వచ్చేశాడు చందర్‌పాల్-2 | Shivnarine Chanderpaul and Tagenarine Chanderpaul: Father and Son bat together | Sakshi
Sakshi News home page

వచ్చేశాడు చందర్‌పాల్-2

Published Sat, Feb 22 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

వచ్చేశాడు చందర్‌పాల్-2

వచ్చేశాడు చందర్‌పాల్-2

మా తాతల కాలంనుంచీ క్రికెట్ ఆడుతున్నా...మా రక్తంలోనే ఆట ఉంది...ఇలాంటి డైలాగ్‌లు మనం చాలానే విన్నాం. నిజమే...ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు, వారి మనవలు, పిల్లలు, అన్నదమ్ములు...ఇలా ఎందరో తమ జాతీయ జట్లకు ఆయా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారు. అయితే ఎప్పుడైనా ‘ నేను, మా నాన్న కలిసి ఫలానా మ్యాచ్‌లో ఆడాం. ఇద్దరం కలిసి జట్టును గెలిపించాం‘ అని ఎవరైనా క్రికెటర్ వ్యాఖ్యానించారా. అయితే వెస్టిండీస్‌కు చెందిన తేజ్ నారాయణ్ చందర్‌పాల్ ఆ మాట బలంగా చెప్పగలడు.  విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ శివ్ నారాయణ్ చందర్‌పాల్ పుత్రరత్నమే ఈ అబ్బాయి. జాతీయ స్థాయిలో గయానా జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఈ తండ్రి కొడుకులు ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఒకే మ్యాచ్‌లో ఆడటం అరుదైన ఘటనగానే చెప్పవచ్చు. క్రికెట్ చరిత్రలోనే దాదాపుగా ఇలాంటిది చోటు చేసుకోలేదు.
 
నాకు 16...నీకు 38...
 
ఎడమచేతి వాటం, గంటల కొద్దీ ఓపికతో బ్యాటింగ్...అచ్చంగా తండ్రిని పోలి ఉండే శైలి తేజ్ నారాయణ్‌ది. దాదాపు ఏడాదిన్నర క్రితం వీరిద్దరు తొలిసారి ఒకే జట్టులో క్లబ్ క్రికెట్ ఆడారు. ట్రాన్స్‌పోర్ట్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గాంధీ యూత్ ఆర్గనైజేషన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ జోడి మూడో వికెట్‌కు 256 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు తేజ్ వయసు 16 కాగా...శివ్‌కు 38 ఏళ్లు.
 
రాష్ట్ర జట్టుకు...
 
అయితే క్లబ్ క్రికెట్‌లో రికార్డులకు గుర్తింపు లేకపోవచ్చు కానీ...టెస్టు క్రికెట్ తర్వాతి స్థాయి ఉన్న ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తండ్రి కొడుకు కలసి ఆడటం మాత్రం నిజంగా విశేషమే. ఏడాది క్రితం ఈ అదృష్టమూ ఆ కుటుంబానికి దక్కింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో జరిగిన మ్యాచ్‌లో చందర్‌పాల్ ద్వయం గయానా తరఫున బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సీనియర్ 8, 108 పరుగులు చేయగా, జూనియర్ 42, 29 పరుగులు చేశాడు. ఇక మిగిలింది వెస్టిండీస్ తరఫున ఆడటమే...చందర్‌పాల్ ఇటీవల ఫామ్ చూస్తే మరో రెండేళ్లు ఆడగలడని భావిస్తే...వచ్చే రెండేళ్లు దేశవాళీలో తేజ్ చెలరేగితే తండ్రీ కొడుకులిద్దరినీ ఒకే టెస్టులో చూసే అదృష్టం వారి అభిమానులకు కలుగుతుందేమో. అన్నట్లు చందర్‌పాల్-2 ప్రస్తుతం ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరఫున ఆడుతున్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement