సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?! | Psoriasis is reduced when it is no longer ?! | Sakshi
Sakshi News home page

సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?!

Published Wed, Aug 3 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?!

సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?!

హోమియో కౌన్సెలింగ్

నా వయసు 35 ఏళ్లు. నేను చాలాకాలంగా శరీరంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్, చర్మం పగిలినట్లుగా కావడం, చర్మంపై పొలుసుల్లా వచ్చి రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే సోరియాసిస్ అని నిర్ధారించారు. ఏవేవో ఆయింట్‌మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ సమస్య మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. అసలీ సమస్య ఎందుకు వస్తుందో తెలియ జేయండి. హోమియోలో దీనికి శాశ్వత పరిష్కారం ఉందా?  - వినయ్, కర్నూలు
సోరియాసిస్ అనేది దీర్ఘకాలం కనిపించే చర్మవ్యాధి. కానీ అంటువ్యాధి మాత్రం కాదు. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వస్తే చర్మం ఎర్రగా మారుతుంది. పొడిబారినట్లుగా అయిపోయి చర్మం పొలుసుల్లా రాలిపోతుంది. దురదలు రావడం, మచ్చలు పడటం కూడా జరుగుతాయి.

కారణాలు: సోరియాసిస్‌కు ఇప్పటివరకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. అవి...  మానసిక ఒత్తిడి  వంశపారంపర్యం  ఆటోఇమ్యూన్ ప్రతిస్పందన  జన్యుసంబంధిత లోపాలు.

రకాలు: చర్మ కణాలు, చర్మం మీది రంగులను బట్టి సోరియాసిస్‌ను చాలా రకాలుగా విభజించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని...

 
ఫ్లేక్ సోరియాసిస్: ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చర్మం మీద ఎర్రగా పొంగిన కణాలను కలగజేస్తుంది. ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులుగా వృద్ధి అవుతాయి. ఇవి ఎక్కువగా తల, మోచేతులు, మోకాళ్లు, గోళ్ల మీద ఏర్పడతాయి.

 
గట్టేట్ సోరియాసిస్: ఇందులో నీటి బొట్ల లాంటి చిన్న చర్మ కంతుల వంటివి ఏర్పడతాయి.

 
ఫిస్టులార్ సోరియాసిస్: దీనిలో తెల్లటి చీము వంటి చిక్కటి పదార్థం కలిగిన బొబ్బలు చర్మంపై కనిపిస్తుంటాయి.

 
సోరియాటిక్ ఆర్థరైటిస్
: ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక రకమైన కీళ్లకు సంబంధించిన వ్యాధి. దీనిలో సోరియాసిస్‌తో పాటు కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి.

 
లక్షణాలు:  చర్మం ఎర్రగా మారడం  దురద  చర్మం గట్టిగా తయారవడం  అరికాలు, అరచేయిపై బొబ్బలు ఏర్పడటం  గోళ్లు పెళుసుగా తయారయ్యి నల్ల రంగుకు మారడం జరుగుతుంది  మానసిక ఒత్తిడి పెరుగుతుంది  కీళ్లనొప్పులు  దురద ఎక్కువగా ఉన్నప్పుడు గీరగానే చర్మం మీద పుండ్లు పడి రక్తం స్రవించడం కనిపిస్తుంది.

 
సోరియాసిస్‌ను ప్రేరేపించే కారణాలు: సోరియాసిస్ అనేది చికిత్స తీసుకుంటున్నా తగ్గుతూ, మళ్లీ పెరుగుతూ ఇబ్బంది పెడుతుంది. అయితే దీన్ని ప్రేరేపించే కారణాలకు దూరంగా ఉంటే వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి...  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి  దుమ్ము ధూళి పెంపుడు జంతువుల వంటి అలర్జీలను కలిగించే కారకాలకు దూరంగా ఉండాలి  యాంటీ బయాటిక్స్ వాడినప్పుడు దీని తీవ్రత పెరుగుతుంది. కాబట్టి వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి  మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి  చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండటం మంచిది  పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.

 
నిర్ధారణ: రోగి వైద్య చరిత్రను పరిశీలించడం, చర్మాన్ని పరీక్షించడం ద్వారా దీని నిర్ధారణ చేయవచ్చు. వ్యాధిలోని వ్రణాలను బట్టి, చర్మంపై కనిపించే లక్షణాలను బట్టి అది ఏ రకమైన సోరియాసిస్ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది.

 
నివారణ:  వ్యాయామం చేయడం  పరిశుభ్రత పాటించడం  పోషకాహారం తీసుకోవడం  విశ్రాంతి తీసుకోవడం  మంచి ఆహారపు అలవాట్లు  మెడిటేషన్  చర్మ సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం  ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా శుభ్రత పాటించడం  చర్మం పొడి బారకుండా ఆయిల్ పూయడం వంటి జాగ్రత్తల ద్వారా నివారించొచ్చు.

 
చికిత్స: సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక రోగికీ, మరో రోగికీ వ్యాధి తీవ్రతలో, లక్షణాల్లో తేడా ఉంటుంది. హోమియో విధానంలో రోగి అలవాట్లు, వ్యక్తిత్వం, మానసిక స్థితి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని, కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో మందులిస్తారు. హోమియో మందుల ద్వారా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. మళ్లీ ఇది తిరగబెట్టకుండా కూడా చేయవచ్చు.

 

డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement