
పొదుపు చేశా..బండి కొన్నా
మహానగరంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు వెళ్లాలంటే బస్సులు సమయానికి దొరికీ, దొరక్క చాలా అవస్థలు పడక తప్పని పరిస్థితి. దీంతో నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ ప్రత్యేకంగా నాకు బండి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఉద్యోగం వచ్చాక ఏడాదికి దాన్ని మార్చాల్సి వచ్చింది. కొత్తది తీసుకుందామంటేనేమో రేటు దాదాపు రూ. 40,000 పైచిలుకు అవుతుందన్నారు. ఒక మోస్తరు శాలరీ కావడంతో ఏక మొత్తంగా కట్టే అవకాశం కనిపించలేదు. అలాగని ఇంట్లో వాళ్లనో, ఫ్రెండ్స్‌నో లోన్ అడగడం లేదా ఈఎంఐల మీద తీసుకోవడమన్నది నాకు ఇష్టంగా అనిపించలేదు.
ఎందుకంటే, నా మటుక్కు నాకు లోన్ తీరేదాకా ఆ స్కూటర్ నాది కాదు, ఎవరిదో వాడుతున్నానని ఉంటుంది. అందుకే నెల నెలా కొంత మొత్తం పొదుపు చేసి, సొంతంగా నగదు పెట్టే కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే ఖర్చులు తగ్గించుకుని సాధ్యమైనంత మొత్తాన్ని దాచడం మొదలుపెట్టాను. ఏడాది తిరిగేసరికి స్కూటర్ తీసుకునేంత పొదుపు చేయగలిగాను. ఆ తర్వాత అన్నయ్యతో కలిసి వెళ్లి తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ మొదలు బండి ఇంటికి వచ్చేదాకా అంతా తనే చూసుకున్నాడు. నా కష్టార్జితంతో కొనుక్కున్న బండి చేతికొచ్చేసరికి ఎంతో సంతోషం కలిగింది.
- జి.వి. రమాదేవి, హైదరాబాద్
ఇలాంటివి మీరూ సాధించారా?
ఇల్లు, వాహనం, ఉన్నత విద్య మొదలైన లక్ష్యాల సాధన కోసం మీరు పాటించిన ఆర్థిక ప్రణాళికలు (డౌన్ పేమెంట్లు, మార్జిన్లు సమకూర్చుకోవడం, క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టేందుకు ప్లానింగ్ చేసుకోవడం వంటివి), సాధించిన ఆర్థిక విజయాలను మాతో పంచుకోండి. అలాగే.. పొదుపు, పెట్టుబడులు, మనీ మేనేజ్‌మెంటుకి సంబంధించి మీకు తెలిసిన, మీరు పాటించే వైవిధ్యమైన చిట్కాలేమైనా ఉంటే మాకు రాయండి.
మీ లేఖ పంపాల్సిన చిరునామా
బిజినెస్ డెస్క్, సాక్షి తెలుగు దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నంబర్-1,
బంజారాహిల్స్, హైదరాబాద్. పిన్-500034
email: business@sakshi.com