
ఒక మహిళ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారు. ఆమె అందంగా ఉందా అని చూస్తాం! ఒక మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అందంగా ఉందా అని చూస్తాం!! మహిళ అంటేనే అందం అనీ, అందంగా ఉంటేనే మహిళ అనీ.. ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది మనలో. క్రికెటర్ స్మృతి మంధాన తన ఆటలో ఎన్నో విజయాలు సాధించారు. అత్యుత్తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. బి.సి.సి.ఐ. ఆమెను ‘బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్’గా గుర్తించింది. కీర్తించింది. అంతటి ప్లేయర్‌లోనూ మనం అందమే చూస్తున్నట్లున్నాం! నెట్‌లో అజ్ఞాత వ్యక్తులెవరో స్మృతి మంధాన నీలిరంగు క్రికెట్ షర్ట్, క్రికెట్ క్యాప్‌తో ఉన్న ఫొటోను ‘అందంగా’ మలిచి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
ఫొటోషాప్‌లో మంధాన పెదవులకు లిప్‌స్టిక్ అద్ది, కళ్లకు కాటుక రాసిన ఆ ఫేక్ ఫొటోపై ఇప్పుడు ఆమె ఆటను అభిమానించే వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతన అనే ట్విట్టర్ యూజర్ ఆన్‌లైన్‌లో స్మృతి ఫొటోలు వెదుకుతుండగా ఈ లిప్‌స్టిక్, కాటుక ఉన్న ఫొటో బయటపడింది. ఈ నకిలీ ఫొటోను, ఆ అసలు ఫొటోను ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ‘క్రికెటర్‌ను క్రికెటర్‌లా చూడండి.. అందమైన క్రికెటర్‌గా కాదు’ అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టారు. ‘‘ఇదే పని విరాట్ కొహ్లీకి, ఎం.ఎస్.ధోనీకి చెయ్యగలరా?’’ అని మరొక నెటిజన్ ప్రశ్నించారు. నిజమే కదా!
Comments
Please login to add a commentAdd a comment