
వెదికిపెడతారు!
స్ఫూర్తి
ఏడేళ్లక్రితం నేపాల్‌లో వచ్చిన వరదలపుడు జనుక అనే రెండేళ్లమ్మాయి తప్పిపోయింది. ఎవరో స్వచ్ఛందసంస్థవారు జనుకను ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. వరదబీభత్సం కారణంగా అందరూ ఉండి కూడా అనాథగా మారిపోయిన జనుక ఈ మధ్యనే తన తల్లిని కలుసుకుంది. ఏడేళ్ల తర్వాత జనుక ఫోన్ చేసి తల్లితో మాట్లాడిన దృశ్యాన్ని చూసి ఆశ్రమంలోని వారంతా చలించిపోయారు.
ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న అనాథాశ్రమంలోనే తన బిడ్డ ఉందని కనుక్కోలేకపోయిన ఆ తల్లి జనుకను గుండెలకు హత్తుకుని చెప్పిన మాట ‘....అంతా ఎన్‌జిఎన్ (నెక్ట్స్ జనరేషన్ నేపాల్) పుణ్యం’ అని.. ఎన్‌జిఎన్ అనేది ఒక స్వచ్ఛందసంస్థ. తప్పిపోయినవారి వివరాలిస్తే ఎన్ని తిప్పలు పడైనా వెదికిపెడుతుందన్నమాట. జనుక తల్లి చెప్పిన వివరాల ఆధారంగా రకరకాల శోధనలు చేసి తల్లినీ బిడ్డనీ కలిపింది ఎన్‌జిఎన్.
అలాగే నేపాల్‌లోని హుమ్లా ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ వయసు పన్నెండు. పాఠశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన లక్ష్మణ్ అకస్మాత్తుగా మాయమయ్యాడు. తప్పిపోయాడని కొందరు, అపహరించారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసి ఊరుకున్నారు. చివరికి ఈ కేసు ఎన్‌జిఎన్ బృందం చేధించింది. ఇలా తమ దృష్టికి వచ్చిన మిస్సింగ్ కేసులన్నింటినీ ఛేదిస్తున్న ఎన్‌జిఎన్ సేవలను నేపాల్ ప్రజలంతా ముక్తకంఠంతో అభినందిస్తున్నారు.