Chanderpaul
-
నేను, నాన్న... 50-50
చందర్‌పాల్, తేజ్ నారాయణ్‌ల అరుదైన ఘనత జమైకా: క్రికెట్లో తండ్రీ కొడుకులు వేర్వేరుగా ఆడిన దాఖలాలున్నాయి. కానీ అధికారికంగా గుర్తింపు పొందిన ఒకే మ్యాచ్‌లో తండ్రీ తనయులు కలిసి ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఒకరి కెరీర్ ముగిశాక ఇంకొకరు బరిలోకి దిగిన వారున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఒకే మ్యాచ్‌లో ఆడిన తండ్రీ తనయుల అరుదైన కథ ఇది. చరిత్రకెక్కిన ఈ క్రికెట్ కహానిలో... శివనారాయణ్ చందర్‌పాల్, తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ రికార్డుకే మరో రికార్డును జోడించారు. శివనారాయణ్ చందర్‌పాల్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. వెస్టిండీస్ బ్యాటింగ్‌కు వెన్నెముకలాంటోడు. తేజ్‌నారాయణ్... పరిచయం చేయాల్సిన పేరు. చందర్‌పాల్ గారాల తనయుడు. పుట్టుకతోనే రక్తం పంచుకున్నాడు. పుట్టాక వారసత్వాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు పెరిగాక... క్రీజులో పరుగులు పంచుకుంటున్నాడు! ఇద్దరు కలిసి దేశవాళీ క్రికెట్లో ఆడటమే ఒక రికార్డయితే... అందులో ఇద్దరూ అర్ధ సెంచరీలు బాదడం మరో రికార్డు. సండే రోజు ఈ సన్ అండ్ ఫాదర్ సెన్సేషన్ సృష్టించారు. జమైకాలోని సబీనా పార్క్‌లో జమైకా జట్టుతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గయానా తరఫున ఈ ఫీట్ సాధించి చరిత్ర పుటలకెక్కారు. మొదట జమైకా 255 పరుగులు చేసి ఆలౌటైతే... తండ్రీ తనయుల అర్ధ సెంచరీలతో గయానా 262 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.విండీస్ క్రికెట్లో బ్రియాన్ లారా తర్వాత అత్యధిక టెస్టులు ఆడింది చందర్పాలే. 164 టెస్టుల్లో 11,867 పరుగులు చేశాడు సీనియర్ చందర్‌పాల్. మరిన్ని విశేషాలు... ►చందర్‌పాల్ అంతర్జాతీయ అరంగేట్రం 1994లో చేశాడు. రెండేళ్ల (1996) తర్వాత అతని తనయుడు తేజ్‌నారాయణ్ జన్మించాడు. ► గతం (2012)లో దేశవాళీ కాని ఓ క్లబ్ మ్యాచ్‌లో ఇద్దరూ సెంచరీలు బాదేశారు. ►తేజ్ నారాయణ్‌కు ఇది మూడో అర్ధ సెంచరీకాగా తండ్రితో కలిసి చేయడం ఇదే మొదటిసారి. ►అచ్చు తండ్రిలాగే వికెట్ల ముందు స్టాన్స్ తీసుకుంటాడు. బెయిల్స్‌ను తీసి బ్యాట్‌తో పిచ్‌పై తన గార్డ్ మార్క్ వేసుకుంటాడు. ►బ్యాటింగ్ శైలీ కూడా అదే. చందర్‌పాల్ ఎడంచేతి ఆటగాడైతే తేజ్ కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మనే! -
అగ్నిప్రమాదంలో చిన్నారి మృత్యువాత
గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక చిన్నారి చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. గ్రామానికి చెందిన జంగా చంద్రపాల్, రజని దంపతులకు ఏడు నెలల కుమార్తె ఉంది. మంగళవారం ఆ ఇంట్లో జరగాల్సిన ఒక కార్యక్రమానికి బంధువులు కూడా వచ్చారు. సోమవారం రాత్రి అంతా ఇంట్లో నిద్రించారు. తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకుని ఇంట్లో పడుకున్న ఏడుగురు గాయాలపాలయ్యారు. వారిని గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చంద్రపాల్, రజని దంపతుల కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. -
అది నన్ను కలిచివేసింది:లారా
