ఛెయిర్ హుషార్
యోగా
వయసు మళ్లినవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే యోగా సాధనలో కుర్చీని ఉపయోగిస్తారని అనుకోవడం కరెక్ట్ కాదు. యోగాసన సమయంలో కుర్చీని ఉపయోగించడం వల్ల శరీరంలో జాయింట్స్ ఓపెన్ అయి మజిల్స్ ఫ్రీ అవుతాయి. కఠినమైన ఆసనాలు చేయడానికి ముందు 2 లేక 3 వారాల పాటు కుర్చీ ఆసరాతో సాధన చే సినట్టయితే ఫ్లెక్సిబులిటీ, భంగిమలో ఖచ్చితత్వం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆసనంలో మరింత ఎక్కువ సమయం ఉండేందుకు కూడా వీలవుతుంది. సాధనలో సపోర్ట్‌గా వినియోగించే కుర్చీని రిఫరెన్స్ ఛెయిర్ అని పిలుస్తాం.
1. తాడాసన
కాళ్లు రెండూ సమంగా సౌకర్యవంతమైన స్థితిలో ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పక్క నుంచి పైకి తీసుకెళ్లి మునివేళ్ల మీద నుంచుని మడమలను వీలైనంత పైకి తీసుకెళ్లాలి. ఎడమచేత్తో కుర్చీని పట్టుకుని కుడిచేతిని పక్క నుంచి పైకి స్ట్రెచ్ చేయాలి. కాలి మడమలు పైకి లేపి ముని వేళ్ల మీద నిలబడాలి. కుర్చీ సపోర్ట్ వల్ల బ్యాలెన్స్ తప్పడం, తూలడం ఉండదు. తిరిగి ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. అంటే కుర్చీని కుడివైపునకు తిప్పుకుని కుడి చేత్తో పట్టుకుని ఎడమచేతిని పైకి స్ట్రెచ్ చేయాలి. కాలి మడమలను పైకి లేపాలి. మూడు లేక నాలుగు శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ సమస్థితికి రావాలి.
ఉపయోగాలు: వెన్నెముక అలైన్ మెంట్‌కి, వెన్నుపూసల మధ్యలో ఖాళీ పెరగడానికి డిస్క్‌ల ఎలాస్టిసిటీ పెరగడానికి ఉపయుక్తం. కంప్రెషర్ సమస్య తగ్గిస్తుంది.
1/ఎ ఈ సీక్వెన్స్‌లో భాగంగా వెన్నెముకని పక్కలకి స్ట్రెచ్ చేయడం కోసం పైకి తీసుకెళ్లిన చేతిని చెవికి ఆనించి నడుం నుంచి పై భాగాన్ని వ్యతిరేక దిశలో పక్కకు వంచే ప్రయత్నం చేయాలి.
2. వృక్షాసన
ఆసనంలో నిలబడి...ఎడమ కాలిని కుర్చీలో ఉంచి తొడ కీలు నుంచి మోకాలి వరకూ ఓకే లైన్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. పాదాన్ని కుర్చీలో పక్కకి స్ట్రెయిట్‌గా ఉంచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకెళ్లి, 3 లేదా 4 శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ పక్క నుంచి చేతులు కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండో వైపునకు కూడా చేయాలి. పొడవుగా ఉన్నవారు కుర్చీ బ్యాక్‌పై నుంచి కాలు తీసుకెళ్లి కుర్చీ సీట్‌లో పాదం పెట్టవచ్చు. తక్కువ హైట్ ఉన్నవారైతే కుర్చీని పక్కకు తిప్పి కుర్చీ చేతి మీదుగా కాలు తీసుకెళ్లి కుర్చీ సీట్‌లో పాదం పెట్టవచ్చు.
ఉపయోగాలు: వెన్నెముకను స్ట్రెచ్ చేయడం వల్ల లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్‌ను నివారించవచ్చు. ఈ భంగిమను పదే పదే సాధన చేయడం, ఆసనంలో క్రమబద్ధంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఎక్కువ సేపు ఉండడం వల్ల మెదుడుకు ఆక్సిజన్ సరఫరా బాగా మెరుగవుతుంది. క్రానియల్ నెర్వస్ సిస్టమ్‌కి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుదలకీ మంచిది. కైఫోసిస్ (స్పైన్ పైభాగం ఓ పక్కకి వంగడం, లోడోసిస్ (స్పైన్ కింద భాగం పక్కకి వంగడం) స్కోలియోసిస్ (స్పైన్ మధ్యభాగం పక్కకి వంగడం) వంటి సమస్యలకి ఉపయుక్తం.
సమన్వయం
సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్