
తోటలో రాముడు... కోటలో రాణి
ఇదొక ప్రేమకథా విచిత్రం. ఓ దళిత కులానికి చెందిన చిత్రకారుడిపై స్వీడెన్ రాచకన్య మనసుపడింది.
ఇదొక ప్రేమకథా విచిత్రం. ఓ దళిత కులానికి చెందిన చిత్రకారుడిపై స్వీడెన్ రాచకన్య మనసుపడింది. పేద తూర్పుకి, రాచ పడమరకి; అడవిలో ఉసిరికి, సముద్రంలో ఉప్పుకి కలిసినట్టు జత కలిసింది. ఆమెను వెతుక్కుంటూ మనోడు ఉన్న ఆస్తిని తెగనమ్మి ఓ సెకెండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కుని ఒడిశా నుంచి స్వీడెన్‌కి బయలుదేరాడు. నాలుగు నెలలు ప్రయాణించి అఫ్గనిస్తాన్, ఇరాన్, టర్కీ, బల్గేరియా, యుగోస్లేవియా, జర్మనీ, ఆస్ట్రేలియాలను దాటి డెన్మార్క్‌కి, అక్కడ నుంచి స్వీడెన్‌కి చేరాడు. ఆకలి, పేదరికం ఏవీ లెక్కచేయలేదు. ఆలోచనలన్నీ ఆ అమ్మాయిపైనే. ఆ అమ్మాయి కూడా పరమానందంగా అతడిని పెళ్లాడింది.
అక్కడకి వెళ్లాక కానీ ఆ ఆర్టిస్టుకి తెలియలేదు తాను తోటలో రాముడైతే, ఆమె ఒక కోటలో రాణి అని. ఆ రాకుమారికి, ఈ తోట రాముడికి పెళ్లై నలభై ఏళ్లు దాటింది. డా. ప్రద్యుమ్న కుమార్ మహానందియా అనే ఆర్టిస్టుకి, షార్టల్ వాన్ షెడ్విన్ అనే స్వీడిష్ రాచబిడ్డకి మధ్య నడిచిన ఈ నమ్మలేని ప్రేమకథా విచిత్రాన్ని ఈ మధ్యే డిసెంబర్ 10న ఫేస్ బుక్‌లో పెట్టారు. రీల్ స్టోరీ లాంటి ఈ రియల్ స్టోరీని మీరూ చదవండి.