గూఢనారి నెం.1 | sakshi family a true story | Sakshi
Sakshi News home page

గూఢనారి నెం.1

Published Sun, Nov 6 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

గూఢనారి 	 నెం.1

గూఢనారి నెం.1

 రజని డిటెక్టివ్ సర్వీసెస్‌ను ఆరంభించినప్పుడు, మిగతా ఏజెన్సీల వాళ్లు నవ్వారు. కొన్ని పేపర్లయితే పరువు తక్కువనిచెప్పి యాడ్ వేసుకోడానికి కూడా వెనకాడాయి. కొన్ని పోటీ సంస్థలు.. దుకాణం సర్దేసుకొమ్మని ఆమెను బెదిరించాయి. ‘‘ఇది కూడా ఒక నేర సామ్రాజ్యం లాంటిదే, శాల్తీ ఎప్పుడు గల్లంతవుతుందో చెప్పలేం’’ అని కొందరు శ్రేయోభిలాషులు చెప్పి చూశారు. రజని భయపడలేదు. వెనక్కి తగ్గలేదు. దేశంలోనే నెం.1 గూఢనారిగా నిలబడ్డారు.
 

వంచిన తల ఎత్తకుండా అమ్మాయిలు కాలేజీకి వెళ్లి వచ్చే ఒకానొక కాలంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడూ అలాగే వెళ్లి వస్తున్నారు కదా అమ్మాయిలు! ఇక ఆ కాలంలోకి పనిగట్టుకుని మరీ వెళ్లడం ఎందుకు? వెళ్లాలి. రజనీ పండిత్‌ను చూడాలంటే వెళ్లాలి. ఇప్పుడు ఆమె వయసు 50. ఆమెను పద్దెనిమిదీ పందొమ్మిదేళ్ల వయసులో చూడాలంటే దాదాపు ముప్పై ఏళ్ల వెనక్కు వెళ్లాలి. ముంబైలోని రూపారెల్ కాలేజీకి వెళ్లి వస్తున్నప్పుడు కాలేజ్ గేటు దగ్గర నిలబడి ఆమె లోపలికి వెళుతున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు చూడాలి. డిటెక్టివ్‌లా ఆమె వెంట వెళ్లగలిగితే కనుక దారి పొడవునా రజనీని చూడొచ్చు.
 
ఏముంటుంది రజనిలో అంత స్పెషాలిటీ? ఏంటా? మిగతా అమ్మాయిల్లా ఆమె తల వంచుకుని నడవదు! దిక్కులు చూస్తూ నడుస్తుంది. చుట్టు పక్కలు చూస్తూ నడుస్తుంది. మనుషుల కళ్లల్లోకి చూస్తూ, మనుషుల మాటలు వింటూ, మనుషుల కదలికలు గమనిస్తూ, మరీ ముఖ్యంగా మనుషుల ఫీలింగ్స్ పట్టేస్తూ నడుస్తుంది! అలా ఓ రోజు తన క్లాస్‌మేట్ ఫీలింగ్స్ పట్టేసింది రజని.
 
డిగ్రీ ఫైనలియర్
‘‘ఏం జరిగింది?’’.. క్లాస్‌మేట్‌ని అడిగింది రజని ఓ రోజు. ‘‘ఏం లేదే’’ అంది ఆ క్లాస్‌మేట్. ‘‘పోనీ ఏం జరుగుతోంది?’’ అంది రజని. క్లాస్‌మేట్ కంగారుగా చూసింది. ‘‘నీ కోసం కాలేజీకి ఎవరెవరో వస్తున్నారు! వాళ్లంతా ఎవరు?’’ అని అడిగింది. క్లాస్‌మేట్ భయంగా చూసింది. రజని ఆమె కళ్లను చూసింది. తెగబోతున్న చెరువు కట్టల్లా ఉన్నాయవి. రజని ఆమె పెదవుల్ని చూసింది. నిజాన్ని చెప్పలేక వణుకుతున్నట్లుగా ఉన్నాయవి. రజని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.  ‘‘నీకేం భయం లేదు’’ అని భరోసా ఇచ్చింది. విషయం రాబట్టింది. తనొక అనైతిక వలయంలోకి వెళ్లినట్టు ఆ క్లాస్‌మేట్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ కుటుంబాన్ని గట్టెక్కించింది. ‘‘థ్యాంక్స్ అమ్మా’’ అన్నారు క్లాస్‌మేట్ తండ్రి. ఆయనే ఇంకొక మాట కూడా అన్నారు.. నీలో ఒక స్పైకి ఉండాల్సిన చురుకుదనం ఉంది’’ అన్నారు. స్పై! గూఢచారి. ఆ మాట కిక్ ఇచ్చింది రజనికి. తననొక లేడీ గూఢచారిగా ఊహించుకోవడం ఆమెకు బాగుంది.
 
ఆడపిల్లవి.. ఆ దరిద్రం నీకెందుకు?

డిగ్రీ పూర్తయింది. ఏవేవో ఉద్యోగాలు చేస్తోంది రజని. ఏదీ సంతృప్తిని ఇవ్వడం లేదు. డిటెక్టివ్ ఏజెన్సీలలో ‘స్పై’గా చేస్తానని కరికులం వీటాయ్ (సీవీ) పట్టుకెళ్లింది. ‘‘మరాఠీ లిటరేచర్ మాకేం పనికొస్తుంది’’ అన్నారు. ‘ఆడపిల్ల డిటెక్టివ్‌గా ఏం పనికొస్తుంది’ అనే మాటనే వాళ్లిలా సున్నితంగా అన్నారు. వాస్తవానిక్కూడా వాళ్లకు అమ్మాయిలు అక్కర్లేదు. బయట పడని నేరాలను, ఘోరాలను, అక్రమ సంబంధాలను, అనుమానాలను, అరాచకాలను ఛేదించాలి. ఈమెకెంత మరాఠీ వచ్చినా, ఎంత ఇంగ్లిష్ వచ్చినా, ఎంత చలాకీగా ఉన్నా, బుర్ర ఎంత షార్ప్‌గా ఉన్నా... స్త్రీ సహజసిద్ధమైన ‘అబలత్వం’ కారణంగా చిన్న పొరపాటు జరిగినా ఏజెన్సీ పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. అందుకే రజనీని ఎవరూ తీసుకోలేదు. చివరికి రజని తండ్రి కూడా.. ‘‘ఆడపిల్లవి.. ఆ దరిద్రం నీకెందుకు?’’ అని విసుక్కున్నాడు.
 
డాన్‌ల ముంబైలో లేడీ డిటెక్టివ్!

రజని తండ్రి శాంతారామ్ పండిత్. ముంబై పోలీస్ శాఖలో క్రిమినల్ ఇన్వెస్టిగేటర్. అందుకే ఆ తలనొప్పి తన కూతురికి వద్దనుకున్నారు. వీళ్ల కుటుంబం థానేలో ఉంటుంది. అక్కడికి 27 కి.మీ. దూరంలోని కాలేజీలో రజనిని ‘డే స్కాలర్’గా చదివించడానికే ఆయన సంశయించారు. ఇక డాన్‌ల ముంబైలో డిటెక్టివ్‌గా చేస్తానంటే ఒప్పుకుంటారా? పైగా ఆమె సొంతంగా ఒక ఏజె న్సీని పెడతానంటోంది. ‘వొద్దొద్దు’ అనేశారాయన. ‘‘ప్లీజ్ నాన్నా’’ అంది రజని. తల్లి  ఆమెకు సపోర్ట్‌గా వచ్చింది. ‘‘ఇష్టపడి చేస్తానంటోంది కదా... ఆ కష్టమేదో తనే పడుతుంది. కాదనడం ఎందుకు?’’ అంది. అయిష్టంగా ఒప్పుకున్నారు శాంతారామ్ పండిత్.
    
మళ్లీ ఈ కాలంలోకి వచ్చేద్దాం. అమ్మాయిలు ఎప్పటిలా వంచిన తల ఎత్తకుండానే కాలేజీలకు వెళ్లివస్తున్నారు. ఒక్కటే మార్పు. రజని కాలంలో అమ్మాయిల చేతుల్లో సెల్‌ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు లేవు. ఇప్పటి అమ్మాయిల చేతులు స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా లేవు. అయినప్పటికీ లేడీ డిటెక్టివ్‌ల సంఖ్య తక్కువగానే ఉంది. స్మార్ట్‌ఫోన్ ఉంటే స్పయింగ్ తేలిక అవుతుందని కాదు. రహస్యాలను ఛేదించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, అమ్మాయిల్ని ఈ ఫీల్టులోకి పంపే ధైర్యాన్ని తల్లిదండ్రులు చేయలేకపోతున్నారు. రజని సొంతంగా స్థాపించిన ఏజెన్సీనే తీసుకోండి. 1991లో ఆమె ‘రజనీ పండిత్ డిటెక్టివ్ సర్వీసెస్’ను ప్రారంభించారు. 2010లో ముంబైలోని మాహిం ప్రాంతంలో ఆఫీసు తీసుకున్నారు.  ప్రస్తుతం ఆమెకు నెలకు 20 కేసుల వరకు వస్తున్నాయి. ఆమె దగ్గర 30 మంది వరకు డిటెక్టివ్‌లు పనిచేస్తున్నారు. వారిలో మహిళా డిటెక్టివ్‌లు సగంలో సగానికన్నా తక్కువే! వాళ్లు కూడా రజని దగ్గర శిక్షణ పొందినవాళ్లు.
 
కేసును బట్టి వేషం కట్టి...
కేసు అంతు తేల్చడం కోసం రజని రకరకాల వేషాల్లోకి మారిపోయేవారు. అంధురాలిగా, గర్భిణిగా, తోపుడుబండి వ్యాపారిగా.. ఇలా! భార్యాభర్తల అనుమానం కేసులు ఎక్కువగా వచ్చేవి. అలాగే అక్రమ సంబంధాల కేసులు, పెళ్లిసంబంధాల కోసం వధూవరుల వివరాలను ఆరా తీసే కేసులు. కొన్ని సందర్భాలలో రజని క్లయింట్‌లకు ధైర్యం చెప్పేవారు. వాళ్లకు అండగా ఉండేవాళ్లు. వాళ్లకు స్ఫూర్తిగా నిలబడేవారు. ప్రేరణ ఇచ్చేవారు. అలా సోషల్ సర్వీసును కూడా తన వృత్తిలో భాగంగా చేసుకున్నారు రజని. అందుకే పేరును సంపాదించుకున్నంతగా, డబ్బును సంపాదించుకోలేకపోయారు ఈ భారతదేశపు తొలి మహిళా డిటెక్టివ్.
 
ప్రతి యువతీ తొలి మహిళే!

పేరు కోసం రజని ఈ ఫీల్డులోకి రాలేదు. అందుకే ‘ఈమె భారతదేశపు తొలి మహిళా డిటెక్టివ్వా? మహారాష్ట్ర తొలి మహిళా డిటెక్టివ్వా’ అన్న చర్చ అవసరం లేదు. తనొక మహిళా డిటెక్టివ్. అంతే. అదే తనకు గుర్తింపు. గౌరవం. నేటికీ అనేక రంగాల్లో ఉన్నట్లే డిటెక్టివ్ సర్వీసుల్లో కూడా పురుషాధిక్యం ఉంది. నిజానికి కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే ఈ ఫీల్డులోకి కొత్తగా వచ్చే ప్రతి యువతినీ మనం తొలి మహిళా డిటెక్టివ్‌గానే గుర్తించాలి.                       
 
హంతకుడు ఎంపీ బంధువు!
 రజని ఈ పాతికేళ్లలో 75 వేలకు పైగా కేసులను ఛేదించారు. హంతకుడెవరో కనిపెట్టి, అతడిని పట్టుకోవడం కోసం ఓ ఇంట్లో ఆరు నెలలపాటు పనిమనిషిగా చేశారు! ఆమె కెరియర్‌లోని అత్యుత్తమమైన కేసులలో అదొకటి. ఒక మహిళ తన అక్రమ సంబంధం బయటపడి, ప్రియుడి చేత తన భర్తని చంపించింది. ఆ ప్రియుడే తర్వాత ఆమె కొడుకును కూడా చంపేశాడు. ఈ కేసులో పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. రజని సహాయం తీసుకున్నారు.

హంతకుడు ఆ ఇంటికి రాత్రి పూట వచ్చి పోతుంటాడన్న క్లూ ఒక్కటే రజనికి తెలుసు. ఆ ఇంట్లోకి ఎలాగో పనిమనిషిగా చే రారు. నమ్మకంగా పని చేశారు. ఒకసారి ఇంటామె కళ్లు తిరిగి పడిపోతే రజని వెంటనే డాక్టర్‌ని పిలిపించి, దగ్గరుండి మరీ ఆమెకు మందులు అవీ మింగించి మనసు దోచుకున్నారు. ఆప్పట్నుంచీ ఆమెకు కేర్ టేకర్ అయ్యారు. ‘‘నువ్వూ ఇక్కడే ఉండిపో’’ అన్నారు. రజనికి అది మంచి అవకాశంగా దొరికింది. ఓ రోజు రాత్రి ఆ ప్రియుడికి, ఇంటావిడకు పెద్ద గొడవ అయింది. ‘‘వెళ్లిపో, నీ ముఖం నాకు చూపించకు’’ అని పెద్దగా అతడిపై అరుస్తోంది ఆమె. అతడు వెళ్లిపోయాడంటే మళ్లీ దొరకడు. ఏం చేయాలి? పోలీసులకు చెప్పాలంటే బయటికి వెళ్లాలి. అప్పటికి మొబైల్స్ లేవు. లాండ్‌లైన్ ఉంది కానీ, వాళ్లిద్దరూ గొడవ పడుతున్న హాల్లోనే ఉంది. రజని ఆలోచనలో పడింది. ఈ గొడవనంతా పట్టించుకోనట్లు వంటగదిలోకి వెళ్లింది. కత్తితో కాలికి గాయం చేసుకుంది. రక్తం కారుతుంటే భయంతో అరుస్తూ హాల్లోకి వచ్చింది. ఇంటావిడ కంగారు పడింది. ‘‘ఏంటా రక్తం రజనీ, కింద డాక్టర్ ఉంటాడు వెళ్లు’’ అని పంపించింది. తర్వాత 20 నిముషాల్లోనే పోలీసులు వచ్చి, ఆ హంతకుడిని అరెస్ట్ చేశారు. అతడో ఎంపీ బంధువు!
 
ఆత్మవిశ్వాసం, ధైర్యం, దృఢచిత్తం ఉంటే అమ్మాయిలు ఎంతటి  పురుషాధిక్య రంగంలోనైనా  రాణిస్తారు. తామేమిటో నిరూపిస్తారు.  నేనెప్పుడూ దేనికీ భయపడ ను. చావే కదా మన అల్టిమేట్ భయం. అది ఏదో ఒక రూపంలో వచ్చి తీసుకెళుతుంది. ఊరికే కూర్చొని ఉన్నా, పైనుంచి సీలింగ్ విరిగిపడి చనిపోవచ్చు. ఇక భయపడడానికేముంది? ‘ఆన్ డ్యూటీ’ చనిపోవడం గౌరవమే కదా. (నవ్వుతూ)
 
రజని తన అనుభవాలతో ‘ఫేసెస్ బిహైండ్ ఫేసెస్’, ‘మాయాజాల్’ అనే  పుస్తకాలు రాశారు. మొదటి పుస్తకానికి రెండు అవార్డులు వచ్చాయి. రెండో పుస్తకానికి ఆరు అవార్డులు వచ్చాయి! ఇవి కాక కెరీర్ మొత్తం మీద ఆమె 54 అవార్డులు సాధించారు. అస్ట్రేలియాకు చెందిన ఓ టీవీ చానల్ ఆమెపై డాక్యుమెంటరీ కూడా తీసింది. ప్రస్తుతం విదేశాలకు సంబంధించిన అపరాధపరిశోధన కూడా చేస్తున్నారు.
 
 
కెరీరే నా బాడీగార్డ్

తొలి మహిళా డిటెక్టివ్ రజనీ పండిత్ మాహిమ్‌లోని తన కార్యాలయంలో ‘సాక్షి’ ముంబై ప్రతినిధి గుండారపు శ్రీనివాస్‌తో సంభాషించారు. దేశంలోనే మీరు తొలి మహిళా డిటెక్టివ్. అయితే మీరు మహారాష్ట్ర తొలి మహిళా డిటెక్టివ్ మాత్రమే అన్న వాదన ఉంది. ఏది కరెక్టు? వేరే డిటెక్టివ్ ఎవరైనా కనిపెట్టి చెప్పాలి (నవ్వుతూ). పోనీ మీరు చెప్తారా ఏది కరెక్టో? మీడియాను మించిన డిటెక్టివ్ ఎవరుంటారు? మీడియా అన్నది పెద్ద వ్యవస్థ. కానీ మీరు వ్యక్తిగా అంతుచిక్కని కేసులెన్నింటినో ఛేదించారు!  వ్యక్తిలోని తపనకు వ్యవస్థకున్నంత బలం ఉంటుంది. రహస్యశోధన నా ప్రాణవాయువు.   స్త్రీలకు ఇది అనువైన రంగం కాదని అంటారు. అనువు కాని చోటే అధికురాలినని నిరూపించదలిచారా? ఎవరికో చాలెంజ్ చేసి నేను ఈ రంగంలోకి రాలేదు. ఇష్టపడి వచ్చాను. నేను ఉన్నంత కాలం నాలో ఈ ఇష్టం ఉంటుంది. అంతేకాదు, పురుషుల కన్నా స్త్రీలకే ఇది ఎక్కువ అనువైన రంగం అని నమ్ముతాను. అపరాధ శోధనలో పురుషులకు కొన్ని పరిమితులు ఉంటాయి. అవి మాకు ఉండవు.
 
వారికుండే సౌలభ్యాలు కూడా మీకు ఉండవేమో కదా!  కావచ్చు. కానీ రహస్యాల పరిశోధనలో మునిగిపోయాక సౌఖ్యాలు, సౌలభ్యాల ఆలోచన రాదు.  ఒక డిటెక్టివ్‌గా మీరెన్నో విజయాలు సాధించారు. కానీ ఒక మహిళగా మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
 అర్థం కాలేదు.   మీరు ఎంచుకున్న కెరీర్ మీకో కుటుంబాన్ని లేకుండా చేసిందన్న ఆలోచన మీకు ఏ సందర్భంలోనైనా కలిగిందా?
 మీరు అడుగుతున్నది నా పెళ్లి విషయమే అయితే... అవివాహితగా మిగిలిపోవడం గురించి నేనెప్పుడూ కలత చెందలేదు. మీరు ఈ రంగంలోకి రావడం మీ నాన్నగారికి ఇష్టం లేదు. మీరు డిటెక్టివ్ అయితే మీ పెళ్లి కావడం కష్టం అని బహుశా ఆయన భావించి ఉంటారా?
 (నవ్వుతూ) నాన్న సంగతి తెలీదు. నేైనె తే అలా అనుకోలేదు. నిజానికి నేను ఈ రంగంలోకి వస్తానని నాకు తెలియకముందే.. పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నాను.
     
అలా ఎందుకు నిర్ణయించుకున్నారు?
చాలా దాంపత్యాలను చూశాను. మా బంధువులవీ, చుట్టుపక్కలవాళ్లవీ. భార్యాభర్తలు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తలలు పగలగొట్టుకుంటూ ఉండటం చూశాక పెళ్లంటే నాకు విముఖత ఏర్పడింది.కానీ ఈ యాభై ఏళ్ల వయసులో... మీరు ఒంటరితనం ఫీల్ కావడం లేదా?(నవ్వుతూ) భర్త ఉండీ ఒంటరిగా ఉన్న ఆడవాళ్లు ఎంతమంది లేరు! నాకు తోడుగా మా అమ్మ ఉంది. అక్క ఉంది. అన్న ఉన్నాడు. తమ్ముడు ఉన్నాడు. అన్న భార్య, తమ్ముడి భార్య, వారి పిల్లలు, అక్క కొడుకు ఉన్నారు. అందరం ఒకే ఇంట్లో ఉంటాం. ఇంక ఒంటరితనం ఎక్కడ? కెరీర్ అయితే బాడీగార్డ్‌లా ఎప్పుడూ నా వెంటే ఉంటుంది.

మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement