సేవా శునకాలు | Service Dogs | Sakshi
Sakshi News home page

సేవా శునకాలు

Published Mon, Apr 7 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

Service Dogs

పెట్ వరల్డ్

‘‘కుక్కలు నన్ను ఎప్పుడూ కరవలేదు. మనుషులు తప్ప’’ అని కుక్కల్లోని మానవత్వాన్ని ఎప్పుడో లోకానికి చాటారు హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో. శునకాలలో ‘విశ్వాసం’ మాత్రమే కాదు బోలెడు ‘మానవత్వం’ కూడా ఉందని ‘సహాయక శునకాలు’  నిరూపిస్తున్నాయి.
     
లంకంత కొంప. అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఆ వృద్ధదంపతుల పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. చుట్టపు చూపుగా వచ్చిన ఒకాయన ‘‘మీ ఇంట్లో కుక్క ఉంది కదా...ఇక ముందు చిన్న చిన్న పనులన్నీ అదే చేసి పెడుతుంది’’ అంటూ ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది శునకాలకు సహాయ పనులు నేర్పించే సంస్థ అది. ఒక నెల రోజుల తరువాత...
 
‘‘స్టార్... వెళ్లి ఆ పాల పాకెట్ తెచ్చివ్వు’’, ‘‘స్టార్... వెళ్లి ఆ పేపర్ తెచ్చివ్వు’’ ... అలా చెబితే చాలు టకీమని చేసేస్తుంది ‘స్టార్’ అనే పేరున్న ఆ శునకం. ‘స్టార్’ చేస్తున్న పనుల గురించి ఇరుగు వారికి పొరుగు వారికి తెలిసిన వారు కూడా తమ శునకాలకు ‘సేవ’లో ప్రత్యేక శిక్షణ నిప్పించారు.
 
విదేశాల్లో విరివిగా...
 
విదేశాల్లో శునకాలకు సహాయక పనులు నేర్పే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు.
 
మన దేశంలో తొలి అడుగు...
 
విదేశాల్లోలాగే మన దేశంలోనూ శునకాలకు శిక్షణ నిచ్చే సంస్థ ఏదైనా ఉంటే బాగుండేది కదా అనుకుంది షిరిన్ మర్చెంట్. ఆలోచన రాగానే లండన్‌కు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ డాగ్ థెరపిస్ట్ జాన్ రోగర్‌సన్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆ తరువాత ఆమె ‘కెనైన్ కెన్ కేర్’ పేరుతో ముంబయిలో ఒక సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించింది.

యజమానులకు రకరకాలుగా సహాయపడే రీతిలో శునకాలకు శిక్షణ నివ్వడంలో ‘కెనైన్ కెన్ కేర్’ అగ్రగామిగా నిలిచింది. ‘వూఫ్’ పేరుతో ఒక ప్రతికను కూడా ప్రారంభించింది షిరిన్. శునకాల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను నడపడం మన దేశంలో ఇదే ప్రథమం. ఈ పత్రిక పేరు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి కూడా ఎక్కింది. ఒకసారి ముంబయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఒకాయన వచ్చి షిరిన్‌ను కలిశాడు. ఆయన వికలాంగుడు. గతంలో ఒకసారి తన శునకానికి షిరిన్ దగ్గర శిక్షణ ఇప్పించాడు.
 
‘‘ బిడ్డలు లేని లోటును మా పెంపుడు కుక్క తీరుస్తోంది. ప్రతి పనినీ ఓపికగా, చురుకుగా చేసి నాకు అన్నిరకాలుగా సహాయపడుతోంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. అలా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో వెలుగు!
 
ఆయన చెబుతున్నది వింటున్నప్పుడు ఆమె కళ్లలో అంతకు రెట్టింపు వెలుగు!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement