22 ఏళ్ల కెరీర్ కు ముగింపు
రిటైర్మెంట్ ప్రకటించిన చందర్‌పాల్
సెయింట్ జాన్స్ (అంటిగ్వా అండ్ బార్బుడా): శివ్‌నారాయణ్ చందర్‌పాల్.... రెండు దశాబ్దాలకు పైగా తన అద్భుత ఆటతీరుతో వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన సీనియర్ బ్యాట్స్‌మన్. జట్టులో చోటు దక్కడం ఇక అసాధ్యంగా మారడంతో తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై పలికాడు.
1994లో తొలి టెస్టు ఆడిన చందర్‌పాల్ 22 ఏళ్ల పాటు విండీస్ జట్టుకు తన సేవలందించాడు. జట్టు తరఫున లారా తర్వాత అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో 51.37 సగటు సాధించాడు. ఆధునిక క్రికెట్‌లో రెండు దశాబ్దాలకు పైగా ఆటగాడిగా కొనసాగిన ఘనత సచిన్ టెండూల్కర్ తర్వాత 41 ఏళ్ల చందర్‌పాల్ కే దక్కుతుంది.
అయితే సచిన్‌లా పేరు ప్రఖ్యాతులు దక్కకపోయినా విండీస్ క్రికెట్‌కు చాలా ఏళ్లు మూలస్తంభంలా నిలిచి సేవలందించాడు. అయితే కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో జట్టు ఎంపికలో తనను పరిగణనలోకి తీసుకోవడం లేదు. 2015 మేలో చివరి టెస్టు ఆడాడు. చందర్‌పాల్ మొత్తం 164 టెస్టుల్లో 30 శతకాలతో 11,867 పరుగులు చేశాడు. విండీస్ తరఫున లారా (11,953) అత్యధిక పరుగులు చేశాడు.
అత్యధిక స్కోరు 203 నాటౌట్.
268 వన్డేల్లో 8,778 పరుగులు చేయగా, ఇందులో 11 సెంచరీలున్నాయి.
22 టి20లు ఆడి 343 పరుగులు చేశాడు.