శ్రీలంక ప్రజలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. ధరలు పెరగటం అటుంచి, కొనేందుకు కూడా నిత్యావసర వస్తువులు కనిపించడం లేదు. చివరకు ఆహార అత్యయిక పరిస్థితి విధించాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీలంకకు కావలసింది హిట్లర్ కాదు... మండేలా! శ్రీలంకలోని ప్రజాస్వామిక వ్యవస్థలు స్వేచ్ఛగా, దృఢంగా, స్వతంత్రంగా పనిచేసేందుకు వీలైన అనుకూలతలు ఏర్పడాలి. ప్రస్తుతం ఉపయుక్తమైన ఆలోచన ఏమిటంటే – ఎస్.ఎల్.పి.పి. లేదా ఆ పార్టీ నాయకుడు రాజపక్సే తన పాలనా యంత్రాంగపు విధానపరమైన భారీ తప్పిదాలను, రాజకీయ వైఫల్యాలను అధ్యయనం చేయడానికి తక్షణం ఉద్యుక్తులవడం!
ఎన్నికలకు ముందు శ్రీలంక తన ప్రజలకు గొప్ప శ్రేయస్సును, వైభవాన్ని దృగ్గోచరం చేసింది. ఆ వాగ్దానానికి 60 లక్షల 90 వేల మంది ప్రజలు ఓటు వేశారు. అయితే ప్రభుత్వం ఏర్పరిచి న రెండేళ్లలోనే ప్రతి ఒక్కరికీ వాస్తవం ఏమిటో అనుభవంలోకి వచ్చింది. ఆర్థికంగా బరువు. ఆహారం కరువు. వంట గ్యాసు మొదలు పాలపొడి వరకు, విదేశీ మారకద్రవ్యం నుంచి ముడి చమురు వరకు అన్నింటికీ కొరతే! ఇప్పుడిక విద్యుత్ కోతలు కూడా మొదలయ్యాయి.
ఆలస్యమైన స్థానిక, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ధైర్యం కూడగట్టు కోలేకపోతోంది. ఎన్నికల్లో ఇచ్చేందుకు వాగ్దానాలు ఉన్నట్లే, ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి ఇప్పుడు చూపించేందుకు కారణాలూ ఉండొచ్చు. అయితే కోవిడ్‌ను కారణంగా చూపడానికి శ్రీలంక ప్రభు త్వానికి ముఖం చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. తొలి వేవ్ కోవిడ్ తీవ్రంగా ప్రబలుతున్న సమయంలోనే దీర్ఘకాల లాక్‌డౌన్ అనంతరం 2020 ఆగస్టులో శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. వైరస్‌లతో సహజీవనం అలవాటైంది. ఆహార కొరత, అర్ధాకలి కూడా శ్రీలంకలో ఇప్పుడు సర్వసాధారణమైన విషయాలు.
వాస్తవానికి శ్రీలంక పరిస్థితి ప్రపంచదేశాల ఊహకే అందనంత దయనీయంగా ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని పొదుపుగా వాడు కోవడం కోసం పప్పులు, ఉప్పుల దిగుమతుల్ని కూడా ప్రభుత్వం నియంత్రించుకోవడంతో శ్రీలంక ప్రజలు ఆకలితో అలమటించవలసి వస్తోంది. చివరికి ఆహార అత్యయిక స్థితి విధించాల్సి వచ్చింది. ఈ తాజా దుఃస్థితికి మూడేళ్ల క్రితం నాటి ఉగ్రదాడులు నాంది పలికా యనీ, దాడుల కారణంగా శ్రీలంక పర్యాటకరంగం తన ప్రాభవాన్ని కోల్పోయి దేశ ఆర్థిక స్థితి క్షీణించిందనీ, ఆ తర్వాత కరోనా వచ్చి దేశాన్ని క్రుంగదీసిందనీ ఎన్ని కారణాలు చెప్పుకున్నా... పాలకుల రాజకీయ ప్రయోజనాలు దివాళా వైపు నడిపించాయన్నది వాస్తవం.
ఇప్పుడిక ఉపయుక్తమైన ఆలోచన ఏమిటంటే ఎస్.ఎల్.పి.పి. లేదా ఆ పార్టీ నాయకుడు రాజపక్సే తన పాలనా యంత్రాంగపు విధానపరమైన భారీ తప్పిదాలను, రాజకీయ వైఫల్యాలను అధ్య యనం చేయడానికి తక్షణం ఉద్యుక్తులవడం! అందువల్ల ప్రభుత్వం తన తప్పుల నుంచి తను నేర్చుకుంటుంది. అధికసంఖ్యాక జాతుల మత జాతీయవాదులను కలుపుకొని పని చేయడానికి పరిమితులు ఉండనే ఉంటాయి. ‘అపకీర్తిపరుల అంతిమ ఆశ్రయం దేశభక్తి’ అని సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత శామ్యూల్ జాన్సన్ 1745లో అన్న మాటకు ఇక్కడ చక్కగా అన్వయం కుదురుతుంది.
శామ్యూల్‌కు కానీ, ఇతర రాజకీయ సిద్ధాంతకర్తలకు కానీ నాడైనా, నేడైనా ఉన్న గమనింపు ఒకటే. పాలనలోని స్వప్రయోజన ప్రయత్నాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి నాయకులు తమ మత, జాతీయ వాదాన్ని రాజకీయ గుర్తింపుగా సంధిస్తారని! దురదృష్టవశాత్తూ శ్రీలంక కూడా ఇదే విధమైన స్వార్థ రాజకీయ వ్యూహాలకు గురవుతూ వస్తోంది. అంతర్యుద్ధానంతర కాలంలో 2010 నుంచి 2014 వరకు, 2019 నుంచి నేటి వరకు రాజకీయ అధికారం కోసం నాయకులు శ్రీలంక సమాజంలో విభజనల్ని అధికం చేశారు.
శ్రీలంకలోని పాలనాపరమైన విధానాలు ఎప్పుడు చర్చకు వచ్చినా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ‘విభజించు–పాలించు’ విధానమే వాటికి పూర్వరంగంగా వక్తల అభిప్రాయాలు వెల్లడవుతాయి. ప్రపంచంలోని అన్ని వలస ప్రాంతాలను పాలించినట్లే బ్రిటిష్ ఆనాటి సిలోన్‌ను కూడా తన విభజన రాజకీయాలతో అదుపులో ఉంచు కుంది. శ్రీలంకలోని విభజన రాజకీయాలను అర్థం చేసుకోవడానికి మరీ అంతగా చరిత్రలోకి వెళ్లిపోనవసరం లేదు. 2015 నాటి ఎన్నికలు చెప్పిందీ, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు చెప్పబోయేదీ ఒకటే. జాతుల మత జాతీయవాదం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ... అసమర్థ పాలనను, ఆర్థిక అస్తవ్యస్థతను భరించడానికి ప్రజలకు ఒక పరిమితి ఉంటుందని! దీనిని అర్థం చేసుకోడానికి మూడు పాఠాలు అవసరం.
ఒకటో పాఠం. దృఢమైన జాతుల–మతజాతీయవాదం అన్నది లక్ష్యాన్ని సాధించే విధానాలకు, వివేకవంతమైన పాలనకు ప్రత్యా మ్నాయం కాబోదు. శ్రీలంకను నడుపుతున్నది సైన్యం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. నిజానికి ఒకప్పుడు శ్రీలంక సైన్యం ప్రపంచం లోనే అత్యుత్తమమైనదిగా మన్ననలు పొందేది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ప్రధాన పాత్రను పోషించేది. యుద్ధ విద్యల్లో ఆరితేరిన ప్రపంచ దేశాల సైన్యంలో ప్రముఖమైనది. దేశంలో మానవ హక్కులను హరించి వేస్తోందన్న సందేహాలు మొదలయ్యే వరకు సైన్యంపై శ్రీలంకలో విశ్వాసం ఉండేది. ఏమైనా సైన్యం వంటి వ్యవస్థ వెనుక ఒక ప్రయోజనం, ప్రాధాన్యం ఉంటాయి. వాటిని పాలకులు తగ్గించడం అంటే వ్యవస్థను, తద్వారా దేశాన్ని బలహీనపరచడమే. సైన్యాన్ని అడ్డుపెట్టుకుని పాలించాలని చూసే ప్రయత్నాలను ప్రజలు తప్పక తిప్పికొడతారు. పాలకులు పాలనకు! సైనికులు రక్షణకు! అంతే. సైనిక రక్షణ.. ప్రజా ప్రయోజనాలకే తప్ప, ప్రజా వ్యతిరేక పాలనా విధానాలకు కాదని పాలకులు గ్రహించాలి.
రైతులు రసాయన ఎరువులతో సేద్యం చేయకుండా చూడాలని శ్రీలంక ప్రభుత్వం నుంచి సైన్యానికి కొంతకాలం క్రితమే ఆదేశాలు అందాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ఆదా చేయాలన్న తొందరపాటుతో గత ఏడాది మార్చిలో రాజపక్సే ప్రభుత్వం రసాయనాలు, పురుగుమందుల వినియోగంపై నిషేధం విధించి దేశాన్ని సైన్యం అదుపుతో ‘హరితసాగు’ పేరిట సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నం చేసింది. సేంద్రియ వ్యవసాయానికి భూములు సిద్ధంగా లేకపోవడంతో దిగుబడులు తగ్గి ఆహార కొరత ఏర్పడింది. అయినా పదాతి దళాలతో, భారీ ఫిరం గులతో బలవంతంగా సేంద్రియ వ్యవసాయం చేయించడం ఏంటి? శ్రీలంక అనే పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇప్పుడు పూర్వ అధ్య క్షుడు ప్రేమదాస అనుసరించిన ‘సంప్రదింపులు–రాజీ–ఏకాభి ప్రాయం’ అనే విధానం ఎంతైనా అవసరం. నైపుణ్య సామర్థ్యాలు ఉన్న పాలకపక్షం, పాలక కుటుంబం, శక్తిమంతమైన సైనికాధి కారులు, రక్షణ దళపతులు నడుపుతున్న దేశంలో ఆర్థికంగానైనా, ఆహారానికైనా ఇంతటి కొరత ఎందుకు ఉండాలి?! ఇప్పుడు కావల సింది హిట్లర్ కాదు. మండేలా! ప్రజాస్వామిక వ్యవస్థలు స్వేచ్ఛగా, దృఢంగా పనిచేసేందుకు వీలైన అనుకూలతలు ఉండాలి.
రెండవ పాఠం. ప్రతి సమస్యకూ సైన్యమే సమాధానం కాదు. పాలనాపరమైన నిర్ణయాలనేవి విధానాలను అనుసరించి జరగాలి తప్ప, రాజకీయ ఉద్దేశాలతో కాదు. శ్రీలంక ప్రస్తుత ఆర్థిక సంక్షో భానికి పాలనా యంత్రాంగం తీసుకున్న రెండు కీలక రాజకీయ నిర్ణ యాలే కారణం. అంతే తప్ప కోవిడ్–19 వైరస్ కానీ, వైరస్ ఉత్పరి వర్తనాలు కానీ కాదు. మునుపటి ప్రభుత్వం విధించిన పన్నులను రద్దు చేస్తూ 2019 డిసెంబరులో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపించింది. సాటి దేశాలతో పోలిస్తే అతి తక్కువ పన్ను రాబడులు ఉన్న దేశం శ్రీలంక. ఆ కాస్త కూడా ప్రభుత్వం రద్దు చేయడమో, తగ్గించడమో చేసింది. ఇప్పుడు బంగ్లా దేశ్‌ను చెయ్యి చాస్తోంది. ఇక రెండో ప్రతికూల నిర్ణయం, గత ఏడాది రాత్రికిరాత్రి రసాయన ఎరువుల వాడకంపై నిషేధం విధించడం. ఈ నిర్ణయాల కారణంగా ప్రజలు సైతం అప్పుల్లో కూరుకుపోయారు. తినడానికి అప్పు చేయడం... అప్పు తీర్చడానికి పస్తులు ఉండటం! వంట గ్యాసు, పాలపొడి, మందుల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేమాట అటుంచి, కొనేందుకు కూడా కనిపించడం లేదు. పంట దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. గ్రామీణ రైతులదీ, పట్టణ వినియోగదారులదీ ఒకే పరిస్థితి. ఆర్థిక వేత్తలు, విధాన నిపుణుల సలహాలను రాజకీయ నాయకులు పెడ చెవిన పెట్టడం వల్లనే శ్రీలంకలో నేడు ఇంత అలజడి, పేదరికం. ప్రభుత్వం నమ్మబలికింది ఒకటి. ప్రజలకు దక్కుతున్నది మరొకటి! మూడో పాఠం. రోమ్ నిర్మాణం ఒక రోజులో జరగలేదు. శ్రీలంకకు షాక్‌లు మాత్రమే ఉండి, థెరపీలు లేని షాక్ థెరపీ అవసరం లేదు.
– హ్యారిమ్ పీరిస్‌శ్రీలంక అధ్యక్షుడి మాజీ సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment