ఆడపడుచులు ఇంటికొస్తే చాలు...
మనోగతం
మాటా మాటా పెరిగి ‘విడాకులు తీసుకుందాం’ అనే వరకు వచ్చింది వ్యవహారం.
మా ఆవిడ ప్రవర్తన ఏ విషయంలోనూ తప్పు పట్టలేనంత గొప్పగా ఉండేది. ఒకే ఒక విషయంలో మాత్రం ఆమె ప్రవర్తన చికాకు పరిచేది. బాధ కలిగించేది కోపం తెప్పించేది.
మా అక్క, చెల్లి ఎప్పుడైనా ఒకసారి ఇంటికి వస్తే, మా ఆవిడ వారితో ఆప్యాయంగా మాట్లాడినట్లు నటించేది. వాళ్లు వెళ్లిన తరువాత మాత్రం నాకు నరకం చూపించేది.
‘‘ఎంత డబ్బు ఇచ్చేరు వాళ్లకు?’’ అని అడిగేది.
‘‘డబ్బు ఏమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగితే-
‘‘నేనేమీ అమాయకురాలిని కాదు. నాకు అన్నీ తెలుసు’’ అన్నది.
‘‘తెలివి తక్కువగా మాట్లాడకుండా అసలు విషయం చెప్పు’’ అని అడిగేసరికి-
‘‘మీ అక్క చెల్లెళ్లకు డబ్బులు ఇస్తే, పిల్లల సంగతి ఏమిటి? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకిలా చేస్తున్నారు’’ అనేది కన్నీళ్లు తుడుచుకుంటూ. ‘‘నా డబ్బుల మీద ఆధారపడాల్సి అవసరం వారికి లేదు. ఒకవేళ నేను వారికి డబ్బు ఇచ్చినా అదేమీ తప్పు కాదని అనుకుంటున్నాను’’ అన్నాను గట్టిగా. దీంతో మాటా మాటా పెరిగి ‘విడాకులు తీసుకుందాం’ అనే వరకు వచ్చింది వ్యవహారం.
అదృష్టవశాత్తూ మా అత్తా మామలు మంచివారు. విషయం తెలిసి కౌన్సెలింగ్ చేశారు. కళ్లు తెరిపించారు.
‘‘నన్ను క్షమించండి’’ అంది ఆమె కళ్ల నీళ్లు పెట్టుకుండూ.
‘‘నేను ఆవేశపడ్డాను. నన్ను కూడా నువ్వు క్షమించాలి. ఓకేనా’’ అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. ఆరోజు నుంచి ఇప్పటివరకు మేము వరకు గొడవ పడలేదు.
-సిఆర్, నెల్లూరు టౌన్