స్ప్రేయర్ పనితీరును పరీక్షిస్తున్న సుభానీ, తదితరులు
కషాయాలు, ద్రావణాలు, జీవామృతం, అటవీ చైతన్యం, అమృత్‌పానీ వంటి భూసార వర్ధని ద్రావణాల నుంచి పురుగుమందుల వరకు పంటలపై మనుషులు పిచికారీ చేయడం రైతుకు భారంగా మారింది. కూలీల కొరత, అధిక ఖర్చు సమస్యలతో పాటు సకాలంలో ప్రారంభించి, త్వరగా పిచికారీ పూర్తి చేయడం కూడా రైతుకు అనుకూలించే ముఖ్య విషయాలు. రైతుకు ఖర్చును, శ్రమను, సమయాన్ని ఆదా చేసే బూమ్ స్ప్రేయర్లు సహా కొత్త రకం స్ప్రేయర్లను రూపొందించడంలో సయ్యద్ సుభానీ సిద్ధహస్తుడు. సౌరశక్తితో తనంతట తానే నడుస్తూ, పిచికారీ చేసే సోలార్ స్ప్రేయర్‌ను తాజాగా సుభానీ ఆవిష్కరించారు. మెట్ట, ఆరుతడి పంటలన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది.
ప్రయోగాలే ఊపిరిగా సరికొత్త స్ప్రేయర్లను రూపొందిస్తూ అన్నదాతల మన్ననలు పొందుతున్న ప్రసిద్ధ గ్రామీణ ఆవిష్కర్త సయ్యద్ సుభానీ తాజాగా సౌర శక్తితో నడిచే ‘బ్యాటరీ రన్ సోలార్ స్ప్రేయర్’ను రూపొందించారు. మెకానిక్ అయిన సుభానీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని మారుమూల గ్రామం నాగబైరువారిపాలెం వాస్తవ్యుడు. ఆరేళ్ల క్రితం నుంచి కొత్త డిజైన్లతో స్ప్రేయర్లు తయారు చేస్తున్నారు. జీపు, ట్రాక్టర్‌లతో నడిచే బూమ్ స్ప్రేయర్లతో పాటు మొత్తం 9 స్ప్రేయర్లను తయారు చేసి ప్రసిద్ధి పొందారు.
ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్‌కు డీజిల్/పెట్రోలు అవసరం లేదు. దీని పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకం ద్వారా తయారు చేసుకునే సౌరశక్తితో బ్యాటరీ చార్జి అవుతుంది. ఆ శక్తితోనే నడుస్తుంది, పిచికారీ చేస్తుంది. దీని వెనుక మనిషి ఉండాలి. అయితే, శ్రమపడాల్సిన అవసరం లేదు. ట్యాంకును నింపి, సాలులో దీన్ని నిలిపి ఆన్ చేస్తే చాలు. అదే తనను తాను నడుపుకుంటూ పిచికారీ చేస్తూ ముందుకు వెళ్తుంది. స్ప్రేయర్ చక్రాలకు మట్టి పెళ్లలు అడ్డుపడినప్పుడో, మలుపు తిరగాల్సినప్పుడో మనిషి అవసరం ఉంటుంది.
ఏయే పంటలకు ఉపయోగం?
9 అంగుళాల నుంచి 42 అంగుళాల అచ్చు వాడే శనగ, మినుము వంటి అపరాలు, పత్తి, పొగాకు, కూరగాయ పంటలు తదితర మెట్ట, ఆరుతడి పైరులన్నిటిలోనూ కషాయాలు, ద్రావణాలు, పురుగుమందుల పిచికారీకి ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. జీవామృతం పిచికారీ చేయాలంటే.. డబుల్ ఫిల్టర్‌ను వాడాలి. పెద్ద నాజిల్ పెట్టుకోవాలని సుభానీ తెలిపారు.
పందిరి కూరగాయ తోటల్లో పందిళ్ల పైన పిచికారీ చేయడానికి కూడా దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి తయారు చేస్తానని సుభానీ తెలిపారు. ఈ స్ప్రేయర్ చక్రాల మధ్య 18 అంగుళాల దూరం ఉంటుంది. ఇటు 6 అడుగులు, అటు 6 అడుగుల దూరం పిచికారీ చేస్తుంది. అవసరాన్ని బట్టి తగినట్లు మార్పులు చేసుకోవచ్చని సుభానీ తెలిపారు.
అర గంటలో ఎకరం పిచికారీ
స్ప్రేయర్ తయారీకి రూ. 32 వేల ఖర్చు
ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్ తయారీకి సుమారు రూ. 32 వేలు ఖర్చవుతుందని సుభానీ తెలిపారు. సైకిల్‌కి వాడే మూడు చక్రాల బండికి 50 వాట్ల సోలార్ ప్యానల్, 12 యామ్స్ బ్యాటరీ. 12 వోల్టుల (120 పీఎస్) మోటారు, 22 లీటర్ల సామర్థ్యం వాటర్ ట్యాంక్‌ను అమర్చారు. నాలుగు నాజిల్స్ ఏర్పాటు చేశారు. ఎకరా పొలంలో 30 నిమిషాల్లో పురుగుమందు పిచికారీ చేయవచ్చు. కూలీలను పెట్టుకొని పిచికారీ చేయాలంటే గంటన్నర సమయం పడుతుంది. దీని బ్యాటరీకి ఏడాది గ్యారంటీ ఉంది. మనిషి నెట్టుకుంటూ వెళ్లే విధంగా ఒకే చక్రంతో కూడిన సోలార్ స్ప్రేయర్‌ను రూ. 22 వేలకే రూపొందించవచ్చన్నారు. సుభానీని గ్రాంటు ఇవ్వడం ద్వారా నాబార్డు ప్రోత్సహిస్తుండడం విశేషం.
బ్యాంకు రుణం ఇస్తే మరిన్ని రూపొందిస్తా!
నేను గత ఆరు సంవత్సరాలుగా కొత్తరకం స్ప్రేయర్లపై ప్రయోగాలలో నిమగ్నమై ఉన్నాను. ఇప్పటికి 9 రూపొందించాను. ఈ సోలార్ స్ప్రేయర్ లాంటిది దేశంలో ఇంతకుముందెవరూ తయారు చేయలేదు. నా భార్య షకీలా, తమ్ముడు చిన్న సుభానీ, కుమారులు ఖుధావ, మోషిన్, కుమార్తె షాహిన్‌తోపాటు నాబార్డు, పల్లెసృజన సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తే, రైతులకు తోడ్పడే మరిన్ని నూతన పరికరాలు రూపొందిస్తా.
– సయ్యద్ సుభానీ (98486 13687), గ్రామీణ ఆవిష్కర్త, నాగబైరువారిపాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా
స్ప్రేయర్‌కు తుది మెరుగులు దిద్దుతున్న సుభానీ
– ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో
ఫొటోలు: పులి ప్రకాశ్, సాక్షి, పెదనందిపాడు
Comments
Please login to add a commentAdd a comment