శరీరంలో బోలెడన్ని చెడు, మంచి బ్యాక్టీరియా ఉంటాయని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన రాజమంగళ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు యాదృచ్ఛికంగా కనుక్కున్న ఓ అంశమిప్పుడు బ్యాక్టీరియాను కూడా కొన్ని రకాల వ్యాధుల చికిత్సకు వాడుకోవచ్చునని చెబుతోంది. జీర్ణక్రియను వృద్ధి చేసేందుకు ఉపయోగించే ఓ ప్రొబయాటిక్ పదార్థంలోని లాసిల్లస్ బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని వీరు గుర్తించారు.స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత పెరిగేందుకు కారణమవుతుంది.
ఇంకోలా చెప్పాలంటే ఏ మందు వేసుకున్నా పనిచేయకుండా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది మరణిస్తున్నారని, ముక్కుల్లో, పేవుల్లో నిద్రాణంగా ఉంటూ చర్మపు పొర దాటి బయటకు వచ్చినప్పుడు మాత్రం మృత్యుకారకమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యాంథొనీ ఫాసీ తెలిపారు. దాదాపు రెండు వందల మంది గ్రామీణ థాయ్‌లాండ్ ప్రజలను పరిశీలించినప్పుడు.. సుమారు స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా లేని వారిలో బాసిల్లస్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. లుకలకు బాసిల్లస్ బ్యాక్టీరియా అందించినప్పుడు వాటిలోని స్టిఫాలోకాకస్ వేగంగా నాశనమైనట్లు తెలిసింది.
మనం గుర్తుంచుకునేవి.. 5000 ముఖాలే!
ఒక్కసారి చూస్తే చాలు.. నేను ఎవర్నీ మరచిపోను అని ఎవరైనా అంటూంటే వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే మనిషిన్నవాడు ఐదువేల కంటే ఎక్కువ ముఖాలను గుర్తుపెట్టుకోలేడని అంటున్నారు యార్క్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. సోషల్ మీడియాతోపాటు వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎంతమంది ముఖాలను గుర్తుపెట్టుకోగలరో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక పరీక్ష పెట్టారు. వందమందిపై ఈ పరీక్ష జరిపినప్పుడు ఈ విషయం తెలిసింది. ఓ గంట సమయమిచ్చి.. మీకు గుర్తున్న వారందరి పేర్లు రాయాల్సిందిగా చెప్పినప్పుడు వీరు తమ పాఠశాల మిత్రులు మొదలుకొని సహాద్యోగుల వరకూ చాలామంది పేర్లు రాశారు.
ఆ తరువాత కొందరు ప్రముఖుల చిత్రాలు చూపి వారిలో ఎంతమందిని గుర్తించగలరో పరీక్షించారు. సమయం గడుస్తున్న కొద్దీ పేర్లు రాసే, ముఖాలను గుర్తించే వేగం తగ్గిపోవడాన్ని ఆధారంగా చేసుకుని వాళ్లు ఎన్ని ముఖాలు గుర్తుంచుకోగలరో శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఒకే వ్యక్తి తాలూకూ రెండు ఫొటోలను గుర్తించాలన్న నిబంధన కూడా ఉండటం వల్ల ఫలితాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జెర్కిన్స్ తెలిపారు. విమానాల్లో ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని అంచనా.
కీటోడైట్‌తో మెదడుకు మేలు!
పిండిపదార్థాలు తక్కువగా, కొవ్వులు ఎక్కువగా తీసుకునే ఆహారం కీటోడైట్‌తో జ్ఞానశక్తికీ మేలు జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో కీటోడైట్‌తో వాటి మెదడు సంబంధిత ఆరోగ్యం మెరుగుపడిందని కెంటకీ యూనివర్శిటీకి చెందిన ఐ–లిన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక ప్రయోగం ప్రకారం... కీటోడైట్ అందించిన ఎలుకల నాడీ సంబంధిత క్రియలు మరింత సమర్థంగా జరిగాయి.
మూర్ఛతోపాటు ఆటిజమ్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులపై కీటోడైట్ సానుకూల ప్రభావం చూపుతుందన్న గత పరిశోధనల ఆధారంగా ఐ–లిన్ తాజా ప్రయోగాలు చేపట్టారు. మెదడుకు రక్త ప్రసరణ, నాడీ సంబంధిత నాళాల ఆరోగ్యం, మెదడుకు, రక్తానికి మధ్య ఉన్న త్వచం క్రియలు సక్రమంగా జరగడం జ్ఞానశక్తికి ఎంతో కీలకమని ఈ నేపథ్యంలో కొన్ని ఎలుకలను రెండు గుంపులుగా చేసి ఒకదానికి కీటోడైట్ ఇంకోదానికి సాధారణ ఆహారం అందించామని ఐ–లిన్ తెలిపారు.
దాదాపు పదహారు వారాల తరువాత పరిశీలించినప్పుడు కీటోడైట్ ఇచ్చిన ఎలుకల మెదళ్లకు రక్తప్రసరణ మెరుగైందని, పేవుల్లోని బ్యాక్టీరియాలో సమతౌల్యత కనిపిచిందని వివరించారు. కీటో ఆహారం మెకనిస్టిక్ టార్గెట్ ఆఫ్ రాపమైసిన్ అనే రసాయనం ఉత్పత్తిని నిరోధించడం దీనికి కారణం కావచ్చునని అన్నారు. కీటోడైట్ కాకుండా.. కేలరీలను తక్కువ చేసినప్పుడు మాత్రమే శరీరంలో ఈ రాపమైసిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కీటోడైట్ మనుషుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు చూపుతుందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment