సన్ని హిందూస్తానీ ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. సిడీల్లో విని ప్రఖ్యాత సంగీతకారుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాటలు నేర్చుకున్నాడు. నుస్రత్ ఫతే అలీఖాన్‌ని తన గురువుగా భావించాడు. ఆయనకు భక్తుడిగా మారాడు. సన్ని హిందూస్తానీ పాడుతుంటే నుస్రత్ పోలికలు కనపడతాయి. ఫ్రెండ్స్ తమకు తోచినప్పుడల్లా అతని చేత పాడించుకునేవారు. కాని సన్నికి జీవితంలో ఏదైనా సాధించాలని ఉండేది. కాని ఎలా సాధిస్తాడు? 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఇంట్లో తల్లి, చెల్లెలు ఉంటారు.వారి పోషణ కోసం చదువు మానేసి బూట్ పాలిష్ చేస్తున్నాడు సన్ని. కాని కాలం ప్రతి ఒక్కరి కోసం కిరీటం మోసుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ కిరీటం దగ్గరకు తలను చేర్చాలంతే!
సోనీ టీవీలో ‘ఇండియన్ ఐడల్11’ ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒక ఫ్రెండ్ ద్వారా సన్నికి తెలిసింది. ముంబై వెళ్లాలంటే డబ్బులు కావాలి. వెళ్లి తల్లిని అడిగితే ఆమె కంగారుగా చివాట్లు పెట్టింది. ‘మనకు అవసరమా... అదేమైనా వచ్చేదా చచ్చేదా’ అన్నది. ‘ఇంట్లో రూపాయి లేదు’ అని కూడా అంది. దాంతో సన్ని మూడు వేల రూపాయలు అప్పు చేసి ముంబై చేరుకున్నాడు. కాని ఈ దేశం చాలా పెద్దది. ప్రతిభ ఉన్న వాళ్లు ఎప్పుడూ క్యూలో ఉండేలా చేయగలిగేది. ఇండియన్ ఐడల్‌లో సన్ని నంబర్ ‘1072’. అంటే వెయ్యి మందిలో మనవాడు ఒకడు. పిచ్చి టీషర్టు, స్లిప్పర్లు వేసుకొని లోపలికి వెళ్లిన సన్ని జడ్జిలుగా ఉన్న అనూ మలిక్, నేహ కక్కర్, విషాల్ దద్లానిలను మెప్పించాడు.
అతడు పాడిన పాట ‘ఆఫ్రిన్.. ఆఫ్రిన్’. పోటీ కొనసాగింది. రాను రాను సన్నికి అభిమానులు పెరిగారు. భటిండా ఊరు మొత్తం ప్రతి వారం అతనికి ఓటు వేయడం మొదలుపెట్టింది. ఫైనల్స్‌లో మొత్తం ఐదు మంది గాయకులు మిగిలితే సన్ని హిందూస్తానీ విన్నర్‌గా నిలిచాడు. బహుమతిగా 25 లక్షల రూపాయలు, ఒక కారు దక్కాయి. ‘నా పేరు విజేతగా ప్రకటించిన క్షణాన మా అమ్మ ముఖంలో కనిపించిన చిరునవ్వు నాకెంతో సంతోషాన్నిచ్చింది’ అంటాడు సన్ని. అతడు తనకొచ్చిన డబ్బులో కొంత తల్లికోసం, కొంత చెల్లెలి కోసం ఉపయోగించనున్నాడు. నిజానికి సన్ని ఈ కాంటెస్ట్‌లో ఉండగానే సినిమా వాళ్ల దృష్టి పడింది. ‘గల్లీబాయ్’ సినిమాలో పాడే చాన్స్ వచ్చింది. ఇప్పుడు టి–సిరీస్‌తో కాంట్రాక్ట్ కుదిరింది. కలలు కంటే అవి తీరేదాకా పరిశ్రమించాలి అని సన్ని గెలుపు తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment