భోజనం ముగించి డైనింగ్ హాల్ నుంచి తన రూమ్‌కి వచ్చింది మీనా. రూమ్‌మేట్ సంధ్య కోసం హాస్టల్ మొత్తం వెతికింది. ఎక్కడా సంధ్య లేదు. కిందికి వచ్చి వాచ్‌మన్‌ని అడిగింది. ఆమె అసలు కిందికే రాలేదని చెప్పాడతను. తిరిగి పైకి వెళ్లిపోదామనుకుంటూండగా పెద్ద శబ్దం. ఓ గావుకేక. శబ్దం వచ్చిన వైపు చూసింది మీనా. రక్తపు మడుగులో సంధ్య! ఏడడుగుల హాస్టల్ భవనం మీద నుంచి దూకేసింది. పరుగు పరుగున స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది మీనా. కానీ అప్పటికే ఆమె ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది.
హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీనా ద్వారా వెల్లడయింది. సంధ్య విజయనగరం జిల్లాలో ఓ చిన్న గ్రామం నుంచి సిటీకి వచ్చింది. తెలివైన పిల్ల. పీజీ చేసింది. కానీ వెనుకబడిన ప్రాంతానికి చెందినది కావడంతో కాస్త నాగరికత తెలియదంతే. చాలామంది అమ్మాయిల్లాగ సిటీకి అలవాటు పడలేకపోయింది. ఇక్కడి వాళ్లతో పోటీ పడలేకపోయింది. అంత యాక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండలేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఓడిపోసాగింది. దాంతో తాను ఎందుకూ పనికిరానేమోనన్న న్యూనతను ఏర్పరచుకుంది. చివరికి అదే పెరిగి పెద్దదై ఆమె ప్రాణాలను తీసింది.
మన దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎనభై శాతం మంది చదువుకున్నవారే. వారిలో సగానికి పైగా మహిళలే. కొందరు ప్రేమవ్యవహారాల వంటి వాటికి ప్రాణం తీసుకుంటుంటే... ఎక్కువమంది మాత్రం ఒత్తిడిని భరించలేక, న్యూనతను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి న్యూనతను జయించడం అంత కష్టమేమీ కాదు.
ఏదైనా విషయంలో మనం విజయం సాధించలేకపోతున్నామంటే... దిగులు పడే బదులు, ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి. కారణం తెలిశాక దాని గురించి స్నేహితులు, ఇంట్లోవాళ్లతో చెప్పాలి. అప్పుడు వాళ్లేదైనా మార్గం చెబుతారు. లేదంటే మీరే ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయవచ్చు. కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఖర్చు గురించి భయపడక్కర్లేదు. కొన్ని సంస్థల వారు ఉచితంగా కూడా నేర్పుతారు. అలాంటివేమీ అందుబాటులో లేవు, ఖర్చు పెట్టలేరు అనుకుంటే... మీకు లేవు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లండి. మొహమాట పడకుండా, నేను నీలా అవాలంటే ఏం చేయాలని అడగండి. నేర్చుకోవడం మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి... సంకోచం, సిగ్గు అవసరం లేదు.
ఇక మరీ ముఖ్యమైనది... మీ బలాలేమిటో తెలుసుకోవడం. ఒకదాంట్లో సక్సెస్ కాలేనప్పుడు, ఒకటి మీకు చేతకానప్పుడు... మీరేం చేయగలరో దానిమీద ఎందుకు శ్రద్ధ పెట్టకూడదు? ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయకూడదు? అవ్వదు అనుకున్నదానికోసం అవస్థ పడే బదులు, అవుతుంది అనుకున్న దానికోసం ఎందుకు సమయాన్ని వెచ్చించకూడదు? అందుకే మీ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మీ బలాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం. అలా చేయకుండా... మీరు దేనికీ పనికి రారని, మీరేమీ సాధించలేరని కుమిలిపోవడం కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏ మనిషీ పర్‌ఫెక్ట్ కాదు. ప్రతివారిలోనూ కొన్ని బలాలుంటాయి. కొన్ని బలహీనతలుంటాయి. బలాలను ఉపయోగించుకుంటూ, బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం నేర్చుకోవాలి. జీవితాన్ని మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు జీవించాలి. అప్పుడు మీలైఫ్ మీకు అందంగా కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. న్యూనత మీ నుంచి దూరంగా పారిపోతుంది!
నేర్చుకోడానికి, మార్చుకోడానికీ బిడియం ఎందుకు?
Published Thu, Nov 28 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement