తొక్క మీద కళాఖండాలు
కళావిలాసం
అరటి పండును చేతిలో పెడితే ఎవరైనా ఏం చేస్తారు? శుభ్రంగా తొక్క తీసి పారేసి, పండును తినేస్తారు. ఇది అందరూ చేసే పనే! కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న అమెరికన్ కుర్రాడు అలా కాదు. టెక్సాస్‌లో ఉండే ఈ యువకుడి పేరు డావోంట్ విల్సన్. వృత్తిపరంగా ఇతడు ఈసీజీ టెక్నీషియన్ అయినా, ప్రవృత్తిపరంగా కళాకారుడు. అరటిపండును తొక్కతీసి తినేయడంలో మజా ఏముందనుకున్నాడు. తొక్కే కదా... అని తీసి పారేయలేదు. పండు నుంచి తొక్కను వేరు చేయకుండానే, తొక్కల మీద కళాఖండాలు సృష్టించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగాడా..?
తొక్కల మీద తీర్చిదిద్దిన కళాఖండాలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. కళాభిమానుల నుంచి వేలంవెర్రిగా ప్రతిస్పందన లభించింది. కళాఖండాలు తీర్చిదిద్దిన ఒక్కో అరటిపండు 10 డాలర్లకు తక్కువ కాకుండా అమ్ముడుపోయాయి. దీంతో డావోంట్ ఇక ఆగలేదు.. ఏకంగా ‘బనానాస్ గాన్ వైల్డ్’ పేరిట ఆన్‌లైన్ సంస్థను ప్రారంభించి జోరుగా హుషారుగా అమ్మకాలు సాగిస్తున్నాడు. తొక్క మీది కళాఖండాల ద్వారా ఏటా లక్ష డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. రోజుకు కనీసం 75 అరటిపళ్లపై ఇలాంటి కళాఖండాలను తీర్చిదిద్దుతానని, ఆర్డర్ ఇచ్చిన వారికి జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్‌చేసి, పార్సెల్ చేస్తుంటానని డావోంట్ చెబుతున్నాడు.