
గుండె జబ్బుల నివారణ ఇలా...
ఫ్యామిలీ డాక్టర్
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. ఇటీవల మా బంధువుల్లో ఇద్దరుముగ్గురు గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు గుండె జబ్బుల పట్ల ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. – సంతోష్‌కుమార్, సత్తెనపల్లి
గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి...
⇒మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. ⇒డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి.
⇒గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి.
⇒కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి.
⇒పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. ⇒గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం
⇒డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి
⇒మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి
⇒రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి
⇒మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి n ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి.
⇒ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్.
రక్తప్రసరణ లోపం వల్లనే వేరికోస్ వెయిన్స్!
వాస్క్యులార్ కౌన్సెలింగ్
నా వయసు 43 ఏళ్లు. ఒక కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాను. మద్యం అలవాటు లేదు. కానీ రోజూ ఏడెనిమిది సిగరెట్లు మాత్రం కాలుస్తుంటాను. గడచిన ఏడాది కాలంగా కాళ్లపైన పుండ్లు వస్తున్నాయి. ఎన్ని ఆయింట్‌మెంట్లు వాడినా తగ్గకపోవడంతో డాక్టర్‌ను కలిస్తే వేరికోస్ వెయిన్స్ వ్యాధి ఉందని చెప్పి, చికిత్స అందిస్తున్నారు. సర్జరీ చేయాల్సి రావచ్చునని కూడా చెప్పారు. పరిశుభ్రతకు ప్రాణం ఇచ్చే నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఇది ఒకరి నుంచి మరొకిరికి అంటుకుంటుందా? అసలు వేరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుది? ట్రీట్‌మెంట్ ఇది పూర్తిగా తగ్గిపోతుందా? దయచేసి తెలపండి.
– కె.ఆర్. శ్రీనివాస్, నిజామాబాద్
వేరికోస్ వెయిన్స్ అనేది అంటువ్యాధి ఎంతమాత్రమూ కాదు. ఎంతకీ మానని అల్సర్లు వచ్చే ఈ వ్యాధి... సాధారణంగా నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసేవారు, హమాలీలు, రిక్షా పుల్లర్ల వంటి వారిలో ఎక్కువగా వేరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. ఎక్కువసార్లు గర్భం ధరించినవారు, అదుపులేని షుగర్, అధిక బీపీ వ్యాధిగ్రస్తులతో పాటు అతిగా మద్యం తాగేవారు, పొగతాగేవారూ ఈ వ్యాధికి గురవుతుంటారు. యుక్తవయసు మొదలుకొని, ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసుల వారూ దీని బారిన పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం మనదేశంలో దాదాపు 15 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో సరైన చికిత్స అందక చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
వేరికోస్ వెయిన్స్ సమస్య మొదట కాళ్లు, చేతులపై సాధారణ పుండ్లు ఏర్పడటంతో మొదలవుతుంది. ఒకటి రెండు వారాలు గడిచేసరికి తీవ్రమైన నొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతుంది. పుండ్లు మానడానికి వాడే మందులు వాడినా ప్రయోజనం కనిపించదు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచేసరికి పుండ్లు పెద్దవై... చీము, రక్తం స్రవించడంతో పాటు దుర్వాసన ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి వ్యక్తి శారీరకంగానే కాదు... మానసికంగానూ కుంగదీస్తుంది. హఠాత్తుగా మొదలైన పుండ్లు ఇంతటి దుర్భర స్థితికి ఎందుకు దారితీస్తున్నాయన్న మీ సందేహం సమంజసమే. మీరు అపరిశుభ్రంగా ఉండటం వల్లనో, ఇతరుల నుంచి అంటువ్యాధిగానో ఇవి వచ్చినవి కాదు. ఇవి ప్రధానంగా రక్తప్రసరణలోని లోపాల వల్ల వచ్చిన సమస్య. గుండె పంప్ చేసిన శుద్ధమైన (ఆక్సిజన్ కలిగిన) రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తాయి.
అదేవిధంగా శరీర భాగాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ కలిగిన రక్తాన్ని సిరలు గుండెకు తీసుకెళ్తుంటాయి. కొందరిలో ఈ సిరలు బలహీనపడటం వల్ల లేదా వాటిలో అడ్డంకులు ఏర్పడటం వల్ల వాటి రక్తప్రసరణ సామర్థ్యం తగ్గిపోతుంది. కాళ్లు, చేతులలో సిరలు ఇలా రక్తాన్ని సక్రమంగా ప్రసరించలేనప్పుడు భూమి ఆకర్షణకు వ్యతిరేక దిశలో పైకి వెళ్లాల్సిన రక్తం... అలా వెళ్లేందుకు బదులు వెనకకు వస్తుంటుంది. ఇది వేరికోస్ వెయిన్స్ వ్యాధికి కారణమవుతుంది.
మీరు తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడండి. పరిస్థితి మెరుగుపడి సాధారణ జీవితం గడపగలుగుతారు. వేరికోస్ వెయిన్స్ వ్యాధికి సంబంధించి నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో కాళ్లలో వాపులు వస్తాయి. రెండో దశలో రాత్రిళ్లు కాలి పిక్కలు, కండరాలు పట్టేస్తుంటాయి. మూడో దశలో కాలి చర్మం రంగు మారుతుంది. నాలుగో దశలో కాళ్లలో దురదలు రావడం, పండ్లు ఏర్పడటం, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి దశను బట్టి చికిత్స చేస్తారు. నాలుగో దశ అత్యంత ప్రమాదకరమైనది. సమస్య తీవ్రం కావడంతో పుండ్ల నుంచి చీము కారడం మొదలువుతంది. ఈ వ్యాధికి సంబంధించిన అత్యాధునిక చికిత్స ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
వేరికోస్ వెయిన్స్ వ్యాధి మొదటి, రెండో దశల్లో చికిత్స ప్రారంభిస్తే, మందులు, జీవనశైలిలోమార్పులతోనే వ్యాధిని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక వ్యాధి మూడు, నాలుగు దశల్లో వాçస్క్యులార్ సర్జరీ అవసరమవుతుంది. దాదాపు 30 శాతం వ్యాధిగ్రస్తులకు సర్జరీతోనే పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఏ దశలో అయినా డాక్టర్ సూచనలను యథాతథంగా పాటిస్తూ జీవనశైలిని మార్చుకోవడం అన్న అంశానికి ఏ దశలో చికిత్స సమయంలోనైనా అధిక ప్రాధాన్యం ఉంటుంది. చాలా సందర్భాల్లో కొంత ఉపశమనం కనిపించగానే మందులు మానేయడం, కోర్సు పూర్తయిన తర్వాత ఇక మళ్లీ డాక్టరు దగ్గరికి వెళ్లకుండా ఉండటం వల్ల వ్యాధి ముదిరిపోయిన కేసులు ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా చేయడం ప్రమాదకరమైనందు వల్ల ఈ వ్యాధి వచ్చిన వారు తప్పనిసరిగా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు డాక్టర్‌ను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ, వారి సూచించిన చికిత్స ప్రక్రియలను, జాగ్రత్తలను తప్పక పాటించాలి.
డా‘‘దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులార్ అండ్ ఎండో వాస్క్యులార్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్