
పక్షవాతం రోగులకు మేలు చేసే ఎక్సోజీటీ
పక్షవాతం వచ్చిన వారు తమ కాళ్లపై నిలిచేందుకు, నడిచేందుకు ఉపయోగపడే ఓ వినూత్నమైన బయోనిక్ ఎక్సోస్కెలిటన్‌ను తయారు చేశారు కాలిఫోర్నియాలోని ఎక్సో బయోనిక్స్ శాస్త్రవేత్తలు. శరీరం దిగువభాగం చచ్చుబడిపోయిన వారు రెండుకాళ్లపై నిలబడగలిగితే పొందే ఆత్మవిశ్వాసం వేరే ఉంటుందని ఎక్సోజీటీ ఇందుకు ఉపయోగపడుతుందని షికాగోలోని రష్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త డయాన్ గెనాజ్ తెలిపారు.
ఈ మెడికల్ సెంటర్‌లో ఇప్పటికే తాము ఎక్సోజీటీని ఉపయోగించడం మొదలుపెట్టామని చెప్పారు. బ్యాటరీతో పని చేసే ఎక్సోజీటీని నడుముకు బిగించుకుంటే కంట్రోల్ ప్యాడ్ ద్వారా నడవడం సాధ్యమవుతుందని, అడుగు ఎంత దూరంలో పడాలి ఎంత వేగంతో పడాలన్న విషయాలను ప్యాడ్ ద్వారానే నిర్ణయించుకోవచ్చునని వివరించారు. తుంటి, మోకాలి ప్రాంతాల్లో ఉండే రెండు మోటార్ల ద్వారా ఎక్సోజీటీ కదలికలకు కారణమవుతుందని చెప్పారు.
శరీరం ఎత్తు 5.2 నుంచి 6.2 అడుగుల మధ్య ఉన్న వారందరితోనూ ఈ ఎక్సోస్కెలిటన్ పనిచేస్తుందని 110 కిలోల వరకూ శరీర బరువును భరించగలదని అన్నారు. అయితే ఇది సమర్థంగా పని చేయాలంటే శరీరం పై భాగం, కనీసం ఒక్క చేయి పనిచేస్తూ ఉండాలి. తగిన శిక్షణ ఉన్న వారు ఎక్సోస్కెలిటన్ నుంచి వీల్ ఛెయిర్‌కు.. వీల్ ఛెయిర్ నుంచి ఎక్సోస్కెలిటన్‌కు చాలా వేగంగా మారిపోగలరని గెనాజ్ తెలిపారు. టైమ్ మ్యాగజైన్ 2017 అద్భుత ఆవిష్కరణలో దీన్ని ఒకటిగా గుర్తించడం విశేషం.
మొక్కల జన్యుక్రమ నమోదుకు మహా ప్రయత్నం
జన్యుక్రమాన్ని తెలుసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి కాబట్టే కొన్నేళ్లక్రితం శాస్త్రవేత్తలు మానవ జన్యుక్రమ నమోదును పూర్తి చేశారు. బాగానే ఉందిగానీ మనకు తిండిపెట్టే మొక్కల సంగతేమిటి? ‘ద ఎర్త్ బయోజినోమ్ ప్రాజెక్టు’ పేరుతో ఈ కొరతను పూరించేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సిద్ధమవుతోంది. భూమ్మీద ఉన్న మొత్తం 15 లక్షల మొక్కల జన్యుక్రమ నమోదు ద్వారా భవిష్యత్తులో వీటిని సంరక్షించుకోవడం ఎలా అన్నది తెలుస్తుందని శాస్త్రవేత్తల అంచనా.
ఇటీవల ముగిసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాల్లో ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు. ఇప్పటివరకూ కొన్ని మొక్కల జన్యుక్రమాలను నమోదు చేసినప్పటికీ అది పిసరంత మాత్రమేనని మనిషికి తెలిసిన 15 లక్షల మొక్కల అధ్యయనం పూర్తి చేయాలంటే పదేళ్ల సమయం, దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రాజెక్టు పూర్తయిన తరువాత అందుబాటులోకి వచ్చే 100 కోట్ల గిగాబైట్ల సమాచారాన్ని అందరూ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. మొక్కలు ఎలా పుట్టాయి? ఎలా పరిణామం చెందాయి వంటి సంక్లిష్ట ప్రశ్నలకు ఈ ప్రాజెక్టు ద్వారా సమాధానాలు లభిస్తాయని అంచనా.
90 వేల కార్ల కాలుష్యం.. ఉఫ్!
ఫొటో చూశారుగా.. అదీ సంగతి. ఇలా ఓ ప్రత్యేకమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఒక ఏడాదిలో 90 వేల కార్లు విడుదల చేసే పొగలోని కాలుష్యాన్ని శుద్ధి చేసేయవచ్చు. కెంగో కుమా అనే సంస్థ డిజైన్ చేసిన ఈ కళాకృతి నానో టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. పేరు ‘బ్రీత్ ఇంగ్’. ఇటలీలో జరుగుతున్న మిలాన్ డిజైన్ వీక్ 2018లో దీన్ని ప్రదర్శిస్తున్నారు.
దాదాపు 175 చదరపు మీటర్ల వైశాల్యమున్న వస్త్రాన్ని ఇలా చుట్టలు చుట్టలుగా ఏర్పాటు చేశారు. పరిసరాల్లో ఉండే అన్ని రకాల కాలుష్యకారకమైన వాయువులను పీల్చేసుకుంటుంది. వేలాడదీసేందుకు ఉపయోగించిన కడ్డీ, బిగించేందుకు వాడుతున్న జాయింట్లు అన్నీ హెచ్‌పీ మల్టీజెట్ ఫ్యూజన్ త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసినవి కావడం గమనార్హం.
యుద్ధవిమానాల తయారీ కంపెనీ డసాల్ట్ సిస్టెమ్స్ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఈ డిజైన్ ఏర్పాటు జరిగింది. నగరాల్లో ఏటికేడాదీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. చైనాలో డాన్ రొసగ్రేడ్ అనే డిజైనర్ రూపొందించిన భారీ సైజు వాక్యూమ్ క్లీనర్ గాల్లోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చేస్తున్న విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment