
ఇవ్వడమే దైవత్వం
నేను నా దైవం
గుండెనిండా అల్లా ఉంటే ఆకలి తెలియదుగా!
అల్లా ఇచ్చినది నల్గురికి పంచిపెడితే..
మిగిలేది తృప్తేగా!
రోజుకు వంద రూపాయలిస్తే
చాలు అల్లా అని అడిగిన అలీకి
వెయ్యింతలు ఇచ్చిన దైవం రుణం ఎలా తీర్చుకోవాలి?
ఇచ్చి తీర్చుకోవాలి.
ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసాన్ని నిష్టగా నియమ నిబంధనలతో గడుపుతారు. ఈ మాస ప్రత్యేకతను, గొప్పతనాన్ని సినిమా నటుడు అలీతో కలిసి సంభాషించాలనుకున్నాం. హైదరాబాద్ మణికొండలోని అలీ ఇంటికి వెళ్లినప్పుడు ముందుగా వారి పిల్లలు కనిపించారు. వారిని పలకరిస్తుండగానే తెల్లటి ఖఫ్తాన్, తలమీద టోపీ ధరించిన మహమ్మద్ అలీ (పూర్తిపేరు) బయట నుంచి వచ్చారు. ప్రార్థన నుంచి వస్తున్నానని చెప్పి పరిచయాలు చేసుకున్నారు.
ప్రార్థనలో ఆ దైవాన్ని ఏమని కోరుకున్నారు అలీగారూ?
(చిరునవ్వుతో) అడగకుండానే ఎన్నో ఇచ్చాడు ఆ అల్లా. ఒకనాడు రోజుకు 100 రూపాయల పని ఇవ్వు అల్లా అని వేడుకున్నాను. నేను ఊహించకుండానే లక్ష రూపాయల పని ఇచ్చాడు. బంధువులను, స్నేహితులను, కుటుంబాన్ని ఇచ్చాడు. ఇంతకు మించి ఇంకా ఏమని కోరుకుంటాం. కృతజ్ఞతలు తెలుపుకొని, ఇలాగే నీకు దగ్గరగా ఉండే భాగ్యం ఇమ్మని వేడుకున్నాను.
మీలో చాలా భక్తి కనిపిస్తోంది. ఇన్నేళ్ల మీ జీవితంలో దైవమే మీతో ఉందని నమ్ముతారా?
కచ్చితంగా! దైవం లేకుండా మనమెంత ఎక్కణ్ణుంచి వచ్చాం? నేర్చుకున్న విద్య, చేసే పని, సంపద, కుటుంబం.. అన్నీ దైవం ఇచ్చినవే!
రంజాన్ మాసాన్ని నిష్టగా చేస్తున్నట్టున్నారు...
అవును, గత ఇరవై ఎనిమిదేళ్లుగా రంజాన్ మాసపు ఉపవాస దీక్ష రోజా నియమాలను పాటిస్తున్నాను. ఈ నెలంతా చాలా విషయాలపై అవగాహన కలుగుతుంది. శత్రువుని కూడా మిత్రుడిగా చూసే ఔదార్యం, ఎంత కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండాలనే సహనం, ఎంత దానం చేస్తే అంత మంచిదనే దయ... ఇలా ఎన్నో మంచి సుగుణాలను, ఆరోగ్యాన్నీ ఈ మాసం ఇస్తుంది. దైవానికి దగ్గరగా చేర్చే ఈ నెల కోసం పదకొండు నెలలూ ఎదురుచూస్తుంటాను. నేనే కాదు మా ఇంట్లో అంతా ఎదురుచూస్తుంటారు.
ఇంతటి భక్తి మీలో కలగడానికి ఎవరు కారణం? ఈ నియమాలన్నీ ఎవరు నేర్పారు?
మా నాన్న. నా ఎనిమిదేళ్ల వయసులో మా నాన్న తన దగ్గర కూర్చోబెట్టుకొని అల్లా అంటే ఎవరు? ప్రార్థన ఎందుకు, ఎలా చేయాలి? అని చెప్పారు. ‘ఏడాదిలో 11 నెలలు ఆనందంగా జీవించు. మిగిలిన ఒక్క నెల నన్ను గుర్తు చేసుకో’ అని దైవం చెప్పిన విషయాన్ని మా నాన్న ద్వారానే తెలుసుకున్నాను. అలాగని మిగతా 11 నెలలూ దైవాన్ని మర్చిపోండని చెప్పలేదు. ఈ ఒక్క నెల ఏడాది మొత్తం దైవానికి దగ్గర చేస్తుంది. ఈ నెలంతా భగవంతుడిని తలుచుకుంటే వచ్చే ఏడాదీ రంజాన్‌ని చూడచ్చు అన్న నమ్మకం ఏర్పడేలా చేసింది కూడా నాన్నే. తర్వాత జీవితంలో ఎంతోమంది పెద్దవాళ్లను కలుసుకున్నాను. ఖురాన్ ద్వారా తెలుసుకున్నాను. ఈ మాస నియమాల ప్రకారం... ఉదయం 3 గంటలకు నిద్ర లేస్తాం. రోజులో 5 సార్లు ప్రార్థన చేస్తాం. రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ఖురాన్ పఠనం. 5–6 పేజీలైనా సరే! ఇరవై సార్లు చదవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే ఖురాన్‌లో చెప్పిన విషయాల పట్ల అవగాహన కలుగుతుంది. ఎన్ని పనులున్నా నిష్టగా ఈ మాసాన్ని గడపడానికే ప్రాధాన్యత ఇస్తుంటాను.
రంజాన్ మాసం దానం విశిష్టతను చెబుతుంది, దీంట్లో మీ పాత్ర ఎంత?
ఈ దానం చేసే విధానాన్ని జకాత్ అంటాం. అయితే ఇదంతా గుప్తదానం. బైటికి చెప్పుకోకూడదు. మనం సంపాదించిన దాంట్లో 10 శాతం పేదలకు ఇవ్వాలనేది దైవ ఆజ్ఞ. నేను 20 శాతం ఇవ్వాలనుకున్నాను. నా తండ్రి రుణం తీర్చుకోవడానికి ఆయన పేరుతో రాజమండ్రిలో ట్రస్ట్ ఏర్పాటు చేశాను. దీని ద్వారా పేద విద్యార్థులకు చదువు, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్య ఖర్చులు ఇస్తున్నాను. కుటుంబ పెద్ద చనిపోయి పూట గడవడమే కష్టంగా ఉన్న ఓ ఇరవై కుటుంబాలకు నా ద్వారా ఆ అల్లాయే వారికి సాయం అందిస్తున్నాడు.
దైవమే మిమ్మల్ని నటుణ్ని చేసిందా?
ఒకనాడు బతుకు చౌరాస్తాలో నిల్చున్నాను. ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తుంటే.. ‘లెఫ్ట్ వెళ్లు’ అన్నాడు అల్లా. వెళ్లాను, యాక్టర్ అయ్యాను. అదే రైట్ వెళ్లమంటే (నవ్వుతూ) డాక్టర్ అయ్యేవాడినేమో! నాకున్న శక్తి ఏంటో, నేనేం చేయగలనో అల్లాకు తెలుసు కదా!
మీ మాటల్ని బట్టి దైవంతో మీకు ఆత్మీయ అనుబంధమేదో ఉందనిపిస్తోంది.
తండ్రికి బిడ్డకు ఉన్న అనుబంధమే! తండ్రి బిడ్డ బాగుండటాన్నే కోరుకుంటాడు.
దైవానికి దగ్గర కావాలంటే ఇంతటి కఠిన నిమయాలు అవసరమా?
పుస్తకం లేకుండా, పెన్సిల్ తీసుకెళ్లకుండా స్కూల్‌కి వెళితే ఏమౌతుంది? మాస్టర్ చెప్పిందంతా బుర్రలోకి ఎక్కించుకొని రాగలమా! అదంతా గుర్తుంటుందా? మాస్టర్ చెప్పిన విషయాలు నోట్స్ రాసుకోవాలి. పడుకునేముందు ఒకసారి చదువుకోవాలి. మళ్లీ ఉదయాన్నే లేచి మననం చేసుకోవాలి. ఇదీ అంతే! ఎంత సాధన చేస్తే అంత దైవం గురించి తెలుసుకోవచ్చు. దగ్గరవ్వచ్చు. ఇందులో నియమాల విషయానికి వస్తే సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నువ్వెంత తింటావో తిను. ఏం తాగుతావో అది తాగు. ఆ తర్వాత దైవం కోసం వదిలేయ్! ఈ సారి వేసవి చివరలో రంజాన్ స్టార్ట్ అయింది. ఇంకో పదేళ్లు వేసవిలోనే రంజాన్ మొదలవుతుంది. తర్వాత చలికాలంలో రంజాన్ వస్తుంది. అప్పుడు ఉదయం 3 గంటలకు లేవాలంటే మనకు ఫర్వాలేదు. కశ్మీర్, ఢిల్లీలో అయితే మైనస్ డిగ్రీలు ఉంటుంది. అప్పుడు కొంతమంది తప్పక దేవుడితో రాజీపడతారు. ఎవరైతే ఈ నెలరోజులు నిష్టగా ఉంటారో ఆ ప్రతి ఇంట్లో అల్లా ఉంటాడు.
పిల్లలకూ దైవభక్తి నేర్పడం వల్ల వారిలో ఎలాంటి స్పృహ కల్పిస్తున్నాం?
నేను డిగ్రీ వరకు చదివాననుకోండి. తండ్రిగా నా పిల్లలు ఎం.ఎ, పి.హెచ్‌డీ చేయాలి అనుకుంటానుగా. అది నాకు సంతోషం. దైవం కూడా తన పిల్లలు ఇంకా ఎంతో నేర్చుకోవాలని అనుకుంటాడుగా! అందుకని వారికీ దైవం గురించి చెప్పాలి. అప్పుడే తోటి వాడిలోనూ దైవాన్ని చూస్తాడు. సమాజాన్ని గౌరవిస్తాడు.
దైవం గురించిన సూచనలు ఎవరికైనా ఇస్తుంటారా?
‘ఇలా ఉంటే బాగుంటుంది’ అంటాను. కానీ, ‘ఇలాగే చేయండి’ అని చెప్పను. ముఖ్యంగా అవతలి వారి విషయాల్లో తలదూర్చను. నన్ను ఏదైనా అన్నా ఒక చెవితో విని, ఇంకో చెవితో వదిలేస్తాను.
మీ మీద కాంట్రావర్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు అలాగే వదిలేశారా? దైవంతో చెప్పుకున్నారా?
నేను కమెడియన్‌ని. ప్రేక్షకులను నవ్వించడమే నా పని. దానినే పాయింటౌట్ చేసి బురదచల్లే ప్రయత్నం చేస్తుంటారు కొన్నిసార్లు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకోను, ఎదుటివారినీ తప్పు పట్టను. ‘నేనేంటి?’ అని ప్రశ్నించుకుంటాను. ప్రశ్న మనదే, సమాధానమూ మనదే! ఈ విధానం వల్ల నన్ను నేను ఇంకాస్త మెరుగుపెట్టుకోవాలని చూస్తాను. ‘నాకెందుకు, అవసరమా?’ అనే తత్త్వం ఉందీ లోకంలో. యుద్దం జరుగుతుంటే చోద్యం చూడ్డం కాదు. వాళ్లూ మనుషులే అనే ఆలోచన వస్తే యుద్ధాలు ఉండవు. శాంతంగా బతుకుతారు.
ఇన్నేళ్ల మీ ప్రయాణంలో కష్టం కలిగిన సంఘటన, దైవంతో మీ కష్టం చెప్పుకున్న సందర్భం...
మనిషి భగవంతుడిని ఎప్పుడు తల్చుకుంటాడు? ఒకటి కష్టం వచ్చినప్పుడు, మరొకటి ‘జీవితం’ నిలబెట్టినప్పుడు. ఆ రెండింటినీ నేను చూశాను. మా అమ్మనాన్నలకు మేం ఆరుగురు పిల్లలం. ఇద్దరు అన్నదమ్ములం, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెల్లు. మా నాన్న క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్సులు కుట్టేవాడు. సూట్స్ కూడా కుట్టేవాడు. వాటిలో మిగిలిన గుడ్డతో ‘మీ పిల్లలకు డ్రెస్సులు కుట్టించుకోండి’ అని చెప్పేవారు మా నాన్న దగ్గరకు వచ్చేవారు. కష్టమనిపించేది. ఇప్పుడు నన్ను నిలబెట్టాడు అల్లా. నా ద్వారా కొందరికి దుస్తులు ఇప్పిస్తున్నాడు. మా అక్క ఫాతిమా నాకు అత్యంత ప్రియమైన నేస్తం కూడా! ఆమె చనిపోయినప్పుడు అమితంగా బాధపడ్డాను. నాకు కూతురు పుట్టింది. మళ్లీ ఆమెనే నా కూతురుగా పుట్టిందని ఆనందించాను. అక్క పేరే ఫాతిమా అని పెట్టుకున్నాను. పదిహేడేళ్ల క్రితం నా తండ్రి ఫాదర్స్ డే నాడే చనిపోయాడు. ఆయన చెప్పిన గొప్ప జీవిత సత్యాలు నాతోనే ఉన్నాయి. నా కొడుకుగా ఆయనే మళ్లీ వచ్చాడు. నాన్న పేరు అబ్దుల్లా, అదే పేరు నా కొడుక్కి పెట్టుకున్నాను. ముందు కష్టం ఉంటే సుఖం విలువ తెలుస్తుంది. అప్పుడు మనిషి దైవాన్ని మర్చిపోడు. మరింతగా ఆరాధిస్తాడు.
శత్రువునైనా ప్రేమించు అని చెబుతుంది రంజాన్. ఎంత కోపం ఉన్నా సరే పండగ రోజున అందరితో పాటు వారినీ ఆప్యాయంగా పలకరించు. ఈ ఒక్కరోజు అందరితో కలివిడిగా, స్నేహంగా ఉండు, ఆ తర్వాత నీ ఇష్టం. ఈ విధానం వల్ల ఎలాంటి వారి మధ్య మనస్పర్ధలు వచ్చినా అవి ఆ ఒక్కరోజుతో సమసి పోతాయి.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి