మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం | Prayer dad alata | Sakshi
Sakshi News home page

మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం

Published Thu, May 22 2014 10:44 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం - Sakshi

మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం

ధ్యాన భావనలు
 
మనసుని తొలిచివేసే ఆలోచనల్లో భయం ఒకటి. భయం సార్వజనీనం. పశుపక్ష్యాదులకు కూడా ఉంటుందీ భయం. భయాన్ని మన జీవితంలో అనేక రకాల బెంగలతో భవిష్యత్తు, కుటుంబం, పని లేదా వ్యాపారాల గురించి వెలిబుచ్చుతాం. కొన్ని బెంగలు చిన్నవిగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి. ఇది మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు మంచిది కాదని మనందరికీ తెలుసు.

బెంగపడి సాధించేదేమీ లేదని కూడా తెలుసు. మనకు భవిష్యత్తులో రాసిపెట్టి ఉన్నదాన్ని, మనం బెంగపడడం వల్ల ఏమీ మార్చలేమనీ తెలుసు. అయినప్పటికీ మనం బెంగపడి, కంగారు పడి, దిగులు చెంది, భయపడి పోతుంటాం. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్య మన వివేకానికి సంబంధించినది కాదు. అలాగయితే భయం తొలగిపోవాలి. మరి సమస్య ఎక్కడుంది? మన మనసులో, మన మానసిక అలవాట్లలో ఉందన్నమాట.
 
సగం మానసిక సమస్యలు నా భావపరమైన అలవాట్ల నుంచి వస్తాయి. ఈ అలవాట్లు నేను నా మనసులో పదేపదే భావాలను తిరగదోడటం వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు భావాలు నా అంతఃచేతన మనసులో లోతుగా ఉన్నాయి. వాటిని సంస్కారాలు లేదా వాసనలు అంటారు. వాటిని నేను పారద్రోలాలంటే, నేను వాటిని ప్రయత్నపూర్వకంగా బయటకు లాగి, వాటి వ్యతిరేక భావాలను సాధన చేయాలి.

నేను ప్రశాంతంగా కూర్చొని, నా బెంగలనన్నిటినీ పైకి లాగి, వాటిని బయట పెట్టి, వాటి కింద దాగిన గట్టి మనసును కనుక్కోవాలి. నేను బెంగపడడం లేదని నాకు నేనే చెప్పుకోవాలి. మొదట్లో అది యాంత్రికంగా ఉండవచ్చు. లేదా చూడడానికి అలా ఉండవచ్చు. కానీ రానురాను అది నేను అలవరచుకున్న ఒక సానుకూల ఆలోచన అవుతుంది. ఈ కొత్త అలవాటును పెంపొందించుకోడానికి, నేను దేవుని సహాయం కోరుతాను. నాకు బలాన్నివ్వమని వేడుకుంటాను.
 
‘ఓ దేవా! నా భవిష్యత్తును, అది ఎలాగున్నా సరే, మనస్ఫూర్తిగా ఆహ్వానించే శక్తిని ఇవ్వు నాకు. నా భవిష్యత్తు గానీ, నా కుటుంబ భవిష్యత్తుగానీ, నా దేశ భవిష్యత్తుగానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది మంచీచెడుల మేలు కలయికగా ఉంటుందని మాత్రం నాకు తెలుసు. నేను వాటిని అనుభవించక తప్పదు. ఎందుకంటే నేను భూమ్మీద పుట్టిందే నా కర్మఫలాన్ని హరింపజేయడానికి. వాటిని నేను ఆడించలేను. తప్పించుకోలేను. అందుకని ఏ విధమైన బెంగకూ లోను కాకుండా, వాటిని ప్రశాంతంగా ఆహ్వానించేందుకు నాకు శక్తి కావాలి’.

ప్రార్థన చేస్తే నా శక్తి పెరుగుతుందని మొదట నేను నమ్మాను. మనసారా, భక్తితో చేసిన ప్రతి ప్రార్థన తర్వాతా నేను మరింత శక్తిని పుంజుకున్నాను. ఆ శక్తిని నేను గ్రహించుకుని, నేనిప్పుడు మరింత శక్తిమంతంగా ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి సంఘటననైనా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అని నాకు నేనే చెప్పుకుంటాను.

నా వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, కుటుంబ సభ్యుల జీవితాలలో ఒడిదుడుకులు, వ్యాపారంలో లాభనష్టాలు ఏవి కలిగినా సరే నాకిక బెంగ లేదు. నేను ఇక కంగారుపడను. నేను ఇక దిగులు చెందను. మిన్ను విరిగి మీదపడ్డా దాన్ని ఎదుర్కోడానికి నేను సిద్ధం. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. శాంతోహం శాంతోహం శాంతోహం.
 
- స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement