అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన డ్వేన్ బ్రావో
టి20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత
రెండు టి20 ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గిన విండీస్ జట్టులో సభ్యుడు
ప్రపంచంలోని ఏ మూల ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో అతడు ఉండాల్సిందే! జాతీయ జట్టు మొదలుకొని... విశ్వవ్యాప్తంగా మొత్తం 43 జట్లకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర అతడిది! అటు బౌలర్‌గా ఇటు బ్యాటర్‌గా మైదానంలో ఆల్‌రౌండ్ మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అతడు!
రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యధిక ట్రోఫీలు సాధించిన ప్లేయర్... ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన అతడే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. రెండు దశాబ్దాలుగా ఏదో ఒక జట్టులో ప్లేయర్‌గా కొనసాగుతున్న డ్వేన్ బ్రావో ఆటగాడిగా తన క్రికెట్ ఇన్నింగ్స్‌కు శుభంకార్డు వేశాడు.
ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా ఏదో ఒక హోదాలో ఈ ఆటలోనే కొనసాగేందుకు బ్రావో నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున బ్రావో ‘మెంటార్’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు దశాబ్దాలుగా మైదానంలో తన ఆటతీరుతో పాటు ఆటాపాటతోనూ అశేష అభిమానులను సొంతం చేసుకొని ప్లేయర్‌గా రిటైరైన నేపథ్యంలో ‘చాంపియన్’ బ్రావోపై ప్రత్యేక కథనం.
టి20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి పొట్టి క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆటలోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకున్నాడు. మూడేళ్ల క్రితమే జాతీయ జట్టు తరఫున చివరి టి20 మ్యాచ్ ఆడిన బ్రావో... తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో 582 టి20 మ్యాచ్‌లాడిన 41 ఏళ్ల బ్రావో... 631 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ స్టార్ రషీద్ ఖాన్ 613 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకునే సమయానికి 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించిన బ్రావో... వచ్చే సీజన్ నుంచి ‘మెంటార్’గా దర్శనమివ్వనున్నాడు. ఐపీఎల్‌లో అపార అనుభవం ఉన్న బ్రావో... డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించిన బ్రావో... టి20ల్లో చివరి నాలుగు (17 నుంచి 20) ఓవర్లలో 322 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్స్‌లో 201 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.
చెన్నై చిన్నోడు!
ఐపీఎల్ ఆరంభం నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడే బ్రావో... సుదీర్ఘ కాలం పాటు చెన్నై ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. ప్రత్యర్థి ప్లేయర్లు భారీ షాట్లు కొడుతున్న ప్రతిసారీ ధోని బంతిని బ్రావో వైపు విసిరే వాడంటే... అతడిపై మహీకి ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు.
ఇతర లీగ్‌లతో పోల్చుకుంటే ఐపీఎల్‌లో తన బౌలింగ్‌తోనే ఎక్కువ ఆదరణ పొందిన బ్రావో... అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో సందేహం లేదు. సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తే చుట్టు పక్కల గోడ కట్టినట్లే అనే గుర్తింపు తెచ్చుకున్న బ్రావో... బౌండరీ మీద ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు.
సిక్సర్ ఖాయమనుకున్న బంతిని సైతం కచ్చితమైన అంచనాతో గాల్లోకి ఎగిరి అమాంతం ఒడిసి పట్టడంలో బ్రావోది అందెవేసిన చేయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఎప్పుడూ బౌండరీ వద్దే కనిపించేవాడు. ఆటతీరుతోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి వాటికి నృత్యరీతులను జత చేయడంలోనూ బ్రావో సిద్దహస్తుడు.
ఆటతో పాటే పాట!
మైదానంలో ఎంతో సరదాగా ఉండే బ్రావోను ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఇష్టపడేవారు. వికెట్ తీసినప్పుడు జరుపుకునే సంబరాల నుంచి మొదలుకొని విజయం సాధించినప్పుడు చేసే డాన్స్ వరకు అన్నిట్లో ప్రత్యేకత చాటుకున్న బ్రావో.. ఐపీఎల్‌లో రెండు సీజన్‌లలో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013 సీజన్‌లో 32 వికెట్లు తీసిన బ్రావో... 2015లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 ఫార్మాట్‌లో 684 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉండగా... 582 మ్యాచ్‌లతో బ్రావో రెండో స్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ (542 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (525 మ్యాచ్‌లు), రసెల్ (523 మ్యాచ్‌లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఫ్రాంచైజీ క్రికెట్‌లో విశ్వవ్యాప్తంగా 28 జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2012, 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కెరీర్‌లో పదో స్థానంలో మినహా అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దిగిన బ్రావో... 442 ఇన్నింగ్స్‌ల్లో 6970 పరుగులు సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోగా... 20 అర్ధశతకాలు ఉన్నాయి.
ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం
బ్యాట్‌తో 5 వేల పైచిలుకు పరుగులు... బంతితో 300 వికెట్లు... 200 క్యాచ్‌లు పట్టిన బ్రావో నిఖార్సైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్‌లో 17 టోర్నమెంట్ ఫైనల్స్‌లో బ్రావో విజేతగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇదే అత్యధికం కాగా... కీరన్ పొలార్డ్ 16 టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు (2015, 2017, 2018, 2020, 2021), ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడు (2011, 2018, 2021), ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో రెండు (2012, 2016), కరీబియన్ టి20 లీగ్‌లో రెండు (2011/12, 2012/13), స్టాన్‌ఫోర్డ్ లీగ్ (2007/08), సీఎల్‌టి20 (2014), బీపీఎల్ (2016/17), పీఎస్‌ఎల్ (2019), ఐఎల్‌టి20 (2023/24)ల్లో ఒక్కో టైటిల్ సాధించాడు.
ఆటగాడిగా ఉన్న సమయంలోనే సహచరులకు అవసరమైన సమయాల్లో సూచనలిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన బ్రావో... ఇప్పుడు ఇక పూర్తిస్థాయిలో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సుదీర్ఘ కాలంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment