రాజేష్ ఖన్నా... ఆ అహం... ఆ తేజం.... | Rajesh Khanna's memorial today | Sakshi
Sakshi News home page

రాజేష్ ఖన్నా... ఆ అహం... ఆ తేజం....

Published Sun, Jul 17 2016 11:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

రాజేష్ ఖన్నా...    ఆ అహం... ఆ తేజం.... - Sakshi

రాజేష్ ఖన్నా... ఆ అహం... ఆ తేజం....

నేడు రాజేష్ ఖన్నా వర్థంతి
 
మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ పూచిక పుల్లలా ఉన్నవాడు రేపు పెద్దవాడు కావచ్చు. టైమ్ బాగుంటే ప్రధాని అంతటి వాడు కూడా కావచ్చు. అయి ఊరుకుంటే పర్లేదు. పూచిక పుల్ల అంటూ తనను అవమానించినవారిని గుర్తు పెట్టుకుంటేనే చిక్కొస్తుంది. ఆపైన ప్రమాదం వస్తుంది. బాలీవుడ్‌లో రచయితలకు పెద్దగా విలువగానీ డబ్బుగానీ చాలాకాలం వరకూ లేవు. సలీమ్- జావేద్ ఈ విషయాన్ని మార్చాలనుకున్నారు. వీళ్లిద్దరూ రమేష్ సిప్పీ దగ్గర నెలకు రూ.750 రూపాయలకు పని చేసినవారే కావచ్చు కాని ‘హాతీ మేరి సాతీ’ (1971) సినిమాకు రూ. పదివేలు డిమాండ్ చేయగలిగారు. కాని అది కూడా చిల్లర డబ్బుగా భావించారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా నటించిన రాజేష్ ఖన్నా పారితోషికం ఎంతో తెలుసా? ఐదు లక్షలు. ఆ డబ్బుతో పోలిస్తే తమకు వచ్చింది చాలా తక్కువ అని జావేద్ అభిప్రాయం. మీ ముఖాలకు అంతకు మించి ఎందుకు నన్ను చూసి కదా వస్తారు అని రాజేష్ ఖన్నా అభిప్రాయం. అతడికి ఆ అభిప్రాయం ఉండటంలో తప్పు లేదు. అప్పటికే ఆరాధన (1969) వచ్చి ఆయన భారతీయ తొలి సూపర్‌స్టార్ అయి ఉన్నాడు. దేశం ఆయన పేరు చెప్తే వెర్రెత్తి పోతూ ఉంది. దేవుడని అంటోంది. ఆ దేవుడికి సలీమ్ జావేద్‌లు అల్పులుగా కనిపించి ఉండవచ్చు. రాజేష్ ఖన్నా తమను దగ్గర తీయలేదని కూడా వారికి బాధ ఉంది.

ఇది అమితాబ్‌కు లాభించింది. ‘జంజీర్’ (1973) స్క్రిప్ట్‌కు దర్శకుడు ప్రకాశ్ మెహ్రా రాజేష్ ఖన్నాను ఆలోచించినా వీళ్లిద్దరూ అమితాబ్‌కే ఓటు వేశారు. అంతే కాదు షోలే, దీవార్ వంటి సూపర్ హిట్స్ రాసి సినిమాలను శాసించే స్థితికి వెళ్లాక వాళ్లు రాజేష్‌ఖన్నాతో ఒక్క సినిమా కూడా చేయలేదని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. రాజేష్ ఖన్నా తనకు ప్రతిభావంతుల అవసరం ఉందని గుర్తించ లేదు. శక్తి సామంతా, కిశోర్ కుమార్, ఆర్.డి. బర్మన్ ఇలా కొద్ది మంది మాత్రమే అతని కోటరీలో ఉండేవారు. మిగిలిన వాళ్లందరూ ‘చెంచాలు’ (అలా అని ఇండస్ట్రీ అనేది)గా ఉండేవారు. రాజేష్ ఖన్నాకు క్రమశిక్షణ గురించి పట్టింపు లేదు. దర్శకులకు ఇది ఇబ్బంది. రాజేష్‌ఖన్నాతో రోటీ, దాగ్ వంటి సినిమాలు తీసిన మనమోహన్‌దేశాయ్, యశ్ చోప్రాలు అతడితో వేగలేక అమితాబ్‌ను ఎంచుకున్నారు. టైమ్ అంటే టైమ్‌గానే నడిచే అమితాబ్ బచ్చన్ వ్యవహార శైలి సుఖంగా ఉండటం అందుకు ప్రధాన కారణం ప్రతిభ కంటే. ఇక వ్యక్తిగతంగా అంజు మహేంద్రుతో ప్రేమ, డింపుల్‌తో పెళ్లి కూడా రాజేష్ ఖన్నాను కెరీర్‌పై దృష్టి పెట్టడంలో అంతరాయాన్ని కలిగించాయి.

కాలం గడిచిపోయాక ఇలా బేరీజు వేయవచ్చుగాని కాలం గడుస్తూ ఉండగా తప్పొప్పులు అర్థం కావు. రాజేష్ ఖన్నా తాను నడిచిన దారిలో నడిచాడు. అతని రూపం, స్టయిల్, నటన, ప్రతిభ, హుందాతనం, నవ్వే కళ్లు... ఇవన్నీ జనాన్ని నచ్చాయి. ‘అభిమాని ఏర్పడటం’ అనే భావన అతని నుంచే మొదలయ్యింది. జిమ్మిక్కులు, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్టు, సోషల్ మీడియాలో ప్రచారం ఇవన్నీ లేకుండానే రాజేష్ ఖన్నా ఈ దేశం మొత్తాన్ని ఊపాడు. ఒక దశలో దేశప్రధాని తర్వాత ప్రతి పౌరుడికీ తెలిసిన వ్యక్తి అయ్యాడు. అతని సినిమాలు ఫ్లాప్ అయి ఉండవచ్చు. కాని అతడు నాసిరకం సినిమాలు చేయలేదు. సినిమాలలో భ్రష్టత్వాలకు పాల్పడలేదు.
 
స్టార్ అతను.... సూపర్‌స్టార్.తప్పు... లోపం... పొరపాటు... ఇవి ఎన్నైనా ఉండవచ్చు.  అయినా అతడు ఈ దేశం మెచ్చిన హీరో. ఎప్పటికీ దేశం గుర్తు చేసుకునే హీరో.
 
రాజేష్ ఖన్నా హిట్స్
1.    మేరె సప్‌నోంకి రాణి కబ్ - ఆరాధన
2.     ఏ జో మొహబ్బత్‌హై - కటి పతంగ్
3.     కోరా కాగజ్ థా యే మన మేరా - కోరా కాగజ్
4.     గులాభీ ఆంఖే జో తేరి దేఖీ - ది ట్రైన్
5.     యూహీ తుమ్ ముజ్ సే బాత్ కర్‌తీ హో - సచ్చా ఝూటా
6.     ఏ రేష్మి జుల్ఫే ఏ షర్బతీ ఆంఖే - దో రాస్తే
7.     జిందగీ కా సఫర్ హై ఏ కైసా సఫర్ - సఫర్
8.     చింగారి కోయి భడ్ కే - అమర్ ప్రేమ్
9.     జిందగీ కైసి హై పహేలీ హా యే - ఆనంద్
10.    జిందగీ కె సఫర్ మే గుజర్ జాతె హై - ఆప్ కీ కసమ్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement