రాజేశ్‌ఖన్నా విగ్రహావిష్కరణ
Published Sat, Aug 10 2013 11:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
ముంబై: బాలీవుడ్‌లో మొదటి సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్‌ఖన్నా కాంస్య విగ్రహాన్ని నగరంలోని ఓ హోటల్‌లో ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా ఖన్నా గత జూలై 18న మరణించడం తెలిసిందే. యూటీవీ స్టార్స్ చానెల్ ఆయన గౌరవార్థం బాంద్రాలోని బండ్‌స్టాండ్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఇక్కడ ఇది వరకే యశ్‌చోప్రా, రాజ్‌కపూర్, షమ్మీకపూర్, దేవానంద్ విగ్రహాలున్నాయి. ఖన్నా విగ్రహం కుడిచేతిలో రెండు బెలూన్లు కనిపిస్తాయి. ఇది ఆనంద్ చిత్రంలోని ఆయన పోజనే విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణకు ఖన్నా మాజీ భార్య డింపుల్ కపాడియా, కూతురు ట్వింకిల్, అల్లుడు అక్షయ్‌కుమార్, ఆయన స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు రిషికపూర్, జితేంద్ర, హేమామాలిని, రణధీర్ కపూర్, రాకేశ్ రోషన్, ఆశాపరేఖ్, జీనత్ అమన్, ఫర్హాన్ అఖ్తర్ సతీమణి అధునా, ఆమె తల్లి హానీ ఇరానీ, మిథున్ చక్రవర్తి, అంజూ మహేంద్రూ తదితరులు హాజరయ్యారు.
‘కాకాజీ (ఆయనను అంతా ఇలా ప్రేమగా పిలుచుకునేవారు) ఎప్పుడే శక్తిమంతుడే! జీవితాంతం ఎవరికీ భయపడకుండా తనకు నచ్చినట్టు వ్యవహరించారు. సినీపరిశ్రమకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. ఆనంద్ పాత్రధారి మాదిరిగానే నిజజీవితాన్ని గడిపారు. ఆయనతో నా ప్రయాణం మధురమైనది. ఖన్నా జీవితభాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది’ అని డింపుల్ పేర్కొన్నారు. ఖన్నా నటించిన చివరి వాణిజ్య ప్రకటనలో ఆయన పలికిన కొన్ని మాటలను కూడా ఆమె ఈ సందర్భంగా వినిపించారు. ఆ ప్రకటనలో ఆయన ‘నా అభిమానులను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని అంటారు. బాంద్రాలోని కార్టర్‌రోడ్డు లేదా మరేదైనా మార్గానికి ఖన్నా పేరు పెట్టాలని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి రాజీవ్‌శుక్లాను ఆమె కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ నాన్న ఎల్లప్పుడూ తన హృదయంలోనూ ఉంటారని, ఆయన విగ్రహం ప్రతిష్ఠిస్తున్నందుకు తమ కుటుంబం ఎంతగానో సంతోషిస్తోందని చెప్పింది. ఇక అక్షయ్ తన పదేళ్ల కొడుకు రాసిన సందేశాన్ని చదివి వినిపించాడు.
తాతతో తనకున్న అనుబంధాన్ని ఈ బాలుడు అందులో పేర్కొన్నాడు. ఆయన గొప్ప మనిషని, ఎప్పుడూ తన వెన్నంటే ఉంటారన్నాడు. ‘విగ్రహంలోని ఆయన చూపులు నిర్భీతి, సంతోషం, స్వేచ్ఛకు సంకేతాలు. జీవితాన్ని ఎప్పుడూ స్వేచ్ఛగా గడపాలని బెలూన్లు సూచిస్తాయి. విగ్రహం కూడా అద్భుతంగా ఉంది’ అని అక్షయ్ వివరించాడు. ఖన్నా బాలీవుడ్‌కు చేసిన కృషికి గుర్తింపు విగ్రహస్థాపన ద్వారా దక్కిందని హమామాలిని అన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఖన్నా ప్రముఖ గేయాలు ‘అచ్చా తో హమ్ చల్తే హై’, ‘జిందగీ కా సఫర్’, ‘మేరే సప్నో కీ రాణి’ వంటి వాటిని వినిపించారు. భారత సినీపరిశ్రమ ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఖన్నా 1962-72 మధ్యకాలంలో వరుసగా 15 హిట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు.
Advertisement