స్టవ్ మీదున్న సూప్ గిన్నెను రెండు చేతులతో పట్టుకుని ఎడమ కాలి బొటన వేలి మీద నిలబడి దేహాన్ని బాలెన్స్ చేస్తోందో అమ్మాయి. ఆమె బాలెన్స్‌కు సహకరిస్తున్నాడో అబ్బాయి. ఇది ఒక ఇంటి చిత్రం. ఒక అమ్మాయి మాప్‌తో ఇల్లు తుడుస్తూ తుడుస్తూ మాప్ పక్కన పెట్టి చేతులను గాల్లోకి లేపి ఒంటి పాదం మీద నిలబడి దేహాన్ని గిర్రున తిప్పింది. ఇది మరో ఇంటి విచిత్రం.
ఈ స్టెప్పులు వేస్తున్న వాళ్లంతా రష్యన్ బాలే బృంద కళాకారులు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో కూర్చోవడాన్ని బోర్‌గా ఫీలయ్యే వాళ్లను ఎంటర్‌టైన్ చేయడానికి ఈ ప్రయోగం చేశారు. వంట చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, పిల్లలను అలంకరిస్తూ మధ్యలో స్టెప్పులు వేస్తున్నారు. వీటన్నింటినీ ఎడిట్ చేసి వీడియోను రూపొందించింది సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మిఖాయిలోవ్‌స్కీ నాటకరంగ కంపెనీ. ‘ఈ లాక్‌డౌన్ సమయంలో మా అభిమానులను మిస్సవుతున్నాం. అందుకే ఇలా దగ్గరయే ప్రయత్నం చేస్తున్నాం’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో రష్యా వాసుల మనసులను కొల్లగొట్టేసింది. ఇంటి పనులు చేసేటప్పుడు విసుగ్గా ముఖం పెట్టుకోకుండా, ఈ డాన్స్ బాలేలో చూసిన స్టెప్పులను ప్రాక్టీస్ చేస్తూ రోజును ఆనందంగా గడుపుతున్నారు. ‘ఈ లాక్‌డౌన్‌ను ఇలాగే ఆడుతూ పాడుతూ గడిపేస్తాం. లాక్‌డౌన్ పూర్తవగానే స్టేజ్ మీద మీరు చేసే డాన్స్ బాలేను నేరుగా వీక్షించడానికి వస్తాం’ అని చాలామంది నెటిజన్లు కళాకారులను ఉత్సాహపరుస్తున్నారు కూడా. దేనినైనా సరే అధిగమించగలమనే ధైర్యమే మనిషిని గెలిపిస్తుంది. రష్యావాసుల్లో కనిపిస్తున్నది అదే.
ప్రపంచాన్ని పీడిస్తున్న నావల్ కరోనా వైరస్ ఎవరినీ గడపదాటనివ్వడం లేదు. రష్యాలో పదివేల మంది మీద దాడి చేసిన కరోనా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. దాదాపుగా ఏడు వందల మంది విజయవంతంగా వ్యాధిని జయించారు. రష్యాలో లాక్‌డౌన్ జూన్ 1 వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment