
♦ సాహిత్య మరమరాలు
ఇది 1939 నాటి సంగతి. ఆంధ్రవిశ్వవిద్యాలయం తరఫున తిరుమల రామచంద్ర, కొమ్మనమంచి జోగయ్య శర్మ ‘ద్విపద భారతం’ ముద్రణప్రతిని సిద్ధపరచడానికి తంజావూరు వెళ్లారు. కాఫీ తాగాలని స్టేషను దగ్గరి హోటల్‌కు వెళ్లారు. అప్పటికి కాఫీ గానీ, మంచినీళ్లుగానీ ఎంగిలి చేసి తాగరాదనే నియమం హోటళ్ల నుంచి పోలేదు. గాజు గ్లాసును మాత్రం ఎంగిలి చేయవచ్చు. అందుకే జోగయ్య శర్మ సర్వరును కాఫీని గాజుగ్లాసులో తెమ్మన్నారు. అతడు ఏ లోకంలో ఉన్నాడో ఇత్తడి గ్లాసులో పట్టుకొచ్చాడు. ఎటూ తెచ్చాడు కదా అని జోగయ్య ఎంగిలి చేసి తాగేశారు. తాగేవరకు ఆగి, దగ్గరికి వచ్చి, ప్రొప్రయిటర్ ‘‘అయ్యా! కప్పు వెల కూడా కడుతున్నాను– కప్పు వాంగిడు పోరగసి– కప్పు వెల కూడా ఇచ్చి కప్పు తీసుకుపొండి’’ అన్నాడు.
గోడ మీద నోటీసు చూపించాడు. నాకు తమిళం రాదు, నేను గాజుగ్లాసులోనే తెమ్మన్నాను, అంటారు జోగయ్య. ‘ఇదంతా ముడియాదు, డబ్బు చెల్లించాల్సిందే’ అంటాడు ప్రొప్రయిటర్. ‘హోరాహోరీ పోట్లా’ట తర్వాత, తిరుమల రామచంద్రకు తెలిసిన రాజగోపాలయ్యర్ అనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వారిని శాంతపరిచాడు. గాజుగ్లాసులోనే తెమ్మన్నా ఇత్తడి గ్లాసులోనే తెచ్చిన మతిమరుపు సర్వరుది తప్పుగా తేల్చారు. సర్వరు నష్టపోవడం ఇష్టంలేక జోగయ్య శర్మ గ్లాసు నష్టం చెల్లించడానికి సిద్ధపడ్డారు. ఈలోపు ప్రొప్రయిటరే ‘ఠండా అయి సర్వరును చీవాట్లు పెట్టి’ ఆ గ్లాసును వాళ్ల ఎదుటే గాడిపొయ్యిలో వేసి కాల్చి తోమించారు.
(‘పలుకులమ్మ తోటమాలి’లోని తిరుమల రామచంద్ర ‘నా తీరని కోరిక’ వ్యాసం ఆధారంగా)