయి. మార్కెట్లో వస్తున్న కొత్త డిజైన్లు. కలర్స్ కాంబినేషన్స్‌ను అంచనా వేసి దుస్తులను తయారు చేస్తారు.. కాటన్,పట్టు దుస్తులపై మగువల మనసు హత్తుకునేలా సరికొత్త అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాషన్ డిజైనింగ్‌లో తనకంటూ ప్రత్యేకతను నింపుకున్నారు విద్ధం ప్రణీతారెడ్డి. ఏ ఇంట్లో శుభకార్యాలు జరిగినా ఈమె తయారు చేసిన దుస్తులు ప్రత్యక్షమవుతాయి. నాణ్యత..నిజాయితీ..నమ్మకమే పెట్టుబడిగా ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు . నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా పనిచేసే మన్‌మోహన్‌రెడ్డితో వివాహం అయ్యాక ఖాళీగా ఉండడం ఇష్టంలేక నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. బంధుమిత్రుల సహకారంతో ఎర్రమంజిల్‌లో‘ త్రెడ్ ఇండియా’ పేరుతో కాటన్ దుస్తుల స్టోర్‌ను  ఏర్పాటు చేశారు. ముందుకు దూసుకెళ్తున్నారు.
విద్ధం ప్రణీతారెడ్డి
 
విశాల దృక్పధం
 
నగరానికి చెందిన హైటెక్ జనాలను ’రాహ్‌గిరి’ పేరుతో ఉరకలెత్తిస్తున్నారు ఎంటర్‌ప్రూనర్ విశారెడ్డి. తమకిష్టమైన ఆటపాటలతో అలసట తెలియకుండా వ్యాయామాలు  చేయిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన విశారెడ్డి బెంగళూర్‌లో ఎంబీఏ పూర్తిచేసి హైదరాబాద్‌లో ‘ మీటింగ్ మేనేజ్‌మెంట్’ అనే అరుదైన కోర్స్ చదివారు. ఏడాదిన్నర క్రితం ఆమె‘ సైకిల్ టూ వర్క్ ’ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమం విజయవంతం కావడంతో కొందరు మిత్రులతో కలిసి నగరంలో రాహ్‌గిరికి ప్రణాళిక రూపొందించారు. రెండు నెలల క్రితం హైటెక్ సిటీ సమీపంలోని రహేజా మైండ్‌స్పేస్ నుండి గచ్చిబౌలి వరకు ఉన్న 1.2 కిలోమీటర్ల  రహదారిని ఎంచుకున్నారు.   ప్రతి ఆదివారం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు ఆ రహదారిని  ఆటలకు కేటాయించేలా  ట్రాఫిక్ పోలీసులను ఒప్పించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.
 రాహ్‌గరి నిర్వాహకురాల  విశారెడ్డి
 
రోగుల గుండె చప్పుడు
 
నాన్నా సుబ్బన్న నేర్పిన సేవాభావం... అమ్మ సరస్వతి చూపిన ఆదర్శ మార్గం... భర్త డాక్టర్ మల్లిఖార్జున్ ప్రోత్సాహం...చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే పట్టుదల... నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి. ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) నెఫ్రాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఓ వైపు రోగులకు సేవలందిస్తూనే... మరో వైపు జీవన్‌దాన్‌నెట్‌వర్క్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సొంతూరు తిరుపతి.పుట్టింది మాత్రం దేశసరిహద్దుల్లో. నాన్న ఆర్మీలో పని చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు తిరుమలగిరిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం. టెన్త్, ఇంటర్మీడియట్ తిరుపతి కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఎంబీబీఎస్‌తో పాటు పీజీ కూడా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలోనే పూర్తి చేశా. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహం మేరకు నిమ్స్ నెఫ్రాలజీ విభాగంలో స్పెషాలిటీ కోర్సుచేసి ఇక్కడే అసిస్టెంట్ ప్రొ ఫెసర్‌గా చేరాను. జ్రీవన్‌దాన్ నెట్‌వర్క్ ఇన్‌చార్జీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నా.  
 డాక్టర్, స్వర్ణలత
 
అమ్మాయిలకు  సాధ్యం కానిదేదీ లేదు
 
నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడాకిరిణిగా అంతర్జాతీయంగా టోర్నమెంట్లలో బంగారు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈమె ప్రతిభ గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 లక్షలు ప్రోత్సాహాక బహుమతి ప్రకటించారు. అదృష్టం కలిసొస్తే  2016 ఒలంపిక్స్‌లో దేశానికి పతకం సాధించి పెడుతానని  ధీమా వ్యక్తం చేస్తోంది. అమ్మాయిలకు తలచుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ 2010లో తమిళనాడులో జరిగిన జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్‌గా అవార్డు కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో మరో నాలుగు బంగారు పతకాలు సాధించారు.
బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్
 
అమ్మాయిలకు అండగా..
 
వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలు విద్యార్థినులకు అండగా నిలుస్తున్నారు ఐటి రంగ నిపుణులు మమత వేగంట సింగ్. మమత ఆధ్వర్యంలో గత సెప్టెంబర్‌లో ‘సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సెల్-ఉమెన్ ఫోరమ్  ’ ఏర్పాటయ్యింది. దాదాపు 40 మంది సభ్యులతో కూడిన ఈ ఫోరమ్‌కు డీసీపి రమారాజేశ్వరి అధ్యక్షురాలిగా, మమత ఉపాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఫోరమ్ ఆధ్వర్యంలో మహిళలకు బరోసా కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  ఈవ్ టీజింగ్, వేధింపులపై అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. క్యాబ్‌లపై ‘అమ్మాయిలకు బద్రత కల్పించే వాహనం’ అనే స్టిక్కర్ తప్పని
 సరిగా అతికించేలా చర్యలు తీసుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ప్రతి కంపెనీకి వెళ్లి బద్రత, ఆత్మరక్షణపై ఉద్యోగిణులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
 మమత వేగంట సింగ్  ఐటీ నిపుణురాలు
 
సేవే మార్గం
 
నాన్న దాసరి శ్రీనివాసరావు. సీనియర్ ఐపీఎస్ అధికారి. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అధికారిగా నాన్న చేస్తున్న సేవలు, ఆయనకు లభిస్తున్న గౌరవం చూశాక నేనూ ఐఏఎస్ అధికారిని కావాలన్న కోరిక కలిగింది. సివిల్స్ ప్రిపేరయి సెలక్ట్ అయ్యాను. 2010 బ్యాచ్ ఐఏఎస్‌కు సెలక్ట్ అయ్యా. ట్రైనింగ్ పూర్తిచేశాక...విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఏడాదిపాటు పనిచేశా. ఆ తరువాత విజయవాడ సబ్‌కలెక్టర్‌గా రెండేళ్లు పనిచేశా. ఈ మూడేళ్ల కాలంలో ప్రజాసమస్యలు తెలుసుకునే అవకాశం లభించింది. తాజాగా జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నా. పుట్టింది ఖమ్మం జిల్లాలో, చదవువంతా ఖమ్మంతో పాటు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో సాగింది. ఐఏఎస్ అధికారిగా ఏ తరహా విధుల్లో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సాధ్యమైనంత మేర వారి సమస్యల్ని పరిష్కరించాలన్నదే లక్ష్యం.
 హరిచందన దాసరి, ఐఏఎస్  జీహెచ్‌ఎంసీ నార్త్‌జోన్ కమిషనర్
 
 ఆ కోరికే  ఇండియాకు రప్పించింది
 
జస్టిస్ అయి పేదలకు న్యాయం చేయాలనుకున్నా.. నాన్న ఐఏఎస్ కావాలన్నారు.. గ్రూప్ 1 పరీక్షలో విజయం సాధించా..ఆర్డీవోగా ఉద్యోగం వచ్చింది..    రెవెన్యూ అధికారిగా ఏ చిన్న అవకాశం వచ్చినా పేదలకు, మహిళలకు సేవచేస్తున్నా.. ఈ తపనే నన్ను అమెరికా నుంచి ఇండియాకు రప్పించింది.  నల్లగొండ జిల్లా , భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖి స్వగ్రామం. నాన్న చిన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడనే విద్యాభ్యాసం. పీజీ వరకు హైదరాబాద్‌లో చదివా. ఫీజియోథెరఫీలో డీగ్రీ, పీజీ పూర్తి చేశాను. అమెరికాలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను. పేదలకు సేవచేయాలన్న తపనతో ఇండియాకు వచ్చేశా.. 2009 ఆగస్టు 6లో ఉద్యోగంలో చేరాను.  ప్రస్తుతం హైదరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
నిఖిల ఆర్డీఓ, హైదరాబాద్
 
అమ్మాయిలు  సొంత కాళ్లపై నిలబడాలి
 
అమ్మాయిలు ఎవరిపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలంటున్నారు. ప్రముఖ రేడియో జాకీ సునీత. ఎఫ్ ఎం అంటే రేడియో సిటీ, ఆర్‌జే అంటే సునీత అని చెప్పవచ్చు. రేడియోసిటీలో రోజు సిటీజన్లను పలకరించే సునీత గురించి ఆమె మాటల్లోనే.. మాది వైజాగ్.  నా వాయిస్ బాగుంటుందని మా లెక్చరర్స్ అంటూ వుండటంతో డిగ్రీలో ఉన్నప్పుడే రేడియో ఆడిషన్‌లో పాల్గొన్నాను. 2008లో వైజాగ్ రేడియోసిటీలో సెలెక్ట్ అయ్యాను. 2011 నుంచి రేడియోసిటీలో పని చేస్తున్నాను. ఫ్లాష్‌బ్యాక్ కార్యక్రమం నాకు బాగా పేరు తెచ్చి పెట్టింది. నేను నమ్మేది, అందరికీ చెప్పేది ఒక్కటే. అమ్మాయిలు తమ కాళ్ల మీద వాళ్లు నిలబడాలి. నేను నిలదొక్కుకునేందుకు స్ఫూర్తి మా అమ్మ. అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా వుండాలని ఆమెను చూసే నేర్చుకున్నాను.
ఆర్‌జే సునీత  రేడియో సిటీ 91.1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement