
అరటిపండు తిని తొక్కపడేస్తున్నారా? అరటి తొక్కతో మీ చర్మం మెరిసేలా చేయొచ్చని తెలుసా? అవునండి! దీనిలో చర్మానికి మేలు చేసే పోషకాలు, పైటోనూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పబ్‌మెడ్ సెంట్రల్ ప్రచురించిన నివేదికలో అరటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని, ఇవి సూర్యరశ్మివల్ల దెబ్బతిన్న చర్మానికి, ప్రీరాడికల్స్ నుంచి రక్షించి చికిత్సనందిస్తుందని వెల్లడించింది. పొడి చర్మానికి కూడా ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక అరటితోలుతో ఏ విధంగా చర్మాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందామా..
అరటి తోలుతో మసాజ్
ముఖాన్ని నీటితో శుభ్రపరిచి టవల్‌తో తుడుచుకోవాలి. తర్వాత అరటి తొన లోపలిభాగంతో ముఖచర్మంపై 10 నిముషాలపాటు మర్దన చేయాలి. మరోపది నిముషాలు ఆరనివ్వాలి. చివరిగా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై వాపు, ముడతలు తొలగి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
అరటి తోలు ఫేస్ మాస్క్
అరటి తొక్కల్లో రెండు అరటి ముక్కలను కూడా వేసి పేస్టులా అయ్యేంతవరకూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, పెరుగు కలపాలి. అవసరమైతే రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. అరటిలోని బి6,బి12 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అనేక చర్మసమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
అరటి తోలు ఫేస్ స్క్రబ్బర్
అరటి తోలును చిన్న ముక్కలుగా కట్‌చేసి, టేబుల్‌స్పూన్ చొప్పున పసుపు, చక్కెర, తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ స్క్రబ్బర్‌ను వారానికి ఒకసారైనా వాడితే చర్మంపై మృతకణాలను తొలగించి చర్మం కాంతులీనేలా చేస్తుంది.
అరటి తోలు ప్యాచెస్
అరటి తొక్కను రెండు ముక్కలుగా కట్‌చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిముషాల తర్వాత బయటికి తీసి వీటిని రెండు కళ్ల మీద 15-20 నిముషాలుంచి కడిగేసుకోవాలి. ఈ ప్రక్రియ కంటి కింద నల్లని వలయాలు, ముడతలు రాకుండా నివారిస్తుంది.
చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే!