క్రేజీ..వా! | sakshi food special | Sakshi
Sakshi News home page

క్రేజీ..వా!

Published Fri, Nov 18 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

క్రేజీ..వా!

క్రేజీ..వా!

కినోవా..? ఇదేంటబ్బా? ధాన్యమా? బంగారమా?
కిలో ఖరీదు... వేలల్లోనా?
ఆగండాగండి... అక్కడే ఉంది తిరకాసు అంతా.
ప్రొటీన్లు, ఖనిజాలు- ఓయబ్బో బోలెడున్నాయ్ దీన్లో.
అందుకే... గ్లామర్ తారలకిప్పుడిది ఫేవరెట్ ఫుడ్.
రైతుకు రొక్కం... మనకు చేవ... కినోవా!

కినోవా చికెన్ సలాడ్
కావలసినవి:  కినోవా- ఒక కప్పు టొమాటో ముక్కలు- రెండు కప్పులు  పాలకూర తరుగు- ఒక కప్పు  చికెన్ - రెండు కప్పులు మీగడ- అర కప్పు వెల్లుల్లి రేకలు- మూడు (సన్నగా తరగాలి) నిమ్మకాయ- ఒకటి (పలుచగా తరగాలి)  నిమ్మరసం- పావు కప్పు ఉప్పు- తగినంత  మిరియాల పొడి- పావు టీ స్పూన్ ఆలివ్ ఆయిల్- రెండు టేబుల్ స్పూన్లు వేరుసెనగపప్పు- పావు కప్పు

తయారీ:  చికెన్ ముక్కలను ఉడికించాలి. రుచి పెరగడం కోసం కొద్దిగా అల్లం - వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించుకోవచ్చు. లేదా ముక్కలను అలాగే ఉడికించవచ్చు. వేరుసెనగపప్పు, కినోవాను విడిగా మందపాటి పెనంలో సన్నమంట మీద దోరగా వేయించాలి.  చల్లారిన తర్వాత ఒక పాత్రలో కినోవా, టొమాటో, పాలకూర, చికెన్, మీగడ, వెల్లుల్లి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. చివరగా వేరుసెనగపప్పు, నిమ్మకాయ చెక్కలను అలంకరించి సర్వ్ చేయాలి.

గమనిక: పిల్లల కోసం చేసేటప్పుడు కినోవాను వేయించి చేస్తే ఇష్టపడతారు. పెద్దవాళ్లకు ఉడికించిన కినోవాతో చేస్తే మంచిది.

కినోవా చిక్ పీ  స్టిర్ ఫ్రై
కావలసినవి: కినోవా ధాన్యం - ఒక కప్పు, పచ్చి సెనగలు - ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, మిరప్పొడి- రెండు టీ స్పూన్లు, ఉప్పు- తగినంత, పాలకూర తరుగు - నాలుగు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (తరగాలి), వెల్లుల్లి రేకలు - నాలుగు (తరగాలి), అల్లం తరుగు - ఒక టీ స్పూన్, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూన్

పోపు దినుసులు: ఆలివ్ ఆయిల్- మూడు టేబుల్ స్పూన్లు

జీలకర్ర- రెండు టీ స్పూన్లు, గరం మసాలా పొడి- రెండు టీ స్పూన్లు, కూర పొడి- రెండు టీ స్పూన్, మిరియాల పొడి- చిటికెడు, ఎండు మిర్చి- రెండు (నిలువుగా చీరాలి)

తయారీ:  పచ్చి సెనగల్ని కడిగి ఆరుగంటల సేపు నానబెట్టి ఉడికించాలి. కినోవాను ఉడికించి పక్కన పెట్టాలి.మందపాటి వెడల్పు బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేయాలి. సన్నమంట మీద రెండు నిమిషాలపాటు వేగనివ్వాలి.  ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. గ్యాస్ స్టౌ మంటను మీడియంలో పెట్టి కలియబెడుతూ వేయించాలి.  తర్వాత అల్లం వెల్లుల్లి వేసి, వేగిన తర్వాత కినోవా వేసి బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.  ఇప్పుడు ఉడికించిన పచ్చి సెనగలు వేసి, కలిపి రెండు నిమిషాల పాటు ఉంచాలి. టొమాటోలు, మిరప్పొడి, పాలకూర వేసి కలిపి మూతపెట్టాలి. అవి మగ్గిన తర్వాత ఉప్పు కలిపి మరో నిమిషం ఉడికించి, దించేయాలి.

కినోవా ఉప్మా
కావలసినవి: కినోవా - అర కప్పు, నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్,  ఉల్లిపాయ ముక్కలు- ముప్పావు కప్పు, అల్లం తరుగు- అర టీ స్పూన్, పచ్చి మిర్చి తరుగు- ఒక టీ స్పూన్, ఎండు మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- ఒక రెమ్మ, ఆవాలు- అర టీ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, మినప్పప్పు- అర టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- అర టీ స్పూన్, క్యారట్ ముక్కలు- ముప్పావు కప్పు, మొక్కజొన్న గింజలు- పావు కప్పు (పచ్చివి),  పచ్చి బఠాణీలు- అర కప్పు, నీరు - రెండు కప్పులు, కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్‌లు, ఉప్పు- తగినంత

తయారీ:  కినోవాను కడిగి పక్కన పెట్టాలి.  బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి  దోరగా వేయించాలి.  ఇప్పుడు అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, ఇంగువ వేసి అర నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి.  ఒక నిమిషం వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, బఠాణీలు వేసి బాగా కలిపి మూతపెట్టి, సన్నమంట మీద రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.  ఇప్పుడు కినోవా, ఉప్పు వేసి కలిపి ఒక నిమిషం తర్వాత నీరు పోసి కలిపి మూత పెట్టి, సన్న మంట మీద ఉడికించాలి. నీరు పోసిన తర్వాత ఐదు నిమిషాల్లోనే కినోవా ఉడికి, ఉప్మా రెడీ అవుతుంది.

గమనిక:  కినోవా వంటకం పొడి పొడిగా ఉండాలంటే ఒక కప్పు కినోవాకు రెండు కప్పుల నీరు పోయాలి. మృదువుగా ఉండాలంటే రెండున్నర కప్పుల నీటిని పోయాలి. కూరగాయల మోతాదును బట్టి అంచనాతో నీటి మోతాదు పెంచుకోవాలి.  కినోవా ధాన్యం సన్నగా ఉంటుంది. మామూలుగా పాత్రలో నీరు పోసి కడిగితే, నీటితోపాటు జారిపోతుంది. కాబట్టి పాత్రలో వేసి కడిగి, నీరు కారిపోవడానికి రవ్వను జల్లించే జల్లెడలో వేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement