Sprayer
-
జనం మెచ్చిన రైతుబిడ్డ
సమస్య...కష్టం అనుకుంటే కష్టమే మిగులుతుంది. సమస్య....ఒక బడి అనుకుంటే పాఠం వినబడుతుంది. పరిష్కారం పది విధాలుగా కనిపిస్తుంది. పదిహేను సంవత్సరాల నేహా భట్ ఎకో–ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసి శభాష్ అనిపించుకుంది... ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడి ఇచ్చే వక్కతోటను సాగు చేసే రైతులు కర్ణాటక రాష్ట్రం లో ఎక్కువగానే ఉన్నారు. అయితే పంటసంరక్షణలో భాగంగా ‘బోర్డో’లాంటి రసాయనాలను స్ప్రే చేస్తున్నప్పుడు కళ్లు మండడంతో పాటు చర్మ, శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది రైతులు. ‘పెరికో’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకునే ‘బోర్డో’ వల్ల శరీరం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు ఎకో–ఫ్రెండ్లీ అగ్రిస్ప్రేయర్తో పరిష్కారం కనిపెట్టింది దక్షిణ కర్ణాటకలోని పుట్టూరుకు చెందిన నేహాభట్. నేహా తాత నుంచి తండ్రి వరకు ‘స్ప్రే’ పుణ్యమా అని ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కున్నవారే. సమస్య గురించి తెలుసుగానీ పరిష్కారం మాత్రం కనిపించలేదు పదమూడు సంవత్సరాల నేహాకు. రెండు సంవత్సరాల తరువాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న విద్యార్థుల కోసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్ ఎక్స్ప్లోర్స్(గ్లోబల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం) నిర్వహించే కార్యక్రమం అది. మన దైనందిన జీవిత సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కార మార్గాలు అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అదృష్టవశాత్తు దీనిలో నేహాభట్కు పాల్గొనే అవకాశం వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్ ‘సమస్య గురించి తెలిసినా పరిష్కారం తోచని పరిస్థితిలో ఎన్ఎక్స్ప్లోర్స్ ఒక దారి చూపింది’ అంటుంది పదిహేను సంవత్సరాల నేహా. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న గాటర్ పంప్‌కు మూడు స్ప్రేయర్ ఔట్లెట్లను అమర్చడంలాంటి మార్పులతో ఆధునీకరించి సరికొత్త ఆటోమేటెడ్ అగ్రి స్ప్రేయర్‌కు రూపకల్పన చేసింది. దీనికి పెద్దగా నిర్వహణ ఖర్చు అవసరం లేదు. తక్కువ ఇంధనంతో నడపవచ్చు. శబ్దసమస్య ఉండదు. టైమ్ వృథా కాదు. ఈ యంత్రాన్ని ఉపయోగించడంలో మానవప్రమేయాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే అయిదు గంటల పాటు పని చేస్తుంది. ఈ అగ్రిస్ప్రేయర్ను మరింత ఆధునీకరించి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే దిశగా ప్రయోగాలు చేస్తుంది నేహా భట్. ఈ స్ప్రేయర్‌కు రూపకల్పన చేసే ప్రయత్నంలో తండ్రి, రైతులు, ఉపాధ్యాయుల నుంచి విలువైన సలహాలు తీసుకుంది. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఎకోఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్‌కు జాతీయస్థాయిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) అవార్డ్ అందుకుంది. ‘ప్రతి రైతు ఆటోమేటెడ్ అగ్రిస్ప్రేయర్ ఉపయోగించాలి అనేది నా కోరిక’ అంటోంది నేహా. రసాయన వ్యర్థాలు, భారలోహాలతో కూడిన నీరు పొలాల్లో పారకుండా ఒక మార్గాన్ని కనిపెట్టింది నేహా. స్థానికంగా ఎక్కువగా కనిపించే ఒక రకం మొక్కను పొలం గట్లలో నాటుతారు. ఆ మొక్క విషకారకాలను పీల్చుకొని నీటిని శుద్ధి చేస్తుంది. చక్కని కంఠంతో పాటలు పాడే నేహా బొమ్మలు గీస్తుంది. రకరకాల ఆటలు ఆడుతుంది. పుస్తకాలు చదువుతుంది. సైన్స్ ఆమె అనురక్తి, పాషన్. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనిపెట్టాలనేది ఆమె కల. కల అంటూ కంటే ఫలితం చేరువ కావడం ఎంతసేపని! -
ఈ భెల్‌మిస్టర్.. కరోనా స్పెషల్
నోయిడా: అవసరం అన్నీ నేర్పిస్తుందంటారు. ఈ భారీ స్ప్రేయర్ కూడా అలాంటిదే. ఇది కరోనా స్పెషల్. తక్కువ సమయంలో ఎక్కువ భాగంలో రసాయనాలు స్ప్రే చేయడానికి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్).. నాలుగే నాలుగు రోజుల్లో దీన్ని డిజైన్, ఉత్పత్తి పూర్తి చేసింది. దీని పేరు భెల్‌మిస్టర్.. రసాయనాలు వ్యర్థం కాకుండా వాటిని అతి సూక్ష్మ బిందువుల రూపంలో మార్చి ముఫ్పై అడుగుల దూరం వరకూ వెదజల్లుతుంది. ఈ భెల్‌మిస్టర్ ద్వారా వాహనాలపై రసాయనాలను స్ప్రే చేస్తారు. ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో దీన్ని వాడుతున్నారు. (భెల్‌మిస్టర్ మిషన్‌తో కరోనా నియంత్రణ) -
సోలార్ స్ప్రేయర్ ఆవిష్కర్త సుభానీకి ఐసిఏఆర్ అవార్డు
ఆరుతడి పంటలు పండించే రైతుల కోసం కొన్ని సంవత్సరాలుగా అనేక వినూత్న స్రేయర్లను ఆవిష్కరించిన సయ్యద్ సుభానీ కృషికి గుర్తింపు లభించింది. భారతీయ వ్యవసాయ పరిశోధాన మండలి సుభానీని జాతీయ ఉత్తమ ఆవిష్కర్త అవార్డుకు ఎంపిక చేసింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్)లో జరగనున్న జాతీయ ఉద్యాన ప్రదర్శన–2020లో ఈనెల 8న సుభానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. కషాయాలు, పురుగుమందులను త్వరితగతిన పిచికారీ చేసే సౌర విద్యుత్తుతో నడిచే ఆటోమేటిక్ సోలార్ మౌంటెడ్ మల్టీ క్రాప్ స్ప్రేయర్‌ను రూపొందించినందుకు ప్రధానంగా ఈ అవార్డు తనకు దక్కిందని సయ్యద్ సుభానీ తెలిపారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని నాగబైరు పాలెం. సుభానీ(98486 13687) గతంలో రూపొందించిన బూమ్ స్ప్రేయర్ బాగా ప్రాచుర్యం పొందింది. సుభానీ కృషికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు! -
శభాష్.. సుభానీ సోలార్ స్ప్రేయర్!
కషాయాలు, ద్రావణాలు, జీవామృతం, అటవీ చైతన్యం, అమృత్‌పానీ వంటి భూసార వర్ధని ద్రావణాల నుంచి పురుగుమందుల వరకు పంటలపై మనుషులు పిచికారీ చేయడం రైతుకు భారంగా మారింది. కూలీల కొరత, అధిక ఖర్చు సమస్యలతో పాటు సకాలంలో ప్రారంభించి, త్వరగా పిచికారీ పూర్తి చేయడం కూడా రైతుకు అనుకూలించే ముఖ్య విషయాలు. రైతుకు ఖర్చును, శ్రమను, సమయాన్ని ఆదా చేసే బూమ్ స్ప్రేయర్లు సహా కొత్త రకం స్ప్రేయర్లను రూపొందించడంలో సయ్యద్ సుభానీ సిద్ధహస్తుడు. సౌరశక్తితో తనంతట తానే నడుస్తూ, పిచికారీ చేసే సోలార్ స్ప్రేయర్‌ను తాజాగా సుభానీ ఆవిష్కరించారు. మెట్ట, ఆరుతడి పంటలన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ప్రయోగాలే ఊపిరిగా సరికొత్త స్ప్రేయర్లను రూపొందిస్తూ అన్నదాతల మన్ననలు పొందుతున్న ప్రసిద్ధ గ్రామీణ ఆవిష్కర్త సయ్యద్ సుభానీ తాజాగా సౌర శక్తితో నడిచే ‘బ్యాటరీ రన్ సోలార్ స్ప్రేయర్’ను రూపొందించారు. మెకానిక్ అయిన సుభానీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని మారుమూల గ్రామం నాగబైరువారిపాలెం వాస్తవ్యుడు. ఆరేళ్ల క్రితం నుంచి కొత్త డిజైన్లతో స్ప్రేయర్లు తయారు చేస్తున్నారు. జీపు, ట్రాక్టర్లతో నడిచే బూమ్ స్ప్రేయర్లతో పాటు మొత్తం 9 స్ప్రేయర్లను తయారు చేసి ప్రసిద్ధి పొందారు. ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్‌కు డీజిల్/పెట్రోలు అవసరం లేదు. దీని పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకం ద్వారా తయారు చేసుకునే సౌరశక్తితో బ్యాటరీ చార్జి అవుతుంది. ఆ శక్తితోనే నడుస్తుంది, పిచికారీ చేస్తుంది. దీని వెనుక మనిషి ఉండాలి. అయితే, శ్రమపడాల్సిన అవసరం లేదు. ట్యాంకును నింపి, సాలులో దీన్ని నిలిపి ఆన్ చేస్తే చాలు. అదే తనను తాను నడుపుకుంటూ పిచికారీ చేస్తూ ముందుకు వెళ్తుంది. స్ప్రేయర్ చక్రాలకు మట్టి పెళ్లలు అడ్డుపడినప్పుడో, మలుపు తిరగాల్సినప్పుడో మనిషి అవసరం ఉంటుంది. ఏయే పంటలకు ఉపయోగం? 9 అంగుళాల నుంచి 42 అంగుళాల అచ్చు వాడే శనగ, మినుము వంటి అపరాలు, పత్తి, పొగాకు, కూరగాయ పంటలు తదితర మెట్ట, ఆరుతడి పైరులన్నిటిలోనూ కషాయాలు, ద్రావణాలు, పురుగుమందుల పిచికారీకి ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. జీవామృతం పిచికారీ చేయాలంటే.. డబుల్ ఫిల్టర్‌ను వాడాలి. పెద్ద నాజిల్ పెట్టుకోవాలని సుభానీ తెలిపారు. పందిరి కూరగాయ తోటల్లో పందిళ్ల పైన పిచికారీ చేయడానికి కూడా దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి తయారు చేస్తానని సుభానీ తెలిపారు. ఈ స్ప్రేయర్ చక్రాల మధ్య 18 అంగుళాల దూరం ఉంటుంది. ఇటు 6 అడుగులు, అటు 6 అడుగుల దూరం పిచికారీ చేస్తుంది. అవసరాన్ని బట్టి తగినట్లు మార్పులు చేసుకోవచ్చని సుభానీ తెలిపారు. అర గంటలో ఎకరం పిచికారీ స్ప్రేయర్ తయారీకి రూ. 32 వేల ఖర్చు ఈ మూడు చక్రాల సోలార్ స్ప్రేయర్ తయారీకి సుమారు రూ. 32 వేలు ఖర్చవుతుందని సుభానీ తెలిపారు. సైకిల్‌కి వాడే మూడు చక్రాల బండికి 50 వాట్ల సోలార్ ప్యానల్, 12 యామ్స్ బ్యాటరీ. 12 వోల్టుల (120 పీఎస్) మోటారు, 22 లీటర్ల సామర్థ్యం వాటర్ ట్యాంక్‌ను అమర్చారు. నాలుగు నాజిల్స్ ఏర్పాటు చేశారు. ఎకరా పొలంలో 30 నిమిషాల్లో పురుగుమందు పిచికారీ చేయవచ్చు. కూలీలను పెట్టుకొని పిచికారీ చేయాలంటే గంటన్నర సమయం పడుతుంది. దీని బ్యాటరీకి ఏడాది గ్యారంటీ ఉంది. మనిషి నెట్టుకుంటూ వెళ్లే విధంగా ఒకే చక్రంతో కూడిన సోలార్ స్ప్రేయర్‌ను రూ. 22 వేలకే రూపొందించవచ్చన్నారు. సుభానీని గ్రాంటు ఇవ్వడం ద్వారా నాబార్డు ప్రోత్సహిస్తుండడం విశేషం. బ్యాంకు రుణం ఇస్తే మరిన్ని రూపొందిస్తా! నేను గత ఆరు సంవత్సరాలుగా కొత్తరకం స్ప్రేయర్లపై ప్రయోగాలలో నిమగ్నమై ఉన్నాను. ఇప్పటికి 9 రూపొందించాను. ఈ సోలార్ స్ప్రేయర్ లాంటిది దేశంలో ఇంతకుముందెవరూ తయారు చేయలేదు. నా భార్య షకీలా, తమ్ముడు చిన్న సుభానీ, కుమారులు ఖుధావ, మోషిన్, కుమార్తె షాహిన్తోపాటు నాబార్డు, పల్లెసృజన సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తే, రైతులకు తోడ్పడే మరిన్ని నూతన పరికరాలు రూపొందిస్తా. – సయ్యద్ సుభానీ (98486 13687), గ్రామీణ ఆవిష్కర్త, నాగబైరువారిపాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా స్ప్రేయర్‌కు తుది మెరుగులు దిద్దుతున్న సుభానీ – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో ఫొటోలు: పులి ప్రకాశ్, సాక్షి, పెదనందిపాడు -
రసాన్ని లాగేస్తుంది
మాంసాహారులకైనా.. శాకాహారులకైనా.. నిమ్మకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పులిహోరలోకైనా, బిర్యానీలోకైనా నిమ్మకాయ లేకుంటే ఎలా..? అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఉదయాన్నే కావలసిన నిమ్మరసంలోకి నిమ్మకాయే లేకపోతే ఎలా..? ఒకటా? రెండా? నిమ్మకాయ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. దీనివల్ల కలిగే మేలు ఎంతున్నా.. ఓ సమస్య కూడా ఉంది. అదేనండీ.. దాన్ని పిండి, రసం తీయాలంటే మాత్రం కాస్త కష్టమే. మార్కెట్లోకి రసం తీసే ఎన్ని పరికరాలొచ్చినా... కాస్తో కూస్తో రసం అందులో ఉండిపోక తప్పదు. అందుకే ఈసారి నుంచి ‘సిట్రస్ స్ప్రేయర్’ను వాడండి. ముందుగా నిమ్మకాయ తొడిమను తీసి, ఈ స్ప్రేయర్‌ను దాంట్లోకి గుచ్చి, పైనున్న బటన్‌ను ప్రెస్ చేస్తే సరి. నిమ్మరసం కాయలోంచి డెరైక్ట్‌గా మీ సలాడ్లోకే వచ్చేస్తుంది. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. ఈ స్ప్రేయర్‌తో ఒక్క నిమ్మరసాన్నే కాదు.. బత్తాయిలాంటి పండ్లరసాలనూ ఏమాత్రం వృథా కాకుండా లాగేయవచ్చు.