మేము సైతం అంటున్న యాంకర్లు... | Sarath Kumar Social Service Special Story | Sakshi
Sakshi News home page

శరత్‌ సహృదయ్‌ సేవ

Published Thu, Jul 11 2019 12:38 PM | Last Updated on Thu, Jul 11 2019 12:38 PM

Sarath Kumar Social Service Special Story - Sakshi

శరత్‌కుమార్‌

అనాథలకు అన్నం పెట్టడం, పేదలకు సాయం చేయడం, వికలాంగులకు ఊతమివ్వడం, సమాజానికి చేతనైన సేవ చేయడం... ఇవన్నీ చేయాలంటే బోలెడంత డబ్బుండాలి... అది నిజమే కావచ్చు కానీ సేవ చేయాలన్న దృఢ సంకల్పం, ఆ సంకల్పాన్ని నిలబెట్టుకోవాలన్న సహృదయం ఉంటే చాలు... ఆ సేవను చూసి తోటివాళ్లు ముందుకు వస్తారని నిరూపిస్తున్నాడు శరత్‌.బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో నివసించే శరత్‌కుమార్‌ కొండగడుపులో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే తపన బలంగా ఉండేది.

ఒక బాలికను దత్తత తీసుకుని...
తన గల్లీలో ఉండే ఇంటికి పెద్ద దిక్కు అయిన ఓ బాలిక తండ్రి 2011లో చనిపోయాడు. ఇది చూసిన శరత్‌ ఆ బాలికను దత్తత తీసుకుని స్కూల్‌లో చేర్పించాడు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు తానే భరించాడు. ఆ బాలిక దత్తతతో మొదలైన తన ప్రస్థానం ఇంకెందరికో సాయపడేలా సాగింది.
ఇలా సాగిపోతున్న తనకు ఒక ఆలోచన వచ్చింది. ‘నాలాగా ఆలోచించే వాళ్లను ఒక బృందంగా చేసుకుని నేనెందుకు ఒక ఎన్‌జీఓను ప్రారంభించకూడదు?’అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఒక ఎన్‌జీఓను నడపడం అంత సులువేమీ కాదని శరత్‌కు తెలుసు కాని ఒక సంవత్సరం పాటు దానిపై కసరత్తు చేసి నిస్వార్థంగా ఎన్‌జీఓను ఎలా నడపాలనే దానిపై అవగాహన పెంచుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో ‘ది సహృదయ్‌ స్వచ్ఛంద సంస్థ’ ను ప్రారంభించాడు.

సాక్షి దినపత్రికలో వచ్చిన ఓ కథనంతో మొదలైంది...
ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన ఇమ్రాన్‌ అనే యువకుడిపై సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. రెండుకిడ్నీలు ఫెయిలైన ఇమ్రాన్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సకు అయ్యే ఖర్చు కోసం దాతల సాయం కావాలన్న ఆ కథనాన్ని చదివిన శరత్‌ వెంటనే ఆ పేపర్‌ క్లిప్పింగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ తర్వాత నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి ఇమ్రాన్‌ తల్లిదండ్రులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే మందుల కోసం తన వంతుగా రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించాడు. సేవాభావం గల తన స్నేహితుల సాయంతో మరికొంత సాయం చేశాడు. అది తన మనసుకెంతో తృప్తిని ఇవ్వడంతో వైద్యులతో మాట్లాడి చికిత్స చేస్తే బతికే అవకాశాలున్న రోగులకు దాతల నుంచి సాయం అందేలా చూడటం ప్రారంభించాడు. శరత్‌తోపాటు తన బృందంలోని సభ్యులు వివిధ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు సాయం చేయడం మొదలు పెట్టాడు.

శరత్‌ బృందానికి కేటీఆర్‌ ఏ సాయం కావాలన్నా చేస్తా అని హామీ ఇవ్వడంతో ఆయన ద్వారా ఎంతోమందికి సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్‌ సాయంతో 26 మంది ప్రాణాలను కాపాడినట్లు శరత్‌ తెలిపారు. కేటీఆర్‌ తమ ఫౌండేషన్‌కు ఎంతో అండగా నిలిచారని పేర్కొన్నారు.

ఫోన్‌ చేస్తే రక్తం దానం...
రోగులకు రక్తం కావాలని ఫలానా గ్రూప్‌ రక్తం కావాలని ఈ ఫౌండేషన్‌ను సంప్రదించే వాళ్లు. ఇది దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్‌ వలంటీర్ల బ్లడ్‌ గ్రూప్‌ వివరాలను సేకరించి పొందుపరిచారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో వలంటీర్లు రోగుల వివరాలు తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా బాంబే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వలంటీర్లు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.

హైదరాబాద్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు విస్తరణ...
2017లో శరత్‌ స్థాపించిన ‘ది సహృదయ్‌ ఫౌండేషన్‌’ 23 మంది వలంటీర్లతో హైదరాబాద్‌లో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలలో తమ సేవలను అందిస్తున్నారు. మరింత మందికి సేవలందించాలనే ఉద్దేశంతో ఆ తర్వాత తమిళ్‌నాడు, కర్నాటక, యూపీ, ఎంపీ, ఢిల్లీ, అస్సాం, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, వెస్ట్‌ బెంగాల్, మణిపూర్‌ రాష్ట్రాలలో సహృదయ ఫౌండేషన్‌ బృందాలు పని చేస్తున్నాయి.

విదేశాలలోనూ ఫౌండేషన్‌ బృందాలు...
యూఎస్‌ఏ, రష్యా, ఆస్ట్రేలియా, మలేసియా, ఇండోనేసియా, ఫిలిఫైన్స్, ఇటలీ, ఉక్రెయిన్‌ వంటి దేశాలలో తమ బృందాలు పని చేస్తున్నాయని శరత్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5000మంది వలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు.

మేము సైతం అంటున్న యాంకర్లు...
శరత్‌ చేస్తున్న సేవల గురించి తెలిసిన యాంకర్‌ ప్రదీప్, విష్ణుప్రియ, సుడిగాలి సుధీర్‌ తల్లి కూడా స్వచ్ఛందంగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు.– సచిన్‌ విశ్వకర్మ, సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement