జీవితాన్ని ఈదుతూ..తోటివారి కోసం పరిగెడుతూ.. | Peers, while running for his life .. swimming .. | Sakshi
Sakshi News home page

జీవితాన్ని ఈదుతూ..తోటివారి కోసం పరిగెడుతూ..

Published Mon, Feb 17 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

Peers, while running for his life .. swimming ..

పొద్దునే క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్, సాయంత్రం స్విమ్మింగ్.
 పద్దెనిమిదేళ్ల ప్రీతి దినచర్యలో క్రికెట్,
 స్విమ్మింగ్ తప్ప మరేం ఉండేవి కావు.
 1998 జూలై 11 తర్వాత..ప్రీతికి జరిగిన ప్రమాదం
 ఆమె బతుకుచిత్రాన్ని మార్చేసింది.
 ప్రీతి మాటల్లో చెప్పాలంటే...‘నాకు ఈ జీవితంలో రెండు జన్మలు. ఒకటి ప్రమాదానికి ముందు, రెండోది ప్రమాదానికి తర్వాత. ఈ కొత్త జన్మలో నాకు చేతులు, కాళ్లు పని చేయవు’ అని నవ్వుతూ చెప్పే ప్రీతి పదేళ్ల తర్వాత మరోరూపంలో సెలబ్రిటీ అయ్యింది. వికలాంగుల సంక్షేమంకోసం ‘సోల్‌ఫ్రీ’ అనే సంస్థని స్థాపించి తోటివారికి అండగా నిలబడింది. ఈ ఛాంపియన్ గురించి మరిన్ని వివరాలు...

 
స్నేహితులతో విహారయాత్రకెళ్లిన ప్రీతి తిరిగొస్తూ పాండిచ్చేరి బీచ్ దగ్గర ఆగారు. స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి సిద్ధమైన ప్రీతి సముద్రం ఒడ్డున ఎత్తుగా ఉన్న రాయి ఎక్కి నీళ్లలోకి దూకింది.  నీళ్లలోకి దూకగానే ప్రీతి గట్టిగా అరిచింది... చుట్టూ ఉన్న స్నేహితులు ఆమెను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. ‘ఈత రాని అమ్మాయి నీళ్లలోకి వెళ్లడం దేనికంటూ’ చుట్టూ మూగిన వాళ్లు అంటుంటే....ప్రీతి స్నేహితురాలు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రీతి స్విమ్మింగ్‌లో స్టేట్ ఛాంపియన్. తమిళనాడు అండర్ -19 ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ కూడా.
 
దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగానే డాక్టర్లు చెప్పిన మాటలు విని ప్రీతి స్నేహితులు భోరుమన్నారు. ‘ప్రీతికి మెడ నుంచి కిందభాగమంతా పెరాలసిస్ అటాక్ అయ్యింది. చెయ్యి, కాలు...ఏదీ పనిచేయదు’ అన్నారు. కానీ ఓ ఏడాది తర్వాత ప్రీతి నోట వచ్చిన మాటలకు అదే స్నేహితులు ‘సలామ్’ అన్నారు. ‘నేను రెండో జన్మ ఎత్తా. ఈ జన్మలో నాకు కాళ్లు, చేతులూ లేవు. కేవలం మెదడు, మనసూ మాత్రమే ఉన్నాయి. వాటితో పరుగులు పెడతాను, అవసరమైతే ఈత కూడా కొడతాను’ అని ప్రీతి అన్న మాటలు వికలాంగులనే కాదు మిగతావారిని కూడా ఆలోచింపజేశాయి. ‘సోల్‌ఫ్రీ’ పేరుతో వికలాంగులకు ప్రీతి చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి.
 
రెండు క్రీడల రాణి...
 
చెన్నైకి చెందిన ప్రీతికి ఊహ తెలిసిననాటినుంచే క్రికెట్ అంటే ఇష్టం. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంటిదగ్గర అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. బిడ్డ ఇష్టాన్ని కాదనలేక ప్రీతి తండ్రి ఆమెకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. ప్రీతికి చదువొక ఎత్తై, క్రికెట్ ఒక ఎత్తు. ఇష్టానికి పట్టుదల తోడవడంతో ప్రీతి ఇంటర్‌మీడియట్‌లో ఉండగా స్టేట్ అండర్ -19 ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ అయ్యింది. అప్పటికి ఉన్న రికార్డులు బద్దలుగొడుతూ తన సొంత రికార్డులు సృష్టించిన ప్రీతి విజయం వెనకున్న రహస్యం ఆమె స్విమ్మింగ్‌లో కూడా స్టేట్ ఛాంపియన్ కావడం. ఒకే సమయంలో రెండు క్రీడల్లో తనదైన ముద్రలు వేస్తూ ముందుకెళుతున్న ప్రీతి అనుకోకుండా ఎదురైన చేదు సంఘటన వల్ల సర్వస్వం కోల్పోయింది.
 
కెరటం దెబ్బకి...

అసలేం జరిగిందంటే... ఓ వీకెండ్ సరదాగా స్నేహితులతో బీచ్‌కి వెళ్లిన ప్రీతి ఎత్తుగా ఉన్న రాయి ఎక్కి అక్కడినుంచి నీళ్లలోకి దూకింది. నీళ్లలో ఉన్న రాయి తగిలి ప్రీతి స్పృహ తప్పిందనుకున్నారంతా. కాని ప్రీతికి తగిలింది రాయి కాదు వేగంగా వస్తున్న అల తాకిడికి ప్రీతి శరీరం మొత్తం షాక్‌కి గురైంది.  వెంటనే దగ్గరగా ఉన్న పాండిచ్చేరిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ‘వెన్నెముకకి బలమైన గాయం అవడం వల్ల శరీరంలోని అవయవాల కదలిక ఆగిపోయిందని’ చెప్పారు డాక్టర్లు. అక్కడ చికిత్సకు కావాల్సిన పరికరాలు లేకపోవడం వల్ల తమిళనాడుకి తీసుకెళ్లమన్నారు. తమిళనాడు ఆసుపత్రికి వస్తే...‘ఇది యాక్సిడెంట్ కేస్’ అని ఇంకొంత సమయం వృథా చేశారు. అసలు చికిత్స మొదలుపెట్టేసరికి నాలుగు గంటల సమయం గడచిపోయింది. ‘యాక్సిడెంట్ జరిగిన గంటలోగా ఆసుపత్రికి తీసుకువస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉండేద’ని డాక్టరు చెప్పిన మాటలు ప్రీతి తల్లిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను వీల్‌చైర్‌లో చూస్తున్నందుకు ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది ఆ తల్లి.
 
చేదు అనుభవాలు...

ఏడాదిపాటు సుదీర్ఘ చికిత్స తర్వాత ప్రీతికి ఇక వీల్‌చైర్ చక్రాలే కాళ్లని అర్థమయ్యాయి. ఆటలు ఆగిపోయాయి. చదువు ఆగకూడదనుకుని డిగ్రీలో చేరడానికి తండ్రిని తీసుకుని కాలేజీకి వెళ్లింది. ప్రీతి సర్టిఫికెట్లు చూసి ‘శభాష్’ అన్న అధ్యాపకులు కాలేజీలో సీటు మాత్రం ఇప్పించలేకపోయారు. కారణం...ఆ కాలేజీ తరగతిగదులు వీల్‌చైర్ వాడకానికి అనుకూలంగా లేవు. అప్పుడు ప్రీతి బాధపడింది తనకు సీటు రానందుకు కాదు. తోటి వికలాంగుల దుస్థితి గురించి.
 
ప్రమాదం జరిగిన తర్వాత ప్రీతిని వెంటాడిన సమస్యలు రెండే రెండు. ఒకటి వెన్నెముక గాయానికి ఎమర్జన్సీ చికిత్స అందరికీ అందుబాటులో లేకపోవడం. రెండోది వికలాంగులకు కళాశాల చదువులు సుదూర స్వప్నాలని తెలియడం. తన కొత్త జీవితంలో ఈ రెండు సమస్యలనూ రెండు క్రీడల్లా భావించింది. ‘సోల్‌ఫ్రీ’ అనే సంస్థని నెలకొల్పి వెన్నెముకకు గాయమైనవారికి ఎమర్జెన్సీ సౌకర్యం కోసం ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ని పెట్టింది. రెండోది వికలాంగులకు పై చదువుల అవసరాన్ని చెబుతూ వారికి ఉపాధి అవకాశాలను వెదికి పెడుతోంది.
 
సోల్‌ఫ్రీ ఏం చేస్తుంది?
 
వెన్నెముకకు మాత్రమే ప్రమాదం జరిగినవారు ‘సోల్‌ఫ్రీ’ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి చెబితే వెంటనే అంబులెన్స్‌ని పంపడం, దగ్గర్లోని ఆసుపత్రి సమాచారం చెప్పడం, ఈలోగా డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయడం వంటి సేవలందిస్తుంది. ఉపాధి అవకాశాల్లేని వికలాంగులకు  డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా, టెలిఫోన్ మార్కెటింగ్, బుక్ రీడర్స్‌గా, రేడియో జాకీలుగా శిక్షణ తర్వాత ఉపాధి అవకాశాలు చూపెడుతోంది. ఇంట్లో నుంచే డిగ్రీ పూర్తిచేసిన ప్రీతి తోటి వికలాంగుల సంక్షేమం కోసం ఇంకేం చేయాలో ఆలోచిస్తోంది. ‘‘వికలాంగుల జీవితం ఎలా ఉంటుందో వికలాంగులకు తప్ప మరెవరికీ తెలియదు. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో వికలాంగుల జీవనం మరీ దుర్భరం అని తెలుసుకున్నాను. వారి జీవనవిధానాలను మార్చడం ఒక్కటే నా ముందున్న లక్ష్యం. ఈ సమయంలో నా ప్రతి ఆలోచన సిక్సర్‌లాగా గాల్లోకి ఎగరకపోవచ్చు. నీటిలో వేగంగా ఈదలేకపోవచ్చు. కానీ ఎవరో ఒకరు మాకోసం గ్రౌండ్‌లో సాధన చేస్తున్నారనే ధీమాను మాత్రం ఇవ్వగలదు’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న ప్రీతికి మనం కూడా సలామ్ చెబుతాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement