
రాజభవనమేంటీ, ఇదీ సత్రమే
జెన్ పథం
ఆ రాజుకి భవనాలు కట్టించడంలో మక్కువెక్కువ. ఆయన ఎన్నో భవనాలు కట్టించాడు. అవన్నీ విలాసవంతమైనవీ, విశాలమైనవీనూ. కానీ మరోవైపు ఈ కట్టడాల వల్లఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. దాంతో ఆయన ఖజానా నింపడం కోసం ప్రజలపై కొత్త కొత్త పన్నులు వేయడం మొదలుపెట్టాడు. జనం వాటిని కట్టలేక అవస్థలు పడుతూ వచ్చారు. ఆకలి బాధలు ఎక్కువయ్యాయి. కడుపునిండా తిండి లేక ప్రజలు మాడాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆ తరుణంలో రాజ్యంలోని ఒక వీధి గుండా ఒక సాధువు నడుచుకుంటూ పోతున్నాడు. అక్కడక్కడ ప్రజలు తమ ఇక్కట్ల గురించి మాట్లాడుకోవడం ఆయన చెవిన పడింది. ఆయన మనసులో ఏ ఆలోచన వచ్చిందో గానీ ఆయన ప్రయాణ దిశ మారింది. పొరుగూరుకు వెళ్లాలనుకున్న ఆయన తిన్నగా రాజుగారి ఆస్థానానికి అడుగులు వేశారు.
సాధువు రూపం చూసీచూడగానే గౌరవించేటట్టు ఉంది. ఆయన రాజుగారి భవంతికి చేరుకున్నారు. ప్రవేశద్వారం వద్ద ఉన్న భటులు ఆయనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుపడలేదు. ఆయన ఎవరని కూడా అడగలేదు. సాధువు సరాసరి రాజుగారి భవనంలోకి అడుగుపెట్టారు.
ఆయన వెళ్లేసరికి అక్కడ సభ జరుగుతోంది. ఇరవై మెట్లు పైన ఉన్న సింహాసనంలో రాజుగారు కూర్చుని ఉన్నారు. ఈ మెట్లకు అటూ ఇటూ ఉన్న ఆసనాలలో మంత్రులు, పండితులు కూర్చున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా సభలోకి వచ్చి నిల్చున్న సాధువును చూసి రాజు సహా అందరూ ఆశ్చర్యపోయారు. సాధువును చూసిన రాజు ‘‘మీరెవరు? మీకు ఏం కావాలి? మిమ్మల్ని లోపలకు పంపింది ఎవరు?’’ అని ప్రశ్నలవర్షం కురిపించాడు.
కానీ సాధువు రాజుగారి మాటలేవీ పట్టించుకోకుండా ‘‘ఈ రోజు రాత్రి నిద్రపోవడానికి నాకు కాస్తంత చోటు కావాలి’’ అని అన్నారు.
రాజుకుగానీ మరెవ్వరికీ గానీ ఆయన మాట అర్థం కాలేదు.
‘‘ఏంటీ? నిద్రపోవడానికా’’ అని రాజు అడిగాడు.
‘‘ఈ రోజు రాత్రి ఈ సత్రంలో నిద్రపోవాలనుకుంటున్నాను. రేపు ఉదయం లేచీలేవగానే నా పనులు కానిచ్చుకుని వెళ్లిపోతాను’’ అని సాధువు తాపీగా జవాబిచ్చారు.
‘‘చూడ్డానికి పెద్దవారిలా ఉన్నారు. మీ మాట విచిత్రంగా ఉంది. ఇది మీరనుకుంటున్నట్లు సత్రం కాదు. ఇది నా రాజభవనం’’ అని రాజు మీసాలు దువ్వాడు.
‘‘అలాగా?’’ అంటూ ‘‘మీ ముందు ఇక్కడ ఎవరున్నారు?’’ అని అడిగారు సాధువు.
‘‘మా నాన్నగారు’’
‘‘ఆయన ఎక్కడున్నారు?’’
‘‘ఆయన ఇప్పుడు లేరు. గతించారు’’
‘‘ఆయనకన్నా ముందు...’’
‘‘మా తాతగారు’’
‘‘ఆయన ఏమయ్యారు?’’
‘‘ఆయనా చనిపోయారు’’ - ఇలా మరో రెండు తరాల వారి గురించి వారి మధ్య మాటలు సాగాయి.
ఆ తర్వాత సాధువు ‘‘బాటసారులు కొంతకాలం బసచేసి వెళ్లిపోయే చోటును సత్రమనేగా అంటారు. మీరంటున్న ఈ రాజభవనంలో ఇప్పుడు మీరున్నారు. మీ కన్నా ముందు మీ నాన్నగారు. అంతకన్నా ముందు మీ తాతగారు, ఆయన కన్నా ముందు మీ ముత్తాత ఇలా ఎవరో ఒకరు ఉండిపోయే ఈ చోటుని కూడా సత్రమనే నేనంటాను. ఏమీ అనుకోకపోతే ఒక మాటంటాను. ఇప్పుడు మీరున్నారు. మీ తర్వాత మీ కుమారుడు ఉంటాడిక్కడ. అతని తర్వాత అతని కుమారుడు... ఇలా ఉండిపోతుంటారు. ఎవరూ శాశ్వతంగా ఉండడం లేదు. అటువంటప్పుడు ఇది ఎలా రాజప్రాసాదం అవుతుంది. ఇదీ ఒక సత్రమే అనుకోవడంలో తప్పేముంది?’’ అని ప్రశ్నించడంతో రాజు ఆ సాధువు సామాన్యులు కాదని, ఓ జ్ఞాని అని గ్రహించాడు. ఆయన ఏం చెప్పదలచుకున్నారో అర్థమైంది. ఆయన తన కళ్లు తెరిపించారని తెలుసుకుని అప్పటి నుంచి విలాసవంతమైన భవనాలు కట్టించడం మానేశాడు. ఖజానాలో డబ్బులు మిగుల్తూ వచ్చాయి. దాంతో ప్రజలపై పన్నులు విధించే అవసరమూ కలగలేదు. అప్పటి దాకా ఉన్న పన్నులే కాకుండా పన్ను బకాయిలను సైతం కట్టక్కర్లేదని దండోరా వేయించాడు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల ప్రశంసలు పొందుతూ రాజు మిగిలిన శేషజీవితం ఆనందంగా గడిపాడు.
- యామిజాల జగదీశ్