లండన్ : క్రీడాకారులు, వ్యాయామం చేసే వారు వర్క్‌అవుట్ అనంతరం మద్యం సేవిస్తే దుష్ర్పభావాలు నెలకొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసిన తర్వాత, మ్యాచ్‌లు ముగిసిన వెంటనే మద్యం తీసుకుంటే కండరాలు దెబ్బతినడం, గాయాలు మానకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని సదరన్ క్రాస్ యూనివర్సిటీకి చెందిన స్పోర్ట్, ఎక్సర్‌సైజ్ సైన్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ స్టీవెన్స్ చెప్పారు. మద్యం తీసుకున్న వారిలో వ్యాయామం అనంతరం కండరాలు తిరిగి శక్తిని పుంజుకునే ప్రక్రియని ఆల్కహాల్ మందగింపచేస్తుందని తెలిపారు. తదుపరి వర్కవుట్ మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు.
సుదీర్ఘ వ్యాయామం, వేగంగా నడవడం, రన్నింగ్ వంటి తీవ్ర వ్యాయామాల అనంతరం శరీరం తిరిగి శక్తిని పుంజుకునేందుకు సమయం పడుతుందని, అయితే మద్యం సేవించడం ద్వారా కండరాలు సమస్థితికి చేరే ప్రక్రియ మందగిస్తుందని అన్నారు. మరోవైపు తరచూ గాయాల బారిన పడే అథ్లెట్లు మద్యం తీసుకుంటే గాయపడిన ప్రాంతంలో వాపు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ఇక అధిక మోతాదులో మద్యం తీసుకుంటే సరైన పోషక ఆహారం తీసుకోని కారణంగా శరీరం అలసటకు లోనవుతుందన్నారు.
ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉండటంతో ఆటగాళ్లు, ఇతరులు వ్యాయామం, క్రీడల అనంతరం ఆల్కహాల్ జోలికి వెళ్లరాదని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పష్టం చేసింది. మద్యానికి బదులు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఎలక్ర్టోలైట్లు కలిగిన డ్రింక్‌లను తీసుకోవడం మేలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment