ఇక్కట్లు – పరిహారాలు
ఉపశమనం
ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా అర్హతలకు, అనుభవానికి తగిన అవకాశాలు దక్కవు. దొరికిన అవకాశాలు తగిన ఆదాయాన్ని ఇచ్చేవిగా ఉండవు. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించండి.
► కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి.
► ఎలాంటి ప్రలోభాలు ఎదురైనా అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి దూరంగా ఉండండి. జూదానికి, స్పెక్యులేటివ్ లావాదేవీలకు దూరంగా ఉండండి.
►కుంకుమపువ్వును, కస్తూరిని కలిపి తిలకంగా ధరించండి. నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి.
►ప్రవహిస్తున్న నీటిలో చిన్నబెల్లం ముక్కను, అక్షతలను విడిచిపెట్టండి. కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి.
►వెదురుబొంగులో పంచదార నింపి, నిర్జన ప్రదేశంలో దానిని పాతిపెట్టండి. మర్రిచెట్టు మొదట్లో పాలు, కొబ్బరినీరు పోయండి.
► శనివారం పూర్తిగా మద్యమాంసాలకు దూరంగా ఉండండి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం జరిపించండి. రుద్రాభిషేకం జరిపించడం వల్ల కూడా దోషనివారణ జరుగుతుంది.
– పన్యాల జగన్నాథ దాసు