పరి పరిశోధన | Periodical research | Sakshi
Sakshi News home page

పరి పరిశోధన

Published Mon, Feb 12 2018 1:36 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

Periodical research - Sakshi

కృత్రిమ మూత్రపిండాలు సిద్ధమయ్యాయి!
మానవ మూత్రపిండాన్ని కృత్రిమంగా తయారు చేసే దిశగా మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గణనీయమైన ప్రగతి సాధించారు. ప్రపంచంలోనే తొలిసారి వీరు ఓ జీవి శరీరంలో అచ్చం మన మూత్రపిండాలను పోలిన కణజాలాన్ని అభివద్ధి చేయగలిగారు. ఇది రక్తశుద్ధి ద్వారా మూత్రం కూడా తయారు చేయగలగడం విశేషం. కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని అంచనా.

మూత్రపిండాల్లో ఉండే అతిసూక్ష్మమైన కిడ్నీ గ్లోమెరూలీ కణాలను పరిశోధనశాలలో తగిన పరిస్థితుల మధ్య పెంచడంతో ఈ ప్రక్రియ మొదలైంది. జిగురులాంటి పదార్థాన్ని చేర్చి కిడ్నీ గ్లోమెరూలీ కణాలను ఎలుకల చర్మం అడుగు భాగంలోకి చొప్పించారు. మూడు నెలల తరువాత జరిపిన పరిశీలనలో అక్కడ కిడ్నీ కణజాలం అభివద్ధి చెంది ఉండటాన్ని తాము గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వూల్ఫ్‌ తెలిపారు.

రక్తాన్ని శుద్ధి చేసే నెఫ్రాన్లు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. మానవుల్లోని నెఫ్రాన్లతో దాదాపు సరిపోలిన కొత్త నెఫ్రాన్లలో రక్తనాళం ఒక్కటే తక్కువైందని, ఫలితంగా ఈ కణజాలం చాలా నెమ్మదిగా రక్తాన్ని శుద్ధిచేయగలదని వివరించారు. ఈ లోటును పూరించేందుకు శస్త్రచికిత్స నిపుణులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పద్ధతిని మరింత అభివద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిత్యం డయాలసిస్‌ చేయించుకుంటున్న దాదాపు 20 లక్షల మందికి మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.


వేళ్ల కదలికలతో కరెంటు...
స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ తగ్గిపోతే ప్లగ్‌ ఎక్కడుందని వెతికే కాలం త్వరలోనే వెళ్లిపోనుంది. ఎందుకంటే మన కాళ్లు, వేళ్ల కదలికలతోనే గాడ్జెట్లకు కావాల్సినంత విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. కొన్ని రకాల ప్లాస్టిక్‌ సంచులను నలిపినప్పుడు వాటి ఉపరితలంపై స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ పుట్టే విషయాన్ని మనం గమనించే ఉంటాం. ఇలా జరగడాన్ని భౌతికశాస్త్ర పరిభాషలో ట్రైబోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌ అంటారు.

అచ్చం ఇలాంటివే నానోస్థాయిలో తయారు చేసి వాడటం ద్వారా శరీర కదలికల ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని చైనీస్‌ అకాడమీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ టైబ్రోఎలక్ట్రిక్‌ జనరేటర్లలో రెండు పలుచటి బంగారు పొరల మధ్య పాలీడైమిథైలిసోక్సైన్‌ పొర ఉంటుంది. సుమారు 1.5 సెంటీమీటర్ల పొడవు... సెంటీమీటర్‌ వెడల్పు ఉన్న పట్టీతో 124 వోల్టుల విద్యుత్తు పుట్టించవచ్చునని కియావ్‌కియాంగ్‌ గాన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

ఈ పరిశోధనలో ఒక్కో చదరపు సెంటీమీటర్‌ ద్వారా 0.22 మిల్లీవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయింది. ఈ విద్యుత్తు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్‌ చేసేందుకు సరిపోకపోయినప్పటికీ 48 చిన్నసైజు ఎల్‌ఈడీ బల్బులు వెలిగేందుకు మాత్రం సరిపోయింది.  ప్రస్తుతం తాము ఈ టైబ్రో ఎలక్ట్రిక్‌ జనరేటర్ల ద్వారా మరింత ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు సూక్ష్మస్థాయి బ్యాటరీ తయారీకి ప్రయత్నాలు సాగుతున్నాయని గాన్‌ చెప్పారు.


మునిగిపోతున్న ద్వీపం సైజు పెరుగుతోంది!
వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఇది. ఆస్ట్రేలియాకు, జపాన్‌కు మధ్య తువలూ అనే ఓ ద్వీప దేశం ఉంది. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సముద్రమట్టాలు పెరిగితే మునిగిపోయే తొలి ద్వీపాలు ఇక్కడివేనని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇటీవల ఆక్‌లండ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన అధ్యయనం మాత్రం ఆశ్చర్యకరమైన ఫలితాలిచ్చింది.

తువలూలోని మొత్తం 101 ద్వీపాల్లో కనీసం ఎనిమిదింటి సైజు పెరిగిందని తేలడంతో ఇదెలా సాధ్యమని శాస్త్రవేత్తలు తలగోక్కుంటున్నారు. 1971 నుంచి 2014 వరకూ తీసిన ఈ దేశపు ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించడం ద్వారా వాటి విస్తీర్ణం పెరుగుతున్నట్లు స్పష్టమైంది. మొత్తమ్మీద ఈ దేశపు మొత్తం భూ విస్తీర్ణం 2.9 శాతం వరకూ పెరిగిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్‌ కెంచ్‌ అంటున్నారు.

సముద్రమట్టాలు పెరిగితే లోతట్టు ద్వీపాలు మునిగిపోతాయి. కానీ తువలూలోని ద్వీపాల విషయంలో దీన్ని భిన్నంగా జరిగింది. దీన్నిబట్టి ఈ ద్వీపసముదాయం నిత్యం మార్పులకు గురవుతోందని తెలుస్తోందని పాల్‌ చెప్పారు. సముద్రపు అలల తీరు తెన్నులతోపాటు తుఫానుల సమయంలో ఒడ్డుకు కొట్టుకువచ్చే మట్టి కారణంగా దీవుల విస్తీర్ణం పెరిగేందుకు అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement