మా మమ్మీ బండి మమ్మీ | Running Womens Driving School | Sakshi
Sakshi News home page

మా మమ్మీ బండి మమ్మీ

Published Fri, Mar 9 2018 12:39 AM | Last Updated on Fri, Mar 9 2018 12:39 AM

Running Womens Driving School - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని ‘బండిబాట’ పట్టించడానికి ‘ఆత్మనిర్భర్‌’ అనే డ్రైవింగ్‌ స్కూల్‌ను నడిపిస్తోంది పావని. ‘సాధికారత’కు  ఆమె చెబుతున్న అర్థం..  ‘బండి నడపడం’. ఆమె చొరవతో  మథురై, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో   ఇప్పుడు ప్రతి అమ్మా సాధికారతను ‘డ్రైవ్‌’ చేస్తోంది

మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి  సెల్వార్‌కమీజ్‌కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం పావనికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ ఇచ్చింది.

‘‘ఫేస్‌బుక్‌లో బాగానే రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మాత్రం స్పందన చాలు  ఇప్పటికిప్పుడు మొదలుపెట్టడానికి’’.. ఫేస్‌బుక్‌లోంచి లాగవుట్‌ అవుతూ అనుకుంది పావని ఖండేల్‌వాల్‌. ఆ తర్వాత ఎవరికో ఫోన్‌ చేసింది. కావల్సిన సమాధానమే వచ్చినట్టుంది. ఊరు వెళ్లడానికి టికెట్‌ బుక్‌ చేసుకుంది. పుణె నుంచి ఆమె తన సొంతూరు మథుర (యుపి) వెళ్తోంది. పుణెలోని సింబయోసిస్‌ యూనివర్సిటీలో బీబీఎమ్‌ చదివింది పావని. అక్కడే ఉద్యోగం కూడా చేస్తోంది. ఆంట్రప్రెన్యూర్‌ అవ్వాలనే ఆశయం. అయితే పావని అమ్మగారు ఆమె ఆలోచనకు వేరే రూపునిచ్చారు!  

అమ్మ నసే.. ఐడియా!
‘‘పావనీ.. నన్ను బజార్‌కు తీసుకెళ్లు, పావనీ.. అత్తవాళ్లింటి దగ్గర వదిలిపెట్టు.. పావనీ.. కాస్త కూరలు తెచ్చిపెట్టవా? పావనీ.. నన్ను అక్కడ డ్రాప్‌ చేయవా? పావనీ.. ఇక్కడున్నాను.. వచ్చి తీసుకెళ్లవా?’’ అంటూ అమ్మ రేఖ.. సెలవులకు వెళ్లినప్పుడల్లా తనకు పనులు పురమాయించేది. తను ఉన్న వారం రోజుల్లో పనులన్నీ చేసేసుకోవాలని అమ్మ ఆరాటం. అలా  మూడు నెలల కిందట మ«థుర వెళ్లినప్పుడు అమ్మ తనను చాలానే విసిగించింది. ‘‘నువ్వు నేర్చుకోవచ్చు కదా బండి నడపడం? ఇలా నా మీదో.. నాన్న మీదో ఆధారపడేకంటే?’’ అంది అదే విసుగుతో పావని. ఆ మాటను మనసుకు తీసుకుంది పావని తల్లి. లేడీ ట్రైనర్‌ కోసం చాలా వెదికింది. ఎవరూ దొరకలేదు. ఆమె పట్టుదల చూసి చివరకు తనే వారం రోజులు సెలవు పొడిగించుకుని, మథురలో ఉండి మరీ అమ్మకు బండి నేర్పించింది. అప్పుడు తట్టింది పావనికి ఐడియా! ఆ ఐడియా ఇప్పుడు ఓ ఆకారం దిద్దుకోబోతోంది. ట్రైన్‌ ఆగింది. స్టేషన్లో దిగింది పావని.

మహిళలా! మథురలోనా?!
అమ్మకు తను డ్రైవింగ్‌ నేర్పడానికి ముందు, స్కూటీ నేర్పే లేడీ ట్రైనర్‌ కోసం వెదకుతుంటే అర్థమైంది పావనికి.. లేడీ ట్రైనర్స్‌ అవసరం ఎంతుందో. అప్పుడే అలాంటి ప్రాజెక్ట్‌కు అంకురం పడింది ఆమె మైండ్‌లో. అమ్మకు డ్రైవింగ్‌ నేర్పించి, మథుర నుంచి పుణె వెళ్లగానే దానికి సంబంధించి ఫేస్‌బుక్‌ పేజ్‌ క్రియేట్‌ చేసింది. చాలా మంది తమకూ డ్రైవింగ్‌ నేర్చుకోవాలని ఉందనీ పుణె నుంచి పోస్టులు పంపారు. మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్‌కమీజ్‌కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. మథుర వచ్చిన వెంటనే ‘ఆత్మనిర్భర్‌’ పేరుతో తను మొదలుపెట్టబోయే ‘ఆల్‌ విమెన్‌ టూ వీలర్‌ డ్రైవింగ్‌ స్కూల్‌’ను రిజిస్టర్‌ చేయించింది. వెంటనే పనిలోకి దిగింది.

డ్రైవ్‌ చెయ్యాలా.. వద్దా?!
వారం గడిచేసరికి డ్రైవింగ్‌ నేర్చుకోడానికి ముందుకు వచ్చిన వాళ్లలో సగం మంది ‘ఎందుకులేబ్బా’ అని వెనక్కి తగ్గారు. పావని వాళ్ల అమ్మ నిరుత్సాహపడింది. అప్పటికే ఆమె స్కూటీ నడపడంలో పర్‌ఫెక్ట్‌ అయిపోయింది. డ్రైవింగ్‌ని ఆస్వాదిస్తోంది. ‘‘రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది’’ అంటుంది ఆమె. ఇంకొకరి మీద ఆధారపడకుండా బయట పనులన్నీ స్వయంగా చేసుకుంటే ఉండే సౌకర్యాన్ని, సాధికారతను, దర్పాన్నీ ఆమె అనుభవిస్తోంది. అదే మాట చెప్పింది.. తన కూతురు పెట్టిన డ్రైవింగ్‌ స్కూల్‌కి వచ్చిన మహిళలకు. కొంతమందికి ఆ మాటలు స్ఫూర్తినిచ్చాయి. డ్రైవింగ్‌ నేర్చుకోడానికి చేరారు. వాళ్ల సంఖ్య పెరిగేసరికి, నేర్పుతామని బయటి ఊళ్ల నుంచి వచ్చే మహిళా ట్రైనర్‌లూ పెరిగారు. ఇలా పద్దెనిమిది మందితో మొదలైన ఆ స్కూల్‌ నెల గడిచే సరికి 25 మందికి పెరిగింది. 

ఒకర్ని చూసి ఒకరికి ధైర్యం
నలభై ఐదేళ్ల  పావని వాళ్ల అమ్మ తన స్కూటీపై మథుర అంతా తిరుగుతుంటే ఆ వయసు వాళ్లకు కూడా డ్రైవింగ్‌ నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. డ్రైవింగ్‌ స్కూల్లో ట్రైనర్స్‌ అంతా ఆడవాళ్లే అయ్యేసరికి ధైర్యమొచ్చింది. క్యూ కట్టారు స్కూల్‌కి. ఇప్పుడు దాదాపు యాభై మంది అయ్యారు నేర్చుకునేవారు. అంతా పదహారు నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లే. చుట్టుపక్కల ఊళ్ల నుంచీ అప్లికేషన్లు పెరుగుతుండటంతో పక్కనే ఉన్న భరత్‌పూర్, జైపూర్లో కూడా బ్రాంచ్‌లను తెరిచింది పావని. ఆత్మనిర్భర్‌లోనే డ్రైవింగ్‌ నేర్చుకున్న కొంతమంది అల్పదాయ  మహిళలకు అందులోనే ట్రైనర్స్‌గా అవకాశం ఇస్తోంది పావని. అలా వాళ్లు తమ కుటుంబానికి చేదోడువాదోడు అవుతున్నారు.  ఆత్మనిర్భర్‌ ఆలోచన రావడానికి, అది కార్యాచరణ దాల్చడానికి వాళ్లమ్మే కారణం కాబట్టి దానికి వాళ్లమ్మనే సీఈఓగా నియమించింది పావని. 

సింపుల్‌ అండ్‌ స్పీడ్‌ కోర్స్‌
పావని డ్రైవింగ్‌ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్‌ రెండూ ఉంటాయి. కోర్సు వ్యవధి పది రోజులు. కోర్సు అయ్యాక బండి మెయిన్‌టెనెన్స్‌ గురించీ వివరిస్తారు.  అంతేకాదు, లైసెన్స్‌ను ఇప్పించే బాధ్యతనూ ఆత్మనిర్భరే తీసుకుంటోంది.  ఇలా.. పాతికవేల రూపాయల పెట్టుబడితో, రెండు స్కూటీలతో మొదలైన ఈ స్కూల్‌ యేడాది గడవకముందే ఏడాదికి ఆరు లక్షల ఆదాయానికి చేరుకుంది. ఇలా.. ఆంట్రప్రెన్యూర్‌ అవ్వాలన్న పావని కల కూడా నెరవేరింది. బ్రేక్స్‌ లేకుండా డ్రైవింగ్‌ స్కూల్‌ను ముందుకు పరిగెత్తించడమే నా ధ్యేయం అంటోంది పావని.

మహిళా (డ్రైవింగ్‌) దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆత్మనిర్భర్‌లో విమెన్‌ ఆంట్రప్రెన్యూర్స్‌ కోసం ఓ వర్క్‌షాప్‌నూ నిర్వహించింది పావని. దీనికి మథుర చుట్టుపక్కల పట్టణాల నుంచే కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ నుంచీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇదికాకుండా ఏప్రిల్‌ నెలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్న చిన్న పట్టణాల్లోని మహిళల కోసం డ్రైవింగ్‌ క్యాంప్స్‌ను నిర్వహించనున్నట్లు చెప్పింది పావని ఖండేల్‌వాల్‌. అన్నట్టు పావని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘బైకర్ని’ కూడా! బైకర్ని అంటే  ఫిమేల్‌ బైకర్‌ అని.
– శరాది
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement