కొండగుహల్లో రహస్య ప్రార్థనలు
హ.అబూబక్ ్ర(ర) చాలా శాంతస్వభావి, కారుణ్య హృదయులు. యావద్ జాతి ఆయన్ని గౌరవించేది. చిన్నాపెద్ద అందరూ ఆయన్ని అభిమానించేవారు. ఆయన ఖురైష్ వంశంలోని అత్యంత ఉన్నత వంశానికి చెందినవారు. గొప్ప వివేక సంపన్నులు. వృత్తివ్యాపారం, దైవం ఆయన వ్యాపారంలో వృద్ధితోపాటు, ఆయనకు మంచి మనసునూ ప్రసాదించాడు. వ్యాపారంలో వచ్చిన సంపాదన అంతా పేదసాదలకోసం ఖర్చుపెట్టేవారు. ప్రతి వ్యవహారంలోనూ ప్రజలు ఆయన్ని సలహాలు అడిగేవారు. చక్కటి సలహాలతో వారి సమస్యల్ని ఇట్టే పరిష్కరించేవారు.
ముహమ్మద్ (స) తోపాటు, ఆయన కూడా తనదగ్గరికొచ్చే వారికి ఇస్లామ్ ధర్మాన్ని పరిచయం చేసేవారు. చాలామంది ఆయన మాట విని ధర్మపరివర్తన చెందారు. మొట్టమొదట ధర్మ పరివర్తన చెందిన వారిలో ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర), జుబైర్ బిన్ అవ్వామ్ (ర), అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (ర), సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ (ర), తల్ హా బిన్ ఉబైదుల్లాహ్ (ర) తదితరులు అగ్రగణ్యులు.
తరువాత, జర్రాహ్ కొడుకు అబుఉబైదా (ర) అబూఅర్ఖమ్ కుమారుడు అర్ఖమ్ (ర) విశ్వాసులుగా మారారు. ఈవిధంగా అనేకమంది ఇస్లామ్ ధర్మ పరిధిలోకొచ్చారు. వీరిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు చాలామంది ఉన్నారు. విశ్వాస ప్రకటన చేసిన స్త్రీలలో ప్రియప్రవక ్త(స) కుమార్తెలతోపాటు, హ.అబూబకర్ కుమార్తెలూ ఉన్నారు.
ఈవిధంగా దైవధర్మం క్రమక్రమంగా విస్తరించసాగింది. దాంతోపాటే వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ధర్మపరివర్తన చెందిన ఈ కొద్దిమంది విశ్వాసులు ఇప్పటివరకూ తమతమ గృహాల్లోనే రహస్యంగా ప్రార్ధనలు చేసుకునేవారు. ఇప్పుడు అది కూడా కష్టం కావడంతో, జనసంచారానికి దూరంగా కొండగుహల్లో నమాజులు చేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి పెద్దచర్చకే దారితీసింది.
’ఏమిటీ, ముహమ్మద్ విగ్రహారాధనను కాదనడమా? తాత ముత్తాతల ప్రాచీన ధర్మాన్ని త్యజించి, తనను తాను ప్రవక్తగా ప్రకటించుకోవడమా? ఎంతధైర్యం? అంటూ చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఎవరినోట విన్నా ఇదే చర్చ. ముహమ్మద్ ప్రవక్తను రకరకాల మాటలు అనడం ప్రారంభించారు. కొంతమంది పిచ్చిపట్టిందన్నారు. కొంతమంది దయ్యం పట్టిందన్నారు, మరికొంతమంది సంచలనాలకోసం, పేరుప్రఖ్యాతుల కోసం ఇదంతా చేస్తున్నాడన్నారు.
కొంతమంది తేలిగ్గా కొట్టిపారేస్తూ ఇదసలు పట్టించుకోవాల్సినంత విషయమే కాదన్నారు. కొంతమంది అసలిదేమిటో చూద్దాం, పొయ్యేదేముంది? ఉంటే లాభమే ఉంటుంది తప్ప నష్టం ఉండకపోవచ్చు. తెలుసుకుందాం, పరిశీలిద్దాం. తప్పేముంది? అనుకున్నారు. ‘ప్రశ్నిద్దాం, పరిశీలన చేద్దాం’ అనుకున్నవారు చాలామంది వాస్తవాలు తెలుసుకొని విశ్వాసులుగా మారిపోయారు.
అబూతాలిబ్ మనసులో కూడా ఇదే ఆలోచన వచ్చింది. అసలు అబ్బాయిని కలిసి వివరంగా మాట్లాడాలి. అసలా కొత్తధర్మం సంగతేంటో తేల్చాలి అని జాఫర్‌ను వెంటబెట్టుకొని బయలుదేరారు. ఆ సమయాన ముహమ్మద్ ప్రవక్త ఊరికి దూరంగా ఒక కొండగుహలో హ. అలీతో కలసి నమాజ్ చేస్తున్నారు.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)