షోల్డర్ సమస్యల నివారణకు భుజం కలపండి...
భుజం... ఈ అవయవం ఎంత ప్రధానమైనదంటే, ఇది పనిచేయకపోతే అసలు ప్రపంచంలో ఏ పనీ జరగదు. మన బరువునంతా కాళ్లు మోస్తే... మన బాధ్యతలన్నీ భుజాలు మోస్తాయి. అందుకే ఎవరికైనా ఏవైనా ప్రధాన బాధ్యతలను అప్పగించాలంటే... అవి వారి భుజస్కంధాలపై పెడుతున్నామంటారు. ఎవరైనా దగ్గరి వారు దూరమైతే భుజం విరిగినట్లయిందంటారు. మెచ్చుకోవాలంటే భుజం తడతారు.అంతటి ప్రధానమైన ఈ శరీర భాగానికి సమస్య వస్తే ఎన్నో పనులు వెనకబడతాయి. భుజం, దానికి వచ్చే అనేక సమస్యల గురించి తెలుసుకోడానికే ఈ కథనం.
భుజం నిర్మాణమే ఒక అద్భుతం. ఇందులో సంక్లిష్టమైన ఐదు కీళ్లు, ముఫ్ఫయికి పైగా కండరాలు, ఆరు ప్రధానమైన లిగమెంట్లు పనిచేస్తూ, మన రోజువారీ పనులన్నీ అయ్యేట్లుగా చూస్తుంటాయి. భుజానికి వచ్చే అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు తెలుసుకుందాం.
ఫ్రోజెన్ షోల్డర్ : ఈ సమస్య సాధారణంగా 40 - 60 ఏళ్ల వారిలో ఎక్కువ. పురుషుల్లో కంటే మహిళల్లో కాస్త అధికం. ఇది ఎందువల్ల వస్తుందో తెలియకపోయినా, డయాబెటిస్ ఉన్నవారిలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భుజానికి గాయమైన వారిలోను, గతంలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నవారిలోనూ ఎక్కువ. చేతిఎముక, భుజానికి కలిసే చోట గుండ్రగా ఉండి, అది అక్కడి సాకెట్‌లో ఇమిడి ఉంటుంది. సంక్లిష్టమైన ఈ నిర్మాణంలో భుజం ఎముకలో గుండ్రగా ఉండే భాగాన్ని క్యాప్సూల్ అంటారు. ఈ కండిషన్‌లో కీలు అంతా బాగా ఉన్నప్పటికీ క్యాప్సూల్ భాగం బాగా మందంగా మారుతుంది. భుజం కదలికలు చాలా పరిమితంగా మారతాయి. ఫ్రీగా కదలదు. డయాబెటిస్ వచ్చినవారిలో ఈ నొప్పి ఇంకాస్త ఎక్కువ. అందుకే ఈ నొప్పిని డయాబెటిస్‌కు ఒక సూచికగా కూడా డాక్టర్లు తీసుకుంటూ ఉంటారు.
చికిత్స: సాధారణంగా ఫ్రోజెన్ షోల్డర్ కండిషన్‌లో వచ్చే నొప్పి చాలామందిలో కొన్నాళ్లకు దానంతటదే తగ్గిపోతుంది. అయితే ఇందులో నొప్పి ఎక్కువ కాబట్టి ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ వ్యాయామాల ద్వారా తగ్గుతుంది. నొప్పి తీవ్రంగా ఉంటే పెయిన్‌కిల్లర్స్‌తో ప్రయోజనం ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా నొప్పి నివారణ మందులు వాడటం ప్రమాదకరం. పాశ్చాత్యదేశాల్లోని ‘హైడ్రోడయలటేషన్’ వంటి ప్రక్రియలు ఇప్పుడు మనవద్ద కూడా లభ్యమవుతున్నాయి. అరుదుగా ఆర్థోస్కోపీ వంటి ప్రక్రియలు అవసరం కావచ్చు.
రొటేటర్ కఫ్ పెయిన్: రొటేటర్ కఫ్ సమస్య గల వారిలో చేతి ఎముకకూ, భుజం ఎముకకూ మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గుతుంది. ప్రధాన కండరమైన బర్సైటిస్ లేదా రొటేటర్ కఫ్ పగుళ్లు ఏర్పడటంతో అంతకుముందు భుజాన్ని తేలిగ్గా పైకి లేపగలిగిన వారు, భుజాన్ని ఎత్తడంలోనూ, కదిలించడంలోనూ చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు.
