
నా దివ్యమహిమలు వర్ణింపశక్యం కావు
మామిడిపూడి ‘గీత’ విభూతి యోగం
అర్జునుని ప్రార్థనను అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతులను ఇలా చెబుతున్నాడు. ‘‘అర్జునా! నా దివ్యమహిమలు అనంతాలు. అవి వర్ణింపశక్యమైనవి కావు. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని మాత్రం వినిపిస్తాను. విను. సర్వభూతాలలోనూ ఉండే ఆత్మను నేనే. సమస్తభూతాల సృష్టి స్థితి లయములకు కారణభూతుడను నేనే. సర్వక్షేత్రములయందును క్షేత్రజ్ఞుడను నేనే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత! (13-33)
ఒక్క సూర్యుడు సమస్త లోకాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడో అట్లే నేను క్షేత్రజ్ఞుడనై ఎల్ల క్షేత్రాలను ప్రకాశింపజేస్తున్నాను. నా జ్యోతి పరంజ్యోతి. సూర్యచంద్రాదులను ప్రకాశింపజేస్తోంది. అర్జునా! సమస్త చరాచర భూతాల లోపల వెలుపల నేను నిండి ఉన్నాను. కానీ నా సూక్ష్మత్వ కారణం వల్ల నన్ను తెలుసుకోవడం సులభం కాదు.
- కూర్పు: బాలు-శ్రీని