నేను, నాన్న... 50-50
చందర్‌పాల్, తేజ్ నారాయణ్‌ల అరుదైన ఘనత
జమైకా: క్రికెట్లో తండ్రీ కొడుకులు వేర్వేరుగా ఆడిన దాఖలాలున్నాయి. కానీ అధికారికంగా గుర్తింపు పొందిన ఒకే మ్యాచ్‌లో తండ్రీ తనయులు కలిసి ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఒకరి కెరీర్ ముగిశాక ఇంకొకరు బరిలోకి దిగిన వారున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఒకే మ్యాచ్‌లో ఆడిన తండ్రీ తనయుల అరుదైన కథ ఇది. చరిత్రకెక్కిన ఈ క్రికెట్ కహానిలో... శివనారాయణ్ చందర్‌పాల్, తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ రికార్డుకే మరో రికార్డును జోడించారు. శివనారాయణ్ చందర్‌పాల్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. వెస్టిండీస్ బ్యాటింగ్‌కు వెన్నెముకలాంటోడు. తేజ్‌నారాయణ్... పరిచయం చేయాల్సిన పేరు. చందర్‌పాల్ గారాల తనయుడు. పుట్టుకతోనే రక్తం పంచుకున్నాడు. పుట్టాక వారసత్వాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు పెరిగాక... క్రీజులో పరుగులు పంచుకుంటున్నాడు!
ఇద్దరు కలిసి దేశవాళీ క్రికెట్‌లో ఆడటమే ఒక రికార్డయితే... అందులో ఇద్దరూ అర్ధ సెంచరీలు బాదడం మరో రికార్డు. సండే రోజు ఈ సన్ అండ్ ఫాదర్ సెన్సేషన్ సృష్టించారు. జమైకాలోని సబీనా పార్క్‌లో జమైకా జట్టుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గయానా తరఫున ఈ ఫీట్ సాధించి చరిత్ర పుటలకెక్కారు. మొదట జమైకా 255 పరుగులు చేసి ఆలౌటైతే... తండ్రీ తనయుల అర్ధ సెంచరీలతో గయానా 262 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.విండీస్ క్రికెట్‌లో బ్రియాన్ లారా తర్వాత అత్యధిక టెస్టులు ఆడింది చందర్‌పాలే. 164 టెస్టుల్లో 11,867 పరుగులు చేశాడు సీనియర్ చందర్‌పాల్.
మరిన్ని విశేషాలు...
►చందర్‌పాల్ అంతర్జాతీయ అరంగేట్రం 1994లో చేశాడు. రెండేళ్ల (1996) తర్వాత అతని తనయుడు తేజ్‌నారాయణ్ జన్మించాడు.
► గతం (2012)లో దేశవాళీ కాని ఓ క్లబ్ మ్యాచ్‌లో ఇద్దరూ సెంచరీలు బాదేశారు.
►తేజ్ నారాయణ్‌కు ఇది మూడో అర్ధ సెంచరీకాగా తండ్రితో కలిసి చేయడం ఇదే మొదటిసారి.
►అచ్చు తండ్రిలాగే వికెట్ల ముందు స్టాన్స్ తీసుకుంటాడు. బెయిల్స్‌ను తీసి బ్యాట్‌తో పిచ్‌పై తన గార్డ్ మార్క్ వేసుకుంటాడు.
►బ్యాటింగ్ శైలీ కూడా అదే. చందర్‌పాల్ ఎడంచేతి ఆటగాడైతే తేజ్ కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మనే!