జీతం+అమితం
ఉద్యోగం ఉంటే జీతం ఉంటుంది. ఇది ఎంప్లాయీకి. భీతి ఉంటే అమితం ఉంటుంది. ఇది ఎంప్లాయర్‌కి. అదేనండీ... ఉద్యోగం ఇచ్చాక వెళ్లిపోతారేమోనన్న భయం ఉంటే అమితంగా ప్రేమిస్తారు. ఇది కార్పోరేట్ ప్రేమ కథ. టెన్షన్‌లెస్ ‘రిటెన్షన్’ కథ.
డిగ్రీ రెడీ. ఉద్యోగం వెతుక్కునే హడావిడి. ఐదారు కంపెనీలకు అప్లై చేశారు. టెస్ట్ రాశారు. సెలక్ట్ అయ్యారు. ఓ మూడింట్లో ఓకే అయ్యారు. మూడూ పెద్ద కంపెనీలే. (అసలు చెయ్యడమే మనం పెద్ద కంపెనీలకు అప్లై చేసి ఉంటాం కదా). ఇప్పుడు ఈ మూడింట్లో దేన్ని సెలక్ట్ చేసుకుంటారు? ఏ కంపెనీకి వెళ్తారు? జనరల్‌గా జీతం ఎక్కడ ఎక్కువైతే అక్కడికి వెళ్తారు. బెనిఫిట్స్ ఎందులో ఎక్కువుంటే అందులోకి వెళతారు. ముందు జీతభత్యాలు, తర్వాత కంపెనీ పేరు ప్రతిష్ఠలు. ఇవి చూసుకుని జాయిన్ అవుతారు. అంతేకదా. అభ్యర్థులు ఇలా టాప్ కంపెనీలను ఎంపిక చేసుకున్నట్లే... కంపెనీలు కూడా మెరికల్ని నిలుపుకోవడం వడం పోటీపడి మరీ జీతభత్యాలతో పాటు ‘ఎక్స్‌ట్రా’ సదుపాయాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇక్కడ కొన్ని జయెంట్ కంపెనీలు ఉన్నాయి. అవి తమ ఉద్యోగులకు ఎలాంటి ‘ఎక్స్‌ట్రా’క్షన్స్ ఇస్తున్నాయో చూడండి!
1 గూగుల్ (సాఫ్ట్‌వేర్ కంపెనీ)
ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి గూగుల్ ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటుంది. గూగుల్ క్యాంటీన్‌లలో హై క్వాలీటీ ఫుడ్ ఉంటుంది. మసాజ్ రూములు ఉంటాయి. వర్క్ మధ్యలో అలిసిపోతే కునుకు తియ్యడానికి చక్కటి చోటు ఉంటుంది. హెయిర్ కటింగ్ సెలూన్ ఉంటుంది. డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ ఉచితంగానే. ఇక ఎంప్లాయీ ఏ కారణం చేతనైనా చనిపోతే.. వారి జీవిత భాగస్వామికి కంపెనీ పదేళ్ల పాటు 50 శాతం జీతం ఇస్తుంది. ఇంతకు మించిన లైఫ్ టైమ్ బోనస్ ఉంటుందా!
2 ట్విట్టర్ (ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్)
ఇక్కడి ఉద్యోగులకు రుచికరమైన త్రీ కోర్స్ మీల్ (స్టార్టర్స్ + మెయిన్ మీల్స్ + డెజర్ట్) అన్ని షిఫ్టుల్లో అందుబాటులో ఉండి ఆవురావురుమనిపిస్తుంది. ‘కండకలవాడే మనిషోయ్’ అన్నట్లు ఇక్కడి రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎంప్లాయీస్‌ని మనుషులుగా మార్చేస్తాయి. ఆహారం వల్ల ఆరోగ్యం, ఆరోగ్యం వల్ల పని. అందుకే ఇక్కడి ఉద్యోగులు అనారోగ్యంతో పెట్టే సెలవులు దాదాపుగా ఉండవు. సెలవులు పెట్టరని చెప్పి సెలవులు లేకుండా ఏమీ లేవు. ట్విట్టర్‌లో ఎన్ని సెలవులైనా పెట్టుకోవచ్చు. అవి అపరిమితం.
3 ఫేస్‌బుక్ (ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్)
ఏడాదికి నాలుగు వారాలు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ మొబైల్ సర్వీసు, ఫ్రీ బైక్ సర్వీసు సరేసరి. ఇక విందులు విహారాలకైతే లోటే లేదు. ముఖ్యంగా... డెలివరీ అయిన ఎంప్లాయీకి 4 వేల డాలర్ల ‘బేబీ క్యాష్’ను ఇస్తుంది. అంటే.. 2,71,860 రూపాయలు. ఇంకా జిమ్ము, హెల్త్ సెంటర్, బైక్ షాప్; తల్లికైనా, తండ్రికైనా 4 నెలల పేరెంటల్ లీవు వంటి సదుపాయాలు ఉన్నాయి. విస్త్రృతమైన సిబ్బంది వినోద కార్యక్రమాలకు కూడా ఫేస్‌బుక్ ఫేమస్.
4 సేల్స్‌ఫోర్స్ (క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ)
ఇక్కడి ఉద్యోగికి ఏడాదికి 6 రోజుల పెయిడ్ హాలిడే ఉంటుంది. అలాగే ఏడాదికొకసారి ఛారిటీ మనీ పేరిట ప్రతి ఎంప్లాయీకి 1000 డాలర్లు ఇస్తారు. (సుమారు 68 వేల రూపాయలు). దానిని దాన ధర్మాలకు ఉపయోగించాలని కంపెనీ ఆకాంక్ష. ఇక చాలా కంపెనీల కంటే ఇక్కడ హెల్త్ ప్రీమియం తక్కువ, హెల్త్ బెనిఫిట్‌లు ఎక్కువ. ఆఫీస్ ఫన్‌కైతే కొదవే లేదు. సిబ్బంది స్ట్రెస్ ఫీల్ అవకుండా గంగ్నమ్ స్టెయిల్ సింగర్స్ వచ్చి, ఉల్లాసపరిచి వెళుతుంటారు. యోగా క్లాసులూ ఉంటాయి.
5 అడోబ్ (సాఫ్ట్‌వేర్ కంపెనీ)
అడోబ్ కంపెనీని ప్రతి డిసెంబరులో ఒక వారం పాటు మూసేస్తారు! అలాగే సమ్మర్‌లో ఒక వీక్ మొత్తం ఆఫీస్ ఉండదు. మిగతా సెలవులకు, వీక్‌ఆఫ్‌లకు ఇది అదనం. ‘ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ ప్రోగ్రామ్’ ద్వారా షేర్స్‌ను తక్కువ ధరకు పొందవచ్చు. అదనపు పనిగంటలకు అదనపు జీతం వస్తుంది. ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే లీగల్ అసిస్టెంట్ లభిస్తుంది. పెట్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్ కూడా. ఇంట్లో చూసేవాళ్లు ఎవరూ లేకపోతే పెట్స్‌ని ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు.
6 స్పోటిఫై మ్యూజిక్ సర్వీస్
ఈ కంపెనీ 6 నెలల పేరెంటింగ్ లీవ్ ఇస్తోంది! ప్లస్ ఉద్యోగి వర్క్‌కి తిరిగి వచ్చాక ఒక నెల పాటు పనివేళల్లో వెసులుబాటు ఉంటుంది. ఇదికాక ఆఫీస్ పరిసరాలు, అమరికలు అదిరిపోతాయి. కళాత్మకంగా తీర్చిదిద్దన ఈ వర్క్‌ప్లేస్‌లో భౌతికవాదులకు సైతం సృజనాత్మకత వెల్లివిరుస్తుందని అంటారు. ఇంకా ఇక్కడ ఏడాదికోసారి ఇచ్చే బోనస్‌కి అదనంగా పెర్మార్మెన్స్ బోనస్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం మెడికల్ లీవు కూడా తీసుకోవచ్చు.
7 ఎయిర్ బి.ఎన్.బి (ఆన్‌లైన్ అకామడేషన్స్)
ఈ కంపెనీ ఉద్యోగులకు ఏడాదికొక 2000 డాలర్ల స్టయిఫండ్ వస్తుంది. ఎయిర్ బి.ఎన్.బి. జాబితాలో ఉన్న ప్రదేశాలకు ప్రపంచమంతా పర్యటించడానికి కంపెనీ కల్పించిన సదుపాయం ఇది. రెండు వేల డాలర్లంటే సుమారు 1,36,000 రూపాయలు. అలాగే సంతానం కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఫెర్టిలిటీ అసిస్టెన్స్ ఇప్పిస్తారు. పిల్లల్ని దత్తత తీసుకున్నవారికి కూడా పేరెంటింగ్‌కి ఇచ్చే సదుపాయాలనే వర్తింపజేస్తారు. రీచార్జ్ కావడానికి స్పెషల్ లీవ్ ఇస్తారు.
8 యాక్సెంచ్యూర్ (మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్)
ఉద్యోగులకు ‘టోటల్ రివార్డ్స్’ ప్యాకేజీ ఉంటుంది. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా సౌకర్యాలను, సదుపాయాలను పెంచుకుంటూ పోతారు. అలాగే ఇక్కడ ‘గే’ ఎంప్లాయీలకు, ఇంకా, ఆ కేటగిరీలో ఉన్నవారికి ప్రత్యేక వసతులు, వెసులుబాట్లు ఉంటాయి. అవసరమైతే కొన్నాళ్లపాటు ఇంటి నుంచే పనిచేయవచ్చు. సోషల్ ఈవెంట్‌లకు వెళ్లిరావచ్చు. ఉద్యోగిగా అప్‌డేట్ అవడానికి ఇలాంటి ఈవెంట్స్ తోడ్పడతాయని కంపెనీ భావిస్తుంది.