
‘‘అమ్మా ఫలానా ఆయన కోసం సమాధి తవ్వుతుంటే పక్కనే ఉన్న మీ ఆయన సమాధి బయట పడింది. అందులో మీ ఆయన కఫన్ (శవ) వస్త్రం కొంచెం కూడా నలగలేదు. చనిపోయి ఇన్నేళ్లయినా మీ ఆయన కఫన్ వస్త్రంపై వేసిన పూలూ వాడిపోలేదు. పైగా సువాసనలు వెదజల్లుతున్నాయి’’ ఏమిటీ కారణం, బతికుండగా అంతటి పుణ్యకార్యాలు ఏమిచేశారో కాస్త చెబుతారా?’’ అంటూ ఒక్కొక్కరూ అడగడం మొదలెట్టారు ఆ ముసలావిడను. సుమారు డెబ్బై ఏళ్లక్రితం ఒక వ్యక్తి అంత్యక్రియల్లో భాగంగా సమాధి తవ్వుతుంటే పక్కన ఉన్న సమాధిలోని భౌతికకాయం బయల్పడింది. ఆ సమాధిని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంత్యక్రియల అనంతరం సమాధిపై ఉన్న ఫలకంపై ఉన్న వివరాల ప్రకారం ఆ ఇంటి వారిని గుర్తించి ఆ ఇంటికి వెళ్లగా ఓ ముసలావిడ మంచంపై మూలుగుతూ ఉంది. వయసు మీదపడిన ఆ మహిళ బలం కూడగట్టుకుని లేచి పరిశీలనగా చూసింది. ఎవరో నలుగురు మనుషులు వచ్చి తన ముందు నిల్చున్నట్లు మసక కళ్లతోనే గమనించింది. వాళ్లడిగిన దానికి ఏం చెప్పాలో ముసలావిడకు ఏమీ తోచలేదు. తన భర్త చనిపోయి ఇన్నేళ్లు గడిచినా సమాధి ఇంతగా మెరుస్తుందా అని ఆశ్చర్యపోయింది.
‘‘నా భర్త ఏమీ చదువుకోలేదు. దానాలు చేయడానికి మేం ధనవంతులమూ కాము. చదువుకోకపోయినా ఎప్పుడూ ధార్మికంగా ఉండేవాడు. ఎవరైనా ఖుర్‌ఆన్ చదవడం కనపడితే ఎంతో శ్రద్ధగా వినేవాడు. తనకు ఖుర్‌ఆన్ చదవడం వచ్చి ఉంటే తానూ పారాయణం చేసేవాడని బాగా చింతించేవాడు. ఇంట్లో ఉన్న ఖుర్‌ఆన్ గ్రంథాన్ని చేతుల్లో తీసుకుని ముద్దాడేవాడు. ఖుర్ ఆన్ వాక్యాలను తాకుతూ తెగ మురిసిపోయేవాడు. ఒక్కోసారి రాత్రంతా ఖుర్‌ఆన్‌ను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఖుర్‌ఆన్ పట్ల ఉన్న ఆ ప్రేమే అతని సమాధిని ఇలా దేదీప్యమానం చేస్తుందని నేననుకుంటాను’’ అని చెప్పింది ఆ పెద్దావిడ. జీవితాంతం ఖుర్ ఆన్ చదివి, అర్థం చేసుకుని, దైనందిన జీవితంలో ఆచరణలో పెడితే మన సమాధి ఇంకెంత జ్యోతిర్మయమవుతుందో ఆలోచించండి.
– తహూరా సిద్దీఖా
Comments
Please login to add a commentAdd a comment