పరిశోధన బయట ఆడిస్తే... భక్తిపరులౌతారు!
పిల్లల్ని తరచు బయటికి తీసుకు వెళుతుంటే వారి మనసు వికసిస్తుంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మరొక మంచి విషయాన్ని కూడా కనిపెట్టారు. వారానికి కనీసం 5 నుంచి 10 గంటల పాటు పార్కులో, మైదానాలలో ఆడుతుండే పిల్లల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయట!
ప్రకృతితో పిల్లలకు ఏర్పడే అనుబంధం వారిలో ఆత్మసంతృప్తిని, భక్తి ప్రపత్తులను కలిగిస్తుందని; పరిపూర్ణమైన మానవులుగా వారు ఎదుగుతారని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఆధ్యాత్మిక అధ్యయనాల విభాగం సహాయ ఆచార్యులు గ్రెటెల్ వాన్ వియరన్ చెబుతున్నారు. ‘‘ఆధునిక జీవితం మనిషికి, ప్రకృతికి మధ్య దూరాన్ని పెంచుతూ పోతోంది. దీని పర్యవసానం ఏమిటి? ముఖ్యంగా మన పిల్లలపై ఈ దూరం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నలకు జవాబు వెతుక్కునే ప్రయత్నంలో మాకు ఒక పెద్ద అధ్యయనమే అవసరమైంది.
తరచూ ఆరు బయట ఆటలాడే పిల్లలకు, ఇండోర్ గేమ్స్‌కు మాత్రమే పరిమితమైపోయి, ఎప్పుడోగాని బయటికి వెళ్లని పిల్లలకు మధ్య వ్యత్యాసాలను మా అధ్యయనంలో సునిశితంగా గమనించాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న పిల్లల్లో ప్రశాంతత, విధేయత; ప్రకృతిలోని విశేషాల పట్ల గౌరవభావం వంటివి మాకు కనిపించాయి’’ అని విరయన్ వెల్లడించారు.
పిల్లల్ని, వారి పెద్దల్ని ఇంటర్వ్యూ చేయడం, పిల్లలు గీసిన బొమ్మల్ని శ్రద్ధగా పరిశీలించడం, వారి డైరీలను విశ్లేషించడం వంటి పద్ధతులను వియరన్ బృందం తమ అధ్యయనానికి అవలంభించింది. వీరి అధ్యయన ఫలితాలను బట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి. భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రార్థనా స్థలాలు ఎలాగో, ప్రకృతి కూడా అలాగేనని! కనుక పిల్లల్ని వీలైనప్పుడల్లా రమణీయమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం పెద్దల బాధ్యత.