సమస్యను కనుగొనడం ఎలా: అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా ఎమ్మారైల ద్వారా కండరాల్లో ఏవైనా పగుళ్లు (టేర్స్) ఉన్నాయేమో కనుగొంటారు.
చికిత్స: ఈ సమస్య ఉన్నవారిలో ఫిజియోథెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక కొందరిలో ఆర్థోస్కోపీ ప్రక్రియ ద్వారా చేతి ఎముకకూ, భుజంలోపల ఉండే ఎముకకూ మధ్య ఉన్న గ్యాప్‌ను సరిచేస్తారు. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది ఆర్థరైటిస్‌కు దారితీసి, భవిష్యత్తులో అతి సంక్లిష్టమైన ‘షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ’ చేయాల్సి రావచ్చు.
షోల్డర్ ఆర్థరైటిస్: భుజం నిర్మాణంలో చేతి ఎముక చివరన ఉండే బంతి వంటి ఎముక చివరి భాగం అక్కడి ఒక సాకెట్‌లో ఇమిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం భుజాన్ని ఎక్కువగా ఉపయోగించిన సందర్భాల్లో చాలా ఏళ్ల తర్వాత ఈ ఎముక చివరన ఉండే బంతి వంటి భాగంలోని కార్టిలేజ్ అరిగిపోతుంది. కొన్నిసార్లు ఏదైనా గాయమైనప్పుడు లేదా భుజం ‘గూడ’ తప్పినప్పుడు లేదా భుజం విరిగినప్పుడు కూడా కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల షోల్డర్ ఆర్థరైటిస్ రావచ్చు. లక్షణాలు: భుజంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
కదిలించినప్పుడు కీళ్లమధ్య రాపిడి జరుగుతున్నట్లుగా ఉంటుంది. భుజం కదిలించడంలో ఇబ్బంది. నిర్ధారణ: సాధారణ ఎక్స్-రేతో భుజం ఆర్థరైటిస్‌ను స్పష్టంగా నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: సమస్య మొదటి దశలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, ఇంజెక్షన్స్‌తో దీనికి చికిత్స చేయవచ్చు. అయితే కొన్నిసార్లు షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ లేదా రివర్స్ షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం కావచ్చు. సర్జరీ అవసరం ఎప్పుడన్నది ఆర్థరైటిస్ ఏ దశలో ఉందన్న అంశంపై ఆధారపడుతుంది.
ఆటలతో భుజానికి అయ్యే గాయాలు: భుజం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కాబట్టి గాయమయ్యే అవకాశమూ ఎక్కువే. సాధారణంగా ఆటల్లో భుజంలో గూడ తప్పడం అనే సమస్య వస్తుంది. అప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చడంతో పరిస్థితి చక్కబడుతుంది. ఇక గూడ తొలగడం అనేది నిత్యం జరుగుతూ ఉంటే ఆర్థోస్కోపీ స్టెబిలైజేషన్ అనే శస్త్రచికిత్సతో దాన్ని సరిచేస్తారు.
భుజానికి వచ్చే సమస్యల నివారణ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల భుజం కండరాలు బలంగా మారి భుజానికి వచ్చే అనేక సమస్యలు నివారితమవుతాయి వ్యాయామంలో వెనకవైపు కండరాలపై కూడా దృష్టిపెట్టడం... చాలా మంది శరీరానికి ముందువైపు ఉన్న కండరాలు బలంగా రూపొందినట్టు కనిపించడానికి తగిన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే భుజం విషయంలో మాత్రం చేతులకు వెనకవైపున ఉండే కండరాలు కూడా బలంగా రూపొందే వ్యాయామాలు చేయాలి కంప్యూటర్‌పై పనిచేసేవారు, వీడియోగేమ్స్ ఆడేవారు, టీవీ చూసేవారు, డ్రైవింగ్ చేసేవారు నిటారుగా కూర్చోవడం అవసరం.
- నిర్వహణ : యాసీన్