దుబాయ్: వెస్టిండీస్ మేటి క్రికెటర్లలో ఒకడైన శివనారయణ్ చందర్‌పాల్ కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం నిజంగా బాధాకరమని ఆ దేశ లెజెండ్ క్రికెటర్ బ్రియాన్ లారా పేర్కొన్నాడు. ఒక్క టెస్టు మ్యాచ్ లో అతనికి అవకాశం కల్పించి ఘనంగా ఫెర్వెల్ చెబితే బాగుండేదన్నాడు. వెస్టిండీస్ టెస్టు జట్టు నుంచి అతన్ని తొలగించడమే కాకుండా, వీడ్కోలుకు చెప్పకపోవడం తనను కలచివేసిందని లారా తెలిపాడు. చందర్‌పాల్ నిజంగా ఒక మంచి క్రికెటర్. 20సంవత్సరాల నుంచి జట్టుకు సేవలందిస్తున్న చందర్‌పాల్ కు ఇంకా స్థానం కల్పించాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ వీడ్కోలు చెప్పే క్రమంలో అతనికి ఒక అవకాశం ఇవ్వాల్సింది. ఇది చందర్‌పాల్‌ను కూడా తీవ్రంగా బాధించి ఉంటుంది'అని లారా తెలిపాడు. ఈ సందర్భంగా తన సమకాలీన క్రికెటర్ అయిన చందర్‌పాల్ తో ఆడిన క్షణాలను లారా గుర్తు చేసుకున్నాడు. ఇటీవల చందర్‌పాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అన్ని ఫార్మెట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చందర్ పాల్ తప్పుకున్నాడు. తన కెరీర్ లో 164 టెస్టు మ్యాచ్‌లు ఆడిన చందర్‌పాల్ 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీల సాయంతో 11, 867 పరుగులు చేసి విండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో టెస్టు క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. అతని కంటే ముందు బ్రియాన్ లారా(11,953) ఉన్నాడు. -
22 ఏళ్ల కెరీర్ కు ముగింపు
రిటైర్మెంట్ ప్రకటించిన చందర్‌పాల్ సెయింట్ జాన్స్ (అంటిగ్వా అండ్ బార్బుడా): శివ్‌నారాయణ్ చందర్‌పాల్.... రెండు దశాబ్దాలకు పైగా తన అద్భుత ఆటతీరుతో వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన సీనియర్ బ్యాట్స్‌మన్. జట్టులో చోటు దక్కడం ఇక అసాధ్యంగా మారడంతో తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై పలికాడు. 1994లో తొలి టెస్టు ఆడిన చందర్‌పాల్ 22 ఏళ్ల పాటు విండీస్ జట్టుకు తన సేవలందించాడు. జట్టు తరఫున లారా తర్వాత అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్లో 51.37 సగటు సాధించాడు. ఆధునిక క్రికెట్లో రెండు దశాబ్దాలకు పైగా ఆటగాడిగా కొనసాగిన ఘనత సచిన్ టెండూల్కర్ తర్వాత 41 ఏళ్ల చందర్‌పాల్ కే దక్కుతుంది. అయితే సచిన్‌లా పేరు ప్రఖ్యాతులు దక్కకపోయినా విండీస్ క్రికెట్‌కు చాలా ఏళ్లు మూలస్తంభంలా నిలిచి సేవలందించాడు. అయితే కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో జట్టు ఎంపికలో తనను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2015 మేలో చివరి టెస్టు ఆడాడు. చందర్‌పాల్ మొత్తం 164 టెస్టుల్లో 30 శతకాలతో 11,867 పరుగులు చేశాడు. విండీస్ తరఫున లారా (11,953) అత్యధిక పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 203 నాటౌట్. 268 వన్డేల్లో 8,778 పరుగులు చేయగా, ఇందులో 11 సెంచరీలున్నాయి. 22 టి20లు ఆడి 343 పరుగులు చేశాడు. -
'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'
జోహన్స్ బర్గ్: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ శివనారయణ్ చందర్ పాల్ ను ఎంపిక చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన కెరీర్ లో చివరి సిరీస్ అవుతుందనుకుని భావించినా.. తుది జట్టులో ఎంపిక కాకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. చందరపాల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ అతను ఇంకా క్రికెట్ వీడ్కోలు తీసుకోని సంగతి తెలిసిందే. అయితే దీనిపై వెస్టిండీస్ బోర్డుకు చందర్ పాల్ విన్నవించినా సరైన స్పందన రాలేదు. ఇదిలా ఉండగా దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ క్లైవ్ లాయిడ్ భిన్నంగా స్పందించాడు. వెస్టిండీస్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా యువకులకు చాన్స్ ఇచ్చే క్రమంలోనే చందరపాల్ కు చోటు దక్కలేదన్నాడు. గురువారం ప్రకటించిన 12 మంది సభ్యులతో కూడిన క్రికెటర్ల జాబితాలో చందరపాల్ కు చోటు లభించలేదు. -
వచ్చేశాడు చందర్‌పాల్-2
మా తాతల కాలంనుంచీ క్రికెట్ ఆడుతున్నా...మా రక్తంలోనే ఆట ఉంది...ఇలాంటి డైలాగ్‌లు మనం చాలానే విన్నాం. నిజమే...ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు, వారి మనవలు, పిల్లలు, అన్నదమ్ములు...ఇలా ఎందరో తమ జాతీయ జట్లకు ఆయా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారు. అయితే ఎప్పుడైనా ‘ నేను, మా నాన్న కలిసి ఫలానా మ్యాచ్‌లో ఆడాం. ఇద్దరం కలిసి జట్టును గెలిపించాం‘ అని ఎవరైనా క్రికెటర్ వ్యాఖ్యానించారా. అయితే వెస్టిండీస్‌కు చెందిన తేజ్ నారాయణ్ చందర్‌పాల్ ఆ మాట బలంగా చెప్పగలడు. విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ శివ్ నారాయణ్ చందర్‌పాల్ పుత్రరత్నమే ఈ అబ్బాయి. జాతీయ స్థాయిలో గయానా జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఈ తండ్రి కొడుకులు ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఒకే మ్యాచ్‌లో ఆడటం అరుదైన ఘటనగానే చెప్పవచ్చు. క్రికెట్ చరిత్రలోనే దాదాపుగా ఇలాంటిది చోటు చేసుకోలేదు. నాకు 16...నీకు 38... ఎడమచేతి వాటం, గంటల కొద్దీ ఓపికతో బ్యాటింగ్...అచ్చంగా తండ్రిని పోలి ఉండే శైలి తేజ్ నారాయణ్‌ది. దాదాపు ఏడాదిన్నర క్రితం వీరిద్దరు తొలిసారి ఒకే జట్టులో క్లబ్ క్రికెట్ ఆడారు. ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గాంధీ యూత్ ఆర్గనైజేషన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ జోడి మూడో వికెట్‌కు 256 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు తేజ్ వయసు 16 కాగా...శివ్‌కు 38 ఏళ్లు. రాష్ట్ర జట్టుకు... అయితే క్లబ్ క్రికెట్లో రికార్డులకు గుర్తింపు లేకపోవచ్చు కానీ...టెస్టు క్రికెట్ తర్వాతి స్థాయి ఉన్న ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తండ్రి కొడుకు కలసి ఆడటం మాత్రం నిజంగా విశేషమే. ఏడాది క్రితం ఈ అదృష్టమూ ఆ కుటుంబానికి దక్కింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో జరిగిన మ్యాచ్‌లో చందర్‌పాల్ ద్వయం గయానా తరఫున బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సీనియర్ 8, 108 పరుగులు చేయగా, జూనియర్ 42, 29 పరుగులు చేశాడు. ఇక మిగిలింది వెస్టిండీస్ తరఫున ఆడటమే...చందర్‌పాల్ ఇటీవల ఫామ్ చూస్తే మరో రెండేళ్లు ఆడగలడని భావిస్తే...వచ్చే రెండేళ్లు దేశవాళీలో తేజ్ చెలరేగితే తండ్రీ కొడుకులిద్దరినీ ఒకే టెస్టులో చూసే అదృష్టం వారి అభిమానులకు కలుగుతుందేమో. అన్నట్లు చందర్‌పాల్-2 ప్రస్తుతం ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరఫున ఆడుతున్నాడు.