అలోకిక భట్టాచార్య, అమితాబ్
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి....
సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్‌లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్‌సీట్‌లో కూచుంది.
‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె.
‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది.
This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH
— Adil hussain (@_AdilHussain) December 1, 2023
Comments
Please login to add a commentAdd a